కంచి అన్నాడీఎంకే అభ్యర్థి ఆత్మహత్య..!

ABN , First Publish Date - 2022-02-11T13:48:48+05:30 IST

కాంచీపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. కాంచీపురం మున్సిపాలిటీలో 51 వార్డులుండగా, 36వ వార్డులో కలెక్టర్‌ కార్యాలయం వద్ద

కంచి అన్నాడీఎంకే అభ్యర్థి ఆత్మహత్య..!

చెన్నై: కాంచీపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. కాంచీపురం మున్సిపాలిటీలో 51 వార్డులుండగా, 36వ వార్డులో కలెక్టర్‌ కార్యాలయం వద్ద నివసిస్తున్న జానకిరామన్‌ (35) అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీకి దిగారు. అతనికి పలు పార్టీల నేతలు కూడా పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కూడా తన వార్డులో ప్రచారం చేసిన జానకిరామన్‌ రాత్రి నిద్రపోయాడు. గురువారం ఉదయం చాలాసేపటి వరకు జానకిరామన్‌ గది నుంచి బయటకు రాలేదు. దీంతో జానకి రామన్‌ తండ్రి వేణుగోపాల్‌ గది తలుపులు తెరచి చూడగా.. అతడు నేతలపై శవంగా కనిపించాడు. జానకిరామన్‌ మెడచుట్టూ తువ్వాలు ఉండటంతో దానితో గొంతు నులుముకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న విష్ణుకంచి పోలీసులు హుటాహుటిన వెళ్లి  మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న అన్నాడీఎంకే స్థానిక నాయకులు, కార్యకర్తలు విష్ణుకంచి పోలీసుస్టేషన్‌కు వెళ్ళి జానకిరామన్‌ మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ధర్నాకు దిగారు. అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి సోమసుందరం, వ్యవస్థాపక కార్యదర్శి వాలాజాబాద్‌ పి.గణేశన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జానకిరామన్‌కు మద్దతుగా మాజీ సీఎం పళనిస్వామి ప్రచారం కూడా చేశారని, దీంతో ఆయన విజయం ఖాయమని భావించి ఇతర పార్టీలకు చెందినవారు బెదిరించి ఉంటారని అన్నాడీఎంకే శ్రేణులు ఆరోపిస్తున్నాయి. జానకిరామన్‌ సెల్‌ఫోన్‌లో గత రెండు రోజులుగా నమోదైన ఫోన్‌కాల్స్‌ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

Updated Date - 2022-02-11T13:48:48+05:30 IST