Apr 17 2021 @ 10:14AM

కార్తీక్ ఆర్యన్‌కి కంగన సపోర్ట్..!

ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యాక చిత్ర యూనిట్ మధ్య క్రియేటివ్ డిఫ్రెన్స్ రానంతవరకు బాగానే ఉంటుంది. వస్తే మాత్రం చిత్ర యూనిట్ నుంచి ఎవరో ఒకరు బయటికి రావాల్సి వస్తుంది. అయితే కొన్ని ప్రాజెక్ట్స్ విషయంలో దర్శక - నిర్మాత - నిర్మాత - హీరో సహా మిగతా టెక్నీషియన్స్‌తో క్రియేటివ్ డిఫ్రెన్స్ వచ్చి ప్రాజెక్ట్ నుంచి తప్పించిన సందర్భాలు చాలానే జరగడం ఇటీవల కాలంలో బాగా కనిపిస్తున్నాయి. కోలీవుడ్ లో ఒక పెద్ద బ్యానర్‌లో బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్  తెరకెక్కిస్తున్న స్టార్ డైరెక్టర్ కూడా నిర్మాతలతో ఇలా క్రియేటివ్ డిఫ్రెన్స్ వల్లే అర్ధాంతరంగా బయటికి వచ్చాడు. కాగా ఇలాంటి వ్యవహారమే బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో జరిగింది. హిందీలో తెరకెక్కుతున క్రేజీ సీక్వెల్ దోస్తానా 2 సినిమా విషయం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 

హీరో- నిర్మాత మధ్య మనస్పర్ధలు వచ్చి హీరోని ప్రాజెక్ట్ నుంచి తొలగించారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ హీరో కార్తీక్ ఆర్యన్ కాగా.. నిర్మాత కరణ్ జోహార్. కార్తీక్ ఆర్యన్‌కి చెందిన టాలెంట్ ఏజెన్సీ సీక్వెల్ సినిమాకి కాల్షీట్లు ఇవ్వక పోవడంతో మేకర్స్ కార్తీక్ ఆర్యన్ స్థానంలో మరొక హీరోని తీసుకోబోతున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

2019లోనే కార్తీక్ ఆర్యన్ దోస్తానా 2 టీమ్ లో జాయిన్ అయ్యాడు. అయితే గత సంవత్సరం కరోనావైరస్ కారణంగా ఈ సినిమా నిలిచిపోయింది. ఇటీవల మళ్ళీ సెట్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. కానీ తాజాగా కార్తీక్ ని తొలగించారట. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఈ విషయంలో తాజాగా స్పందించింది. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినంత మాత్రాన కార్తీక్ వచ్చే నష్టం ఏమీ లేదని..ఇలాంటి వాటికి తనేమి భయపడడని..తన గురించి అనవసరమైన కామెంట్స్ చేయకుండా వదిలేయమంటూ కంగనా చెప్పుకొచ్చింది.