May 12 2021 @ 16:22PM

ముగ్గురు సినీ ప్రముఖులు మరణం!

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ శాఖల కళాకారులు బుధవారం మరణించారు. సంగీత దర్శకుడు కె.ఎస్‌.చంద్రశేఖర్‌ కరోనాతో మరణించగా డబ్బింగ్‌ ఇంఛార్జ్‌ కాంజన బాబు కరోనా, గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దాసరి నారాయణరావు శిష్యుడు, దర్శకుడు అక్కినేని వినయ్‌ కుమార్‌ కరోనాతో మరణించారు. వీరి మరణవార్తతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతికి లోనయింది. 

‘యమకింకరుడు’తో సంగీత దర్శకుడిగా...

సంగీత దర్శకుడు కె.ఎస్‌.చంద్రశేఖర్‌ పశ్చిమగోదావరి జిల్లా రాయలం గ్రామంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. 1990లో ఆల్‌ ఇండియా రేడియోలో గ్రేడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేరి విశాఖపట్నం వాసులకు సుపరిచితులయ్యారు. అల్లు రామలింగయ్య ‘బంట్రోతు భార్య చిత్రంతో నేపథ్య గాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసిన చంద్ర శేఖర్‌ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 70కి పైగా చిత్రాలకు చీఫ్‌ అసోసియేట్‌గా పని చేశారు. తదుపరి రమేష్‌ నాయుడుతో 40 చిత్రాలకు, హిందీలో లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌తో కూడా ఆయన పనిచేశారు. చిరంజీవి హీరోగా అల్లు అరవింద్‌ నిర్మించిన ‘యమకింకరుడు’ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు.  బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో, బోళా శంకరుడు, ఆత్మ బంధువులు,  కంచి కామాక్షి (తమిళ్‌, హిందీ) ఇలా దాదాపు 30కి పైగా చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ మధ్యనే ఆయన ఆల్‌ ఇండియా రేడియో నుంచి రిటైర్‌ అయ్యారు. ఓ సందర్భంలో తిరుపతిలో ఈయన ప్రదర్శన మెచ్చి ఘంటసాల తన హార్మోనియం బహుమతిగా ఇేస్త దానిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ, ఇంటికి వచ్చిన అతిథులకు ముందుగా చూపించేవారట.  కీరవాణి, కోటి, మణిశర్మ చంద్ర శేఖర్‌కు శిష్యులు. 

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ నుంచి అధ్యక్షుడిగా..

ఆపై నిర్మాతగా మారిన కంచన్‌బాబు! 

ప్రస్తుత డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షుడు వి. కాంచన్‌ బాబు కరోనాతో మృతి చెందారు. బుధవారం ఉదయం అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నైలో పుట్టి పెరిగిన కాంచన్‌ బాబు తండ్రి వీరమాచినేని కృష్ణారావు పలు చిత్రాల్లో నటించారు. దాంతో కాంచన్‌ బాబుకు కూడా నటనపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మారి రాజశ్రీ, ఘంటసాల రత్నకుమార్‌ వద్ద 1000కి పైగా చిత్రాల్లో పలు పాత్రలకు తన గొంతు అరువిచ్చారు. 1994లో కంచన్‌బాబు హైదరాబాద్‌కి షిప్ట్‌ అయ్యారు. అప్పటి నుంచీ డబ్బింగ్‌ ఇన్‌ఛార్జ్‌గా మారి దాదాపు 2000 వేలకు పైగా సినిమాలకు పని చేశారు. అంతే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌కి ఓసారి కోశాధికారిగా, మూడుసార్లు కార్యదర్శిగా పని చేసి నాలుగుసార్లు యూనియన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అధ్యక్ష పదవిలోనే ఉన్నారు. పలు చిత్రాలను తెలుగులోకి అనువదించి నిర్మాతగా కూడా మారారు. సురేశ్‌ హీరోగా ‘వాస్తవం’ అనే డైరెక్ట్‌ సినిమా తీసి నష్టపోయారు. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించడంలో ముందుండే కాంచన్‌ బాబు మృతి పట్ల డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ సంతాపాన్ని తెలిపింది.