Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్‌ మీద వ్యక్తిగత ద్వేషం లేదు

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

భూస్వాముల చేతుల్లో తెలంగాణ ఇంతకంటే అధ్వానం

దళితీకరణతోనే సమాజం బాగుపడుతుంది

29-4-2013న ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో కంచ ఐలయ్య


ఐలయ్య అనగానే పెద్ద సంచలనం.. చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణం, మీకెదురైన అనుభవాలే దీనికి కారణమా?

మా ఊరు పాపయ్యపేట. నర్సంపేట (వరంగల్‌ జిల్లా) పక్క న గూడురు దగ్గర ఉంటుంది. మహబూబ్‌ రెడ్డి అనే భూ స్వామి జాగీరు అది. మా అమ్మ నన్ను..ఏపూరి లక్ష్మారెడ్డి అనే దొర పాదాల దగ్గర పడేసి ఆరోతరగతిలో చేర్చుకోమంటే ఆయన చిట్టి రాసిచ్చాడు. చిన్నప్పుడు గొర్లు కాసుకుంటూ బర్లు కాసుకుంటూ స్వేచ్ఛగా బతికినోళ్లం. స్కూలుకు పోయిన తర్వాత బందిఖానాగా ఉండేది. ఈ ఊరు వాతావరణం, పుస్తక వాతావరణం మధ్య ఉండే వైరుధ్యం..ఎక్కడో సంఘర్షణ సృష్టించింది.


మరి బ్రాహ్మణుల మీద ఎందుకు ద్వేషం?

బ్రాహ్మణుల మీద నాకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు. నేను బాగా గౌరవించేది.. కులకర్ణి అని నా క్లాస్‌మేట్‌. నాకు మార్క్సిజం పరిచయం చేశాడు. బుద్ధుడిని ఒకసారి ఎవరో.. ‘మీరు బ్రాహ్మణుల మీద ఎందుకు పోరాటం చేస్తున్నారు?’ అని అడిగితే.. ‘‘వాళ్లు చంద్రుడు సూర్యుణ్ని మింగుతాడంటారు, సూర్యుడు చంద్రుణ్ని మింగుతాడంటారు, ఈ రెండూ భూమిని మింగుతాయంటారు, ఈ అబద్ధాలన్నీ ఎందుకంటే చేతులు నాకడానికి’’ అంటాడు.


కానీ, ఇప్పుడాపని మిగతా సామాజిక వర్గాల వాళ్లు కూడా చేస్తున్నారు కదా?

చేస్తున్నారు, కానీ మూలం వాళ్లలో ఉంది. హిందూ తత్వంలో దేవతలు మట్టిపని చేసేవానికి, చెప్పుల పని చేసేవానికి శత్రువు.. ఎక్కణ్నుంచి వచ్చిందా ఫిలాసఫీ?


ఎక్కడుంది? ఎవరన్నారలా?

నోనో.. ‘నీ’ జీవిత ప్రక్రియలో కనపడుతుంది, ‘నీ’ టెక్స్ట్‌లో (గ్రంథాల్లో) కనపడుతుంది.


అది కొందరు వ్యక్తుల కల్పితం..

కల్పితమే. దాన్ని మార్చడమెలా అనే ప్రయత్నం చేసినప్పుడు ‘ఇంకో మార్గం ఉంది’ అనిపిస్తుంది. ‘తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్‌ చేస్తావా? వ్యతిరేకిస్తున్నావా?’ అని అందరూ అడుగుతున్నారు. దేనికైనా ఏదో ఒక సైద్ధాంతిక ప్రశ్న వేసుకోవాలి కదా? తెలంగాణను తీసుకుపోయి, రెండు విప్లవాలను ఒక గులాబ్‌ జాంను లటక్కన మింగినట్టు మింగిన ఫ్యూడల్స్‌ చేతిలో పెడితే ఇది బాగుపడుతుందా? అని ప్రశ్నించుకున్నా. ఆనాడు చెన్నారెడ్డి వల్ల తెలంగాణ వచ్చి ఉంటే ఇంకా వెనక్కి పోయేది. కేసీఆర్‌ గురించి కూడా అలాగే ఆలోచించాలి నేను. 1946లో సాయుధపోరాటం మొదలై 50 వరకూ సాగింది. దాని ఫలితాలు కింది కులాలకు కొంత వచ్చినాయి. 1969లో ఇదే దొరల చేతిలో ఉద్యమం మొదలైంది. నా దృష్టిలో కౌంటర్‌ రివల్యూషన్‌ అది. ఆ ఉద్యమం పేరుతో కింది కులాలకు అందిన గత ఫలితాలను వెనక్కి నెట్టారు. మళ్లీ రెడ్లని సంఘటితం చేశారు. తెలంగాణ ప్రధానం కానీ, ఇంకేవీ ప్రధానం కాని పరిస్థితి తెచ్చారు. నక్సలైట్‌ ఉద్యమాల ఫలితాలను అడ్డుకోవడానికే..తెలంగాణ రాదని తెలిసినా కూడా ఇప్పుడు ఉద్యమం (కౌంటర్‌ రివల్యూషన్‌) మొదలుపెట్టారు.


కేసీఆర్‌ను మీరు విమర్శిస్తారు. ఎందుకలా?

ప్రజల జీవనం ఇంతకంటే మెరుగవుతుందనిపించినప్పుడు కచ్చితంగా రాషా్ట్రన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న భూస్వాములే తెలంగాణను పరిపాలిస్తే మార్పు వస్తుందా? 1956 నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉండి, భూస్వాముల చేతిలో తెలంగాణ ఉంటే ఇప్పుడున్న పరిస్థితి అయినా ఉండేదా? రేపు తెలంగాణ వస్తే అది భూస్వాముల చేతుల్లోనే ఉంటుంది. తెలంగాణ పేరుతో కుటుంబ పార్టీ వచ్చింది.


ఓయూ వీసీ పదవి దక్కడానికి కేసీఆర్‌ కృషి చేయకపోవడం వల్లే ఆయనపై,టీఆర్‌ఎస్‌పై మీరు ద్వేషంతో ఉన్నారన్న నింద ఉంది..

నేనెప్పుడైనా అలా అడిగానేమో కేసీఆర్‌ని అడగండి. అంతెందుకు.. దిగ్విజయ్‌ సింగ్‌ నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఆయన ఇక్కడ ఇన్‌చార్జిగా ఉండగా..‘‘ఐలయ్యా సెంట్రల్‌ యూనివర్సిటీ (వీసీ పదవి గురించి) ఎందుకు ఆలోచించట్లేదు? కనీసం స్టేట్‌ యూనివర్సిటీ?’’ అని అడిగారు. అప్పుడు నేను.. ‘‘సార్‌, ఈ చెయ్యి ఇంకా పుస్తకాలు రాయగలదు. ఫైల్స్‌ కాదు’’ అని సమాధానం చెప్పాను. వ్యక్తిగతంగా కేసీఆర్‌పై ద్వేషం లేదు.


జేఏసీ చైర్మన్‌ కోదండరాం విషయంలో కూడా మీరు ఇదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు..

జేఏసీ అనేది తోలుబొమ్మ ఆర్గనైజేషన్‌. కోదండరాం వ్యక్తిగతంగా నా కొలీగ్‌. అయితే, ఈ జేఏసీలు ప్రజలకు జవాబుదారీ వ్యవస్థలు కావు. ప్రభుత్వ వ్యవస్థలను వీళ్లు నాశనం చేస్తున్నారనేది నా బాధ. యూనివర్సిటీల్లో ఎక్కువగా ఉండేది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలే. దీని వల్ల వారే ఎక్కువగా నష్టపోతున్నారు. ఆస్తుల్లేని పిల్లలు అభివృద్ధి కాగలిగేది విద్య ద్వారా మాత్రమే.


మీరు పెళ్లెందుకు చేసుకోలేదు?

మార్క్స్‌ చనిపోయేముందు..‘మీరొక వేళ తిరిగిపుడితే ఏం చేస్తారు’ అని ఎవరో అడగ్గా.. ‘నేను చేసినవన్నీ చేస్తాగానీ పెళ్లి చేసుకోను’ అని చెప్పాడు. ‘‘పోరాటక్రమంలో నావల్ల భార్యా పిల్లలు హింస పడ్డారు. వాళ్లను హింసపెట్టకుండా నేనీ పని చేసి ఉంటే బాగుండేది’’ అని చెప్పారాయన. అది ఆలోచింపజేసింది.

Advertisement
Advertisement