కందుకూరు ప్రయాణం నరకప్రాయం..!

ABN , First Publish Date - 2021-12-06T06:06:27+05:30 IST

పశ్చిమ ప్రకాశంలో రెండు ప్రధాన నియోజకవర్గాలను కలిపే కందుకూరు-కనిగిరి రోడ్డు అధ్వానంగా తయారైంది.

కందుకూరు ప్రయాణం నరకప్రాయం..!
అధ్వానంగా ఉన్న కందుకూరు-కనిగిరి రహదారి

అగాధాలను తలపిస్తున్న గోతులు

ఎన్నికల హామీలు మరిచిన నేతలు

కనిగిరి, డిసెంబరు 5: పశ్చిమ ప్రకాశంలో రెండు ప్రధాన నియోజకవర్గాలను కలిపే కందుకూరు-కనిగిరి రోడ్డు అధ్వానంగా తయారైంది.  ఈ రోడ్డులో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తోంది.  రోడ్డు అంచుల్లో అగాదాల్లాంటి భారీగోతులు ఏర్పడ్డాయి. పైపెచ్చు రోడ్డంతా కోసుకుపోయి తారు లేచి ఉంది. దీంతో రోడ్డు అంతా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.

కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి 8 బస్సులు దాదాపు రోజుకు 28 సార్లు కందుకూరుకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆ బస్సులు ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటాయి. కనిగిరి నుంచి కందుకూరుకు వివిధ పనుల నిమిత్తం ప్రజలు రెండు వేల మంది వరకు నిత్యం బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. అంతేకాకుండా మార్కాపురం, వాకాడు, చెన్నై తదితర ప్రాంతాలకు కూడా కనిగిరి నుంచి కందుకూరు మీదుగా వెళ్లాల్సి ఉంది. 

అంచుదిగాలంటే ప్రమాదభరితమే...

నిత్యం రద్దీగా ఉంటున్నప్పటికీ, సింగిల్‌ రోడ్డు కావడంతో ఒక బస్సు  ఎదురొస్తే ముందున్న వాహనం రోడ్డు అంచుల్లోకి దిగాల్సిందే. దీంతో రోడ్డు అంచుల్లోకి వాహనం దిగితే వాహన చోదకులు నియంత్రణ కోల్పొవాల్సి వస్తోంది. దీంతో చిన్న ప్రమాదాలు ఈ రహదారిపై సర్వసాధారణంగా మారాయి. ఈ రోడ్డు వెంబడి ప్రమాదాలభారిన గాయపడ్డ వాహన చోదకులు అనేక మంది ఉన్నారు. 

కాంట్రాక్టు ఖరారైనా కదలని డబుల్‌ రోడ్డు పనులు

రహదారుల అభివృద్ధిలో భాగంగా  కందుకూరు రోడ్డు కూడా డబుల్‌ రోడ్డు నిర్మించేందుకు టీడీపీ హాయాంలో ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఎన్‌.హెచ్‌-35 పేరుతో ఊళ్లపాలెం నుంచి వేములపాడు వరకు డబుల్‌ రోడ్డు 96కి.మీ నిర్మించేందుకు అంతా సిద్ధమైంది.  కాంట్రాక్టర్లు ఎంపిక కూడా జరిగింది. 96 కిలోమీటర్లలో ప్రభుత్వ వచ్చిన కొత్తల్లో 20 కిలోమీటర్ల పైగా కందుకూరు నుంచి సింగరాయకొండ వరకు పనులు జరిగి అనంతరం ఆగి పోయాయి. మిగతా రోడ్డు పనులు చేసేందుకు కాంట్రాక్టర్‌ ముందుకు రాకపోవడంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో ఈ దారిలో ఒళ్లుహూనం చేసుకోవడం వాహనచోదకులకు నిత్యకృత్యంగా మారింది.

 ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రచారం 

 అధికార పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు గొప్పగా కందుకూరు రోడ్డు వేయిస్తాం అని హామీలు గుప్పించారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో బాగంగా కందుకూరు నుంచి కనిగిరికి రోడ్డు మార్గం ద్వారా పాదయాత్ర చేసిన ప్రస్తుత సీఎం జగన్మోహనరెడ్డి ఆనాడు రోడ్డు అభివృద్ధికి హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్నికలు ప్రచారంలో ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ జగన్‌హామీని నెరవేర్చి తీరుతాం అని ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్ళు అయినా ఇంతవరకు కందుకూరు రోడ్డుపై కంకర కూడా వేసిన పాపాన పోలేదు. వెరసి ఆ రోడ్డులో ప్రయాణం అంటేనే జనం బెంబేలెత్తి పోతున్నారు. ఈ రోడ్డు అభివృద్ధి జరిగి ఉంటే కందుకూరు రోడ్డు డబుల్‌ రోడ్డుగా రూపాంతరం చెంది రాకపోకలకు సునాయాసంగా ఉండేవి. ఇప్పటికైనా పాలకులు ఆ దిశగా అడుగులు వేసి కందుకూరు రోడ్డును డబుల్‌ రోడ్డుగా కాక పోయినా ఉన్న రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-12-06T06:06:27+05:30 IST