సోషల్‌మీడియాతో కాసేపు కాలక్షేపం

ABN , First Publish Date - 2020-07-06T20:47:00+05:30 IST

భారత స్వాతంత్ర్యోద్యమ వీరుల పోరాట కథలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల వీర గాథలను యువతరానికి పరిచయం చేసిన ప్రముఖ రచయిత కందిమళ్ల ప్రతాపరెడ్డి.

సోషల్‌మీడియాతో కాసేపు కాలక్షేపం

అనుభవం

భారత స్వాతంత్ర్యోద్యమ వీరుల పోరాట కథలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల వీర గాథలను యువతరానికి పరిచయం చేసిన ప్రముఖ రచయిత కందిమళ్ల ప్రతాపరెడ్డి. ఆయన వయసు 87ఏళ్లు. ఈ ఖాళీ సమయాన్ని కొత్త పుస్తకాల ప్రచురణకు అనువుగా మలుచుకొన్న ప్రతాపరెడ్డిని లాక్‌డౌన్‌ వేళ ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన రోజూవారీ జీవితంలోని కొన్ని విషయాలు, మరికొన్ని జ్ఞాపకాలను వివరించారు.


హైదరాబాద్‌ సిటీ, జూలై 5(ఆంధ్రజ్యోతి): కరోనా భయంతో నాలుగు నెలలుగా హౌస్‌ అరెస్టులో ఉన్నా. నా జీవితంలో ఇన్నిరోజులు ఇంటిపట్టున ఎన్నడూ లేను. అటూ, ఇటూ తిరిగే ప్రాణం కనుక, నాలుగు గోడల మధ్య గడపడం చాలా కష్టంగా తోస్తోంది. ఐసోలేషన్‌లో ఉన్నామనే భావన కలుగుతోంది. ఈ సమయంలో ఏ పనీ చేయబుద్ధికాదు. నిద్ర వచ్చినా, రాకున్నా... ఎప్పుడూ ఆ మంచానికి అతుక్కొని పడుండవలసి వస్తోంది. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే, నా చిన్ననాటి ఘటన ఒకటి గుర్తొస్తోంది.! మా జొన్నలగడ్డ గూడెం (నల్గొండ జిల్లా)లో కలరా ప్రబలడంతో సుమారు వందమందికి పైగా చనిపోయారు. ఆ దెబ్బతో ఊరంతా ఖాళీ అయింది.


గ్రామ శివారులోని పశువుల కొట్టాలు జనావాసాలుగా మారాయి. అప్పుడు నాకు ఏడేళ్లు ఉంటాయనుకుంటా. మళ్లీ ఇన్నేళ్లకు ఈ మహా ప్రళయాన్ని చూస్తున్నా. ఇక ఇప్పుడు రోజూ కాసేపు పుస్తకాలు చదువుతున్నా. ఇదివరకు నేను రాసి, ప్రచురితం కాని రచనల్లో... నా సోషలిస్టు రష్యా యాత్ర విశేషాలతో పాటు అరవై మంది పోరాట యోధుల సంక్షిప్త జీవిత చరిత్రను ‘స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టులు’ పేరుతో పుస్తకాలుగా తెస్తున్నా. వీరనారి భికాజీ రుస్తుం కామా, గదర్‌ పార్టీ వ్యవస్థాపకుడు సోహాన్‌సింగ్‌ భక్నా, పృథ్వీసింగ్‌ ఆజాద్‌, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ వంటి కొద్దిమంది గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల సంపుటిని ప్రచురించేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం ఈ పుస్తకాల ప్రూఫ్‌రీడింగ్‌ పనులతో సరిపోతోంది. చేతులకు ఆర్ద్రరైటీస్‌ వల్ల ఎక్కువగా రాయలేకపోతున్నా. 


లాక్‌డౌన్‌లో ఆరుసార్లు...

తోటపనంటే నాకు చాలా ఇష్టం. నాగోల్‌ వద్ద మాకున్న కొద్దిపాటి స్థలంలో రకరకాల మొక్కలు పెంచుతున్నా. అందులో పండ్లసాగూ చేస్తున్నా. నా తోటలో మామిడి, జామ, సపోట, బొప్పాయి, పనస వంటి అన్నిరకాల పండ్ల చెట్లూ ఉన్నాయి. ఔషధగుణాలు కలిగిన పలు రకాల మొక్కలూ దొరుకుతాయి. ఇదివరకు వారంలో ఐదురోజులు తోటలోనే గడిపేవాడిని. మొక్కలకు, చెట్లకు నీళ్లు పెట్టడం, పాదులు తొవ్వడం వంటి పనులతో రోజంతా బిజీగా గడిచేది. కరోనా భయంతో ఇప్పుడు అటువైపు వెళ్లడం తగ్గించా. అప్పటికీ మొక్కలమీద బెంగతో లాక్‌డౌన్‌లో ఆరు సార్లు తోటకి వెళ్లొచ్చాను. 


సిగరెట్‌ తాగుతా...

నాదొక అరాచకమైన జీవనశైలి. వ్యాయామం అస్సలు చేయను. సమయానికి భోజనం తినను. ఎందుకో నాకు పెద్దగా ఆకలి అనిపించదు. రోజూ బ్లాక్‌టీ మాత్రం తాగుతా. ప్రత్యేకమైన డైట్‌ అంటూ ఏమీ లేదు. ఒక్కోసారి తినాలని లేకుంటే, రెండు రోజులైనా ఉపవాసం ఉంటాను. బయట ఆహారం అస్సలు తీసుకోను. ఇక రాత్రిళ్లు అనవసరమైన విషయాలన్నీ జ్ఞప్తికొస్తాయి. దాంతో నిద్ర సరిగ్గా పట్టదు. బహుశా, అదీ వయసు ప్రభావం వల్ల అనుకుంటా. ఇంత వయసు వచ్చినా, రోజూ సిగరెట్లు తాగుతా. అవి మాత్రం మానలేకపోతున్నా. నాకు బీపీ, షుగర్‌ వంటి సమస్యలేమీ లేవు. లాక్‌డౌన్‌లో ఫోను పలకరింపులు పెరిగాయి. ఎక్కడెక్కడోవున్న పాత మిత్రులంతా ఇప్పుడు ఫోన్‌ చేసి, యోగక్షేమాలు అడుగుతున్నారు. నేనూ కొందరిని ఫోన్‌ద్వారా పలకరిస్తున్నా. పువ్వాడ నాగేశ్వరరావు(తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ నాన్న), అడపా అప్పారావు (ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మామ), నేను ఫోన్లో రోజూ మాట్లాడుకుంటాం. ముగ్గురం నెలకొకసారైనా తప్పనిసరిగా కలుస్తాం. రెండు నెలల తర్వాత, మళ్లీ జూన్‌ ఒకటిన కలుసుకున్నాం. మా మధ్య వర్తమాన రాజకీయాంశాలు ఎక్కువ చర్చకొస్తాయి. 

 

వైట్‌ నైట్స్‌..

1967 జూన్‌లో అక్టోబర్‌ విప్లవం యాభైవ వార్షికోత్సవానికి భారతదేశం నుంచి యువజన సంఘం ప్రతినిధిగా నన్ను రష్యా పంపారు. అదే నా తొలి విదేశీ ప్రయాణం. ఆ ఉత్సవాలకు వేదిక సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని సమ్మర్‌ ప్యాలస్‌. ఢిల్లీ నుంచి మాస్కోలో ఫ్లైట్‌ దిగాను. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, నాతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన మరికొందరు అతిథులను లోకల్‌ విమానంలో సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌కి తీసుకెళ్లారు. అక్కడ బసకేంద్రంలోకి వెళ్లాక, మమ్మల్ని డిన్నర్‌కి రమ్మని వలంటీర్లు పిలిచారు. ఆరు బయట చూస్తే, సూర్యుడు కాంతులీనుతున్నాడు. పట్టపగలు డిన్నర్‌ ఏంటి అనుకొని, గడియారం చూసుకున్నా. అయినా, నాకేమీ అర్థం కావడం లేదు. అప్పుడు ఒక మహిళా సంఘం నాయకురాలు చెప్పారు ‘పీటర్స్‌బర్గ్‌లో వైట్‌ నైట్స్‌’ ఉంటాయని. ఏడాదిలో పదిహేను రోజులు అక్కడ సూర్యుడు అస్తమించడు. ఆ సమయంలో రాత్రిళ్లు కూడా పగటిపూటను తలపిస్తాయి. 




భగత్‌సింగ్‌ని ఉరితీయలేదు...

సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాను. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో పాత జ్ఞాపకాలను పోస్టు చేస్తుంటా. వాట్సాప్‌ గ్రూపుల్లోని సామాజిక, రాజకీయ చర్చల్లో తరచుగా పాల్గొంటా. అందులో తలెత్తే వివిధ ప్రశ్నలకు బదులివ్వడం కోసం ఈ మధ్య వీడీ సావర్కర్‌ గురించి ఎక్కువ చదువుతున్నా. లాక్‌డౌన్‌లోనే ‘భగత్‌సింగ్‌’ జీవితంపై రెండు సార్లు ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఉపన్యసించాను. వీటిని చాలామంది యూత్‌ ఫాలో అయ్యారు కూడా. నేను రాసిన ‘భగత్‌సింగ్‌’ పుస్తకం ఇప్పటి వరకు 27ముద్రణలు పొందడం, నాకు గర్వకారణం. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీయలేదు, వాళ్లని ప్రతీకారంతో సాండర్స్‌ కుటుంబ సభ్యులు తుపాకీతో కాల్చి చంపారనే వాదనకూడా ఒకటుంది. కేఎస్‌ కూనర్‌, జీఎస్‌ సింధ్రా రాసిన ‘సమ్‌ హిడెన్‌ ఫ్యాక్ట్స్‌- మార్టెర్డోమ్‌ ఆఫ్‌ షహీద్‌ భగత్‌’ రచన ఆధారంగా ఆ వాదన మరింత బలపడింది. ఆ సమాచారాన్నీ ‘భగత్‌సింగ్‌’ బుక్‌ లేటెస్ట్‌ ఎడిషన్‌లో పొందుపరిచాను. నేను ఇప్పటి వరకు ఇరవై పుస్తకాలు రాశాను.


అందులో ‘చెగువేరా జీవితం-ఉద్యమం’, ‘గదర్‌ వీరగాథ’, ‘రాలిన రత్నాలు’(తెలంగాణ అమరవీరుల వీరగాథ), ‘బందూక్‌’ నవల తదితర రచనలతో పాటు ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం వంటి వైతాళికుల జీవిత చరిత్రలూ ఉన్నాయి. గొప్ప వ్యక్తుల పోరాట చరిత్రను రాయడం నాకు దక్కిన అవకాశం. కమ్యూనిస్టు పార్టీ చీలినప్పుడు గదర్‌పార్టీ వీరులు సోహాన్‌సింగ్‌ భాక్నా, పృద్వీసింగ్‌ ఆజాద్‌ కన్నీటిపర్యంతమైన దృశ్యానికి నేను ప్రత్యక్ష సాక్షిని కూడా. నేనూ సామ్యవాద భారతాన్ని చూస్తాననుకున్నా. కానీ నా ఆశ నెరవేరదని అర్థమైంది.  


కమ్యూనిస్టుల్లోనూ కులపిచ్చి...

కమ్యూనిస్టు పార్టీలలో కులాంతర వివాహాలను ప్రోత్సహించే సంస్కృతి 1980ల వరకు సాగింది. నాదీ కులాంతర వివాహమే. మా దండల పెళ్లికి యాభై మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నాకిద్దరు కొడుకులు, ఒక కుమార్తే. మా కుటుంబంలో  చాలామందివి కులాంతర, మతాంతర, ప్రాంతీయేతర వివాహాలే. కొద్ది రోజుల కిందటే నా మనుమరాలు (ఆచార్య ఎస్వీ సత్యనారాయణ చిన్న కుమార్తె) బెల్జియం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మా వాళ్లందరివీ రిజిస్ట్రర్‌ మ్యారేజీలే. అందులో మతాచారాలకు తావులేదు. ఇప్పుడు కులాంతర వివాహాలను కమ్యూనిస్టులు సైతం మరిచారు. ప్రస్తుతం చాలామంది కమ్యూనిస్టు పార్టీ నాయకులే కట్నకానుకలు, ఆడంబరాలకు పోవడం బాధాకరం. కమ్యూనిస్టు పార్టీలలోనూ కులపిచ్చి పెరిగింది.


ఒక పార్టీ అనికాదు, అన్నింటిలోనూ అదే తీరు. కుల, మతాలకు అతీతంగా ఆదర్శంగా నిలవాల్సిన వాళ్లే దారి తప్పారు. ఇక సామాన్యులను ఏమని అనగలం. ఆనాడు ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డిల కొడుకు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకొంటున్న కారణంగా, ఆ వివాహానికి వరుడి తల్లితండ్రులు కూడా వెళ్లలేదు. పార్టీ సిద్ధాంతానికి వాళ్లు ఇచ్చిన విలువ అలాంటిది మరి. ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీలు కళ్లు తెరిచి, కుల, మతాల అడ్డు తెరలను తొలగించే నూతన సాంస్కృతికోద్యమాన్ని చేపట్టాలనేది నా అభిమతం. 

Updated Date - 2020-07-06T20:47:00+05:30 IST