Abn logo
Sep 20 2020 @ 15:10PM

బలవంతంగా శివసేనకు ఓటేశా: తప్పులో కాలేసిన కంగనా

Kaakateeya

ముంబై: తరుచూ వివాదాల్లో నిలిచే బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్.. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో మరింత వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనపై ప్రభుత్వ పెద్దలపై కంగనా చేస్తున్న కామెంట్లు దేశ వ్యాప్త చర్చకు దారి తీస్తున్నాయి. కాగా, తాజాగా శివసేనను కార్నర్ చేయబోయి తప్పులో కాలేశారు. గత ఎన్నికల్లో తాను శివసేను బలవంతంగా ఓటేశానని అన్నారు. అయితే వాస్తవం మరోలా ఉంది. కంగనా ఓటు హక్కు ఉన్న ప్రాంతంలో శివసేన అభ్యర్థి పోటీ చేయలేదు. శివసేన-బీజేపీ ఇరు పార్టీలు పొత్తుతో పోటీ చేసినప్పటికీ కంగనా ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు.


‘‘నాకు రాజకీయాలు అర్థం కాలేదు. ఎందుకంటే నేను చాలా అమాయకురాలిని. ఈ రాజకీయ పోత్తులు, పోటీలు ఎందుకు ఏర్పడతాయో నాకు తెలియదు. అయితే నేను బీజేపీ మద్దతురాలిని. కానీ మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి ఓటేయలేకపోయాను. ఎందుకంటే బీజేపీ-శివసేన పొత్తు వల్ల నేను ఓటు వేసే నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి నిల్చున్నారు. నేను కమలానికి ఓటేయాలనుకున్నాను. కానీ నాకు ఈవీఎంలో ఆ బటన్ కనిపించనే లేదు. ఇంకే చేసేది లేక శివసేనకు ఓటేయాల్సి వచ్చింది. నిజానికి ఇది నాకు నేను వేసిన ఓటు కాదు. నా చేత బలవంతంగా శివసేనకు ఓటేయించారు’’ అని ఓ టీవీ డిబేట్‌లో కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు.


అయితే, కమ్లేశ్ సుతార్ అనే జర్నలిస్ట్, కంగనా వ్యాఖ్యలను తప్పుడుగా నిర్ధారించారు. ‘‘మహారాష్ట్ర సీఈవో డాటా ప్రకారం.. కంగనా రనౌత్‌కు వెస్ట్ బాంద్రాలో ఓటు హక్కు ఉంది. ఒక వేళ కంగనా రనౌత్ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడితే బాంద్రా వెస్ట్ అభ్యర్థి బీజేపీ వ్యక్తి ఆశిశ్ షేలార్. లోక్‌సభ ఎన్నికల్లో గురించి అయితే ఆమె ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి పూనమ్ మహాజన్ పోటీ చేసి గెలిచారు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీ చేసినప్పటికీ రెండు స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులే పోటీ చేశారు’’ అని కమ్లేశ్ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement