డిజైన్‌ లోపం.. రైతులకు శాపం!

ABN , First Publish Date - 2020-10-28T15:50:23+05:30 IST

కంచికచర్ల బైపాస్‌ రోడ్డు విస్తరణతో ముంపు సమస్య ఏర్పడింది. డిజైన్‌లోపం వల్ల వర్షపునీరు వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి..

డిజైన్‌ లోపం.. రైతులకు శాపం!

కంచికచర్ల బైపాస్‌ విస్తరణలో ముంపును పట్టించుకోని అధికారులు


కంచికచర్ల: కంచికచర్ల  బైపాస్‌ రోడ్డు విస్తరణతో ముంపు సమస్య ఏర్పడింది. డిజైన్‌లోపం వల్ల వర్షపునీరు వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. వందలాది ఎకరాల పంటలు ముంపునకు గురవటంతో రైతులు లక్షల్లో నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవైపు డిజైన్‌ లోపం, మరోవైపు ముంపు సమస్య గురించి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఏ మాత్రమూ స్పందించటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. 


కంచికచర్ల వద్ద బైపాస్‌ రోడ్డు విస్తరణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన మార్గాలు లేవని, పైగా కల్వర్టుల డిజైన్‌లోపం ఉందంటూ రెండున్నరేళ్ల క్రితం పనుల ప్రారంభంలోనే ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైతులు మొరపెట్టుకున్నారు. ఎవరూ పట్టించుకోలేదు. చెవిటికల్లు రోడ్డు అండర్‌పాస్‌ సమీపంలో నిర్మించిన కల్వర్టుల్లో వర్షపునీరు సజావుగా వెళ్లటం లేదు. పైగా రివిట్‌మెంట్‌ కట్టడంతో కల్వర్టులు మూసుకుపోయాయి. చెరువుకట్ట వద్ద ఎస్‌.అమరవరం రోడ్డులో కల్వర్టు నిర్మించాల్సి ఉంది. పైగా అక్కడ ఏర్పాటు చేసిన నాలుగు పైపుల్లో రెండింటిలో నీళ్లు పారుదల అయ్యే పరిస్థితి లేదు. ఈ నెల రెండో వారంలో కురిసిన భారీ వర్షానికి బైపాస్‌ ఎగువ ప్రాంతం రెండు కిలోమీటర్లుపైగా ముంపునకు గురైంది. వందలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. డిజైన్‌ లోపానికి తోడు ఎక్కడికక్కడ మట్టికుప్పలు అడ్డుగా ఉన్నందున నీళ్లు సజావుగా వెళ్లకపోవటం వల్ల వారానికి కూడా ముంపు తొలగిపోలేదు. పంటలు దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల పంటలు దెబ్బతినటంతో రైతులు లక్షల్లో  నష్టపోయారు. ముంపు సమస్య లేకుండా ఎగువ ప్రాంతం నుంచి చెవిటికల్లు రోడ్డు వరకు రోడ్డు వెంబడి పెద్ద కందకం తీయిస్తానని ఏడాదిన్నర క్రితం అప్పటి ఎన్‌హెచ్‌ఏఐ విజయవాడ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సిందిగా రైతులు వేడుకుంటున్నారు. 


కలెక్టర్‌ పరిశీలన 

ముంపు సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ మంగళవారం పేర్కొన్నారు. చెరువు కట్ట వద్ద ఎస్‌.అమరవరం రోడ్డులో కల్వర్టు నిర్మించాల్సిన ప్రాంతంలో పైపులు ఏర్పాటు చేయటాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావుతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సమస్యను ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. ఆయన వెంట జేసీ మాధవీలత, సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర, తహసీల్దార్‌ రాజకుమారి ఉన్నారు. 


Updated Date - 2020-10-28T15:50:23+05:30 IST