‘కంది’పోయింది..

ABN , First Publish Date - 2022-01-24T04:49:42+05:30 IST

వరుణుడు కంది రైతును నిండా ముంచారు.

‘కంది’పోయింది..
చింతలపూడిలో దూసుకుపోయిన కంది పైరు

 వర్షాలకు దెబ్బతిన్న పంట 

 పూర్తిగా రాలిపోయిన పూత

 రైతులకు తీవ్ర నష్టం

ముండ్లమూరు, జనవరి 23: వరుణుడు కంది రైతును నిండా ముంచారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట పూర్తిగా దెబ్బ తింది.  పూత, పిందె దశకు వచ్చే సరికి ఇటీ వల కురిసిన అధిక వర్షాలకు పూర్తిగా దూసుకు పోయింది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి తీరా పంట చేతికి వస్తుందనుకున్న సమయానికి వర్షాలు కంది రైతును కొంప ముంచాయి. 

ముండ్లమూరు మండలంలో 2665 హెక్టార్లలో కంది పైరు సాగు చేశారు. ఎకరానికి ఇప్పటికే రూ. ఆరు వేల నుంచి రూ.10వేల వరకు పెట్టుబడి పె ట్టారు. వర్షానికి ముందు పైరు  విపరీతంగా పెరగ డంతో దిగుబడి గణనీయంగా వస్తుందని ఎంతో ఆశ పడ్డారు. వర్షం రైతులకు గండి కొట్టింది.  కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ముందుగా రూ.5వేలు కౌలు చెల్లించి కంది సాగు చేశారు. పంట దూసుకు పోవటంతో పప్పు గింజలకు కూడా వెత్తుక్కోవాల్సిన పరిస్థితి ఈ ఏడాది దాపురించింది. 

మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం, పూరిమెట్ల, భీమవరం, పూరిమెట్ల, మారెళ్ళ, జమ్మలమడక, సుంకరవారిపాలెం, నాయుడుపాలెఎం, తమ్మలూరు, పసుపుగల్లు, పెదఉల్లగల్లు, వేములబండ, చింతలపూడి, శంకరాపురం, పోలారం తదితర గ్రామాల్లో అత్యధికంగా కంది  సాగు చేశారు. గత ఏడాది మార్కెట్‌లో కందులకు బాగా రేటు ఉండటంతో ఎక్కువ మంది ఈ ఏడాది సాగు చేశారు. వర్షంతో పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

పూత అంతా రాలిపోయింది..

సూర్యదేవర అంజయ్య, రైతు, ముండ్లమూరు

ఎనిమిది ఎకరాల్లో కంది పంటను సాగు చేశాను. పైరు బాగా పెరిగింది. పూత దశకు వచ్చే సరికే అధిక వర్షాలు కురవటంతో పూత రాలిపోయింది. ఇప్పటివరకు రూ.80వేలు పెట్టుబడి పెట్టాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. 

పంటను దున్ని వేస్తాం 

గిరిశాల శ్రీనివాసరావు, రైతు, వేములబండ

 ఈ ఏడాది ఐదు ఎకరాల్లో కంది పైరును సాగు చేశాను. ఎకరానికి రూ.8 వేల వరకు పెట్టుబడి పెట్టాను. ఇటీవల కురిసిన వర్షాలకు పూత మొత్తం రాలి పోయింది. ప్రస్తుతం పూత కూడా రావటం లేదు. చేసేదేమి లేక పైరు అంతా దున్ని వేయాలని నిర్ణయానికి వచ్చాం. 

Updated Date - 2022-01-24T04:49:42+05:30 IST