యవ్వనాన్ని కాపాడే కందకూర

ABN , First Publish Date - 2021-10-09T06:17:02+05:30 IST

పూర్వం అడవుల్లో జీవించిన మహర్షులు, మునులు కందమూలాలు తిని జీవించే వారంటే ఇప్పటి మనం నమ్మలేక పోవచ్చు.

యవ్వనాన్ని కాపాడే కందకూర

నల మహారాజు పాకదర్పణం

సూదస్తు కందమానీయ సూరణస్య నవం తతః రక్షయిత్వా త్వచం తస్య కల్కిన్యా విసృజేత్తతః

ఛిత్వా తద్గుణవత్సూక్ష్మం ప్రవణ్యా నిక్షిపేత్తతః సాముద్రం తత్ర నిక్షిప్య చించామ్లంచ వినిక్షిపేత్‌ 

చుల్యాం నిభాయ తద్భాండం తత్కందం తాద్దృశం భవేత్‌ పక్వే తస్మిన్‌ పునశ్చూర్ణ త్ర్యూషణస్య వినిక్షిపేత్‌

కైటర్యస్యఫలం తత్ర ధాన్యకం చ వినిక్షిపేత్‌, ప్రతాప ప్రవణీమాన్యాం భర్జయేత్రామఠాదిభిః

పూర్వం అడవుల్లో జీవించిన మహర్షులు, మునులు కందమూలాలు తిని జీవించే వారంటే ఇప్పటి మనం నమ్మలేక పోవచ్చు. ఎందుకంటే ఈ నాటికీ కందను మనం ధైర్యంగా తినలేని పరిస్థితి. కంద వేడి చేస్తుందని, పాత రోగాలను బైట పెడ్తుందనీ, అలర్జీలున్నవారికి సరిపడదనీ ఇలాంటి అపోహలు మనకు చాలా ఉన్నాయి. కందని తింటే కలిగే ఇబ్బందులు ఏమైనా ఉంటే దానిని వండే తీరు వలన మాత్రమే కలుగుతున్నాయి.


ఆరోగ్యదాయకంగా వండుకుంటే సర్వ రోగనివారిణి

ఆయుర్వేద శాస్త్ర ప్రకారం కంద దుంప మొలల వ్యాధికి నివారకంగా ప్రసిద్ధి. కాగా, చైనా, జపాన్‌, కొరియా సంప్రదాయ వైద్యులు దగ్గు, పేగుపూత, బొబ్బలు, చర్మవ్యాధుల్ని తగ్గిస్తుందని భావిస్తారు. కంద దుంపలో ఆహార పీచు(డైటరీ ఫైబర్‌) ఆరోగ్యదాయక మైనదిగా ఉంటుంది. ఇందులో నాణ్యమైన ‘ఎ’ విటమిన్‌ కూడా ఉంటుంది. అందుకని, పెద్ద పేగుల్లో కేన్సరు వ్యాధి మీద, ఊపిరితిత్తుల్లో కేన్సరు మీద ఇది ప్రభావం చూపుతుందని కనుగొన్నారు. ముంచుకొచ్చే ముసలితనాన్ని నివారిస్తుంది. క్యారట్లో ఉన్నట్టే ఇందులో కెరటీన్‌, ఇతర విషదోషహర (యాంటీ ఆక్సిడెంట్స్‌) రసాయనాలు పుష్కలంగా ఉండటం చేత ఇది దేహదారుఢ్యాన్ని కాపాడేదిగా ఉంటుంది. కేశాల నాణ్యతని కూడా పెంచుతుంది. షుగరు వ్యాధికి సంబంధించిన గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువస్థాయిలో ఉండేలా దీనిలో ఫైబరు సహకరిస్తుంది. షుగరు రోగులకు దుంపకూరలు పనికి రావన్నది బంగాళాదుంపలకు వర్తిస్తుందే కానీ, కంద దుంప విషయంలో భయపడనవసరం లేదు. 


కందలో పొటాషియం, మెగ్నీషియం భాస్వరం. క్యాల్షియం, ఇనుము, రాగి, సెలీనియం, జింకు లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బి కాంప్లెక్సు ఎక్కువగా ఉంటుంది. అందువలన యవ్వనాన్ని కాపాడే శక్తి కందకుంది. వాపుని, గడ్డల్ని కరిగిస్తుంది  జీర్ణకోశవ్యవస్థ ఆరోగ్యదాయకంగా ఉండేలా సహకరిస్తుంది. విరేచనం ఫ్రీగా అయ్యేలా చేసి, మలబద్ధకాని పోగొడుతుంది. తద్వారా మొలల వ్యాధిని జయించేందుకు సహకరిస్తుంది. లివరుని, పెద్ద పేగులను బలసంపన్నం చేస్తుంది. కోలన్‌ కేన్సర్‌, సిర్రోసిస్‌ వ్యాధులు వచ్చిన వారికి తప్పకుండా కందని వండిపెట్టటం మంచిది. బీపీని, రక్తస్రావాన్ని, కొలెస్టరాల్ని తగ్గిస్తుంది. స్థూలకాయానికి విరుగుడుగా పనిచేస్తుంది. 


కందతో ముద్దకూర చేసే విధానాన్ని నలుడు ఇలా వివరించాడు

తాజా కందదుంపనే ఎంచుకోండి. బ్రష్‌తో మట్టంతా పోయేలా బాగా రుద్ది కడగండి. చాకుతో కందపైన చెక్కు తీసేయండి. కందకు దురదపెట్టే గుణం ఉంటుంది కాబట్టి చేతులకు నూనె రాసుకుని తరగాలని మరిచిపోకండి. లేదా గ్లవుజులు వాడండి. చెక్కుతీసిన కందని చిన్న ముక్కలుగా తరిగి నీళ్లతో కడగండి. ఈ ముక్కల్ని భాండీలో వేసి వాటిమీద ఉప్పు, చింతపండు రసం కలిపి, మూతబెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి. ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత శొంఠి పిప్పళ్లు, మిరియాలపొడిని చల్లండి. మెంతుల్ని, జీలకర్రని విడివిడిగా దోరగా వేగించి దంచిన పొడిని కూడా కలపండి. ఇప్పుడు కాయఫలం ఆకు లేదా బిరియానీ ఆకుని ముక్కలుగాచేసి అందులో వెయ్యండి. ఓ ఇనుపగరిటలో లేదా చిన్నభాండీలో నెయ్యి ఇంగువ తాలింపు వేయించి ఈ కూరకు కలిపి మూతపెట్టండి. పొయ్యి మీంచి దించిన తరువాత కొద్దిగా పచ్చకర్పూరం కలిపితే, పరిమళభరితంగా ఉంటుంది. 


కందని భయపడకుండా తినండి. అది అన్నిరోగాలకు పథ్యం. అంటే తినదగినదని! కడుపులో నులిపురుగులను చంపుతుంది. జఠరాగ్నిని పెంచుతుంది. శ్రమని, అలసటని పోగొడుతుంది. విషదోషాలను హరిస్తుంది. పుష్టినిస్తుంది. చర్మవ్యాధులమీద పనిచేస్తుంది. వీర్యవర్థకం...అని కందకూర గుణాలను నలుడు పేర్కొన్నాడు. దొరికితే అడవి కందని తెచ్చుకుని కూరగా వండుకుంటే పైన చెప్పిన గుణాలు రెట్టింపు అవుతాయన్నాడు నలుడు. ప్రయత్న పూర్వకంగా దానిని సంపాదించాలని చెప్పాడు. మామూలు కంద కన్నా అడవి కంద కారంగా ఉంటుంది. గుండె జబ్బులకు మేలు చేస్తుందనీ, విషవికారాలకు విరుగుడుగా పనిచేస్తుందనీ అన్నాడు. మొలల రోగానికి అడవి కంద గొప్ప ఔషధమే! కంద దుంపలాగానే, కలువ దుంప, తామర దుంప, అరటి దుంపలతో కూడా కూర వండుకొని తినవచ్చు. మూలకం అంటే ముల్లంగి దుంపతో కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. తామర, కలువ దుంపలు బుద్ధి వర్ధకాలనీ, వేడిని హరిస్తాయనీ నలుడు పేర్కొన్నాడు. ముల్లంగి దుంపలు పేగులను సంరక్షించేవిగా ఉంటాయన్నాడు. అరటి గెలని కోశాక చెట్టుని కొట్టేస్తారు. దుంపను కుళ్లగించి పారేస్తారు. అది వండుకుని తినవలసిన దుంపకూర అని మనలో చాలా మందికి తెలీదు. అరటికాయకు ఉండే గుణాలన్నీ అరటి దుంపకూ ఉన్నాయి. ఇదే పద్ధతిలో వండుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని ఉపయోగించుకోవటంలోనే మన గొప్పతనం ఉంది.


-గంగరాజు అరుణాదేవి 

Updated Date - 2021-10-09T06:17:02+05:30 IST