కనకదుర్గ ఫ్లై ఓవర్‌ పనుల్లో సందిగ్ధం

ABN , First Publish Date - 2020-05-26T08:40:39+05:30 IST

చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనేమో. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోతున్న దశలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి ..

కనకదుర్గ ఫ్లై ఓవర్‌ పనుల్లో సందిగ్ధం

ఆంధ్రజ్యోతి, విజయవాడ : చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనేమో. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోతున్న దశలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మిగులు పనులు పూర్తి చేయటానికి అవసరమైన కార్మికులు లేక ఇబ్బందులు పడుతున్నారు. శనివారం పనులు చేయించినా పరిమిత సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. దీంతో పనులు ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రశ్నగా మారింది. 


మొదటి నుంచి సాగతీత

‘పనుల్లేవు. మేము వెళ్లిపోతాం.. పంపించేయండి..’ అని వలస కార్మికులు రెండు నెలలుగా కోరుతున్నా అనుమతులు ఇచ్చే విషయంలో జిల్లా యంత్రాంగం సాగదీసింది. ఇటు పనుల్లేక.. అటు సొంతూర్లకు వెళ్లే దారిలేక కొందరు బలవంతంగా వెళ్లిపోయారు. అంతకుముందు 125మంది కార్మికులు ఉంటే, నేడు 50 మంది మాత్రమే మిగిలారు. ఇక శనివారం నాటి పనులకు 40 మందే హాజరయ్యారు. ఇప్పుడు ఈ 50 మంది కూడా తమను సొంత రాష్ర్టాలకు పంపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు బలవంతంగా వీరిని ఇక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నవారు కూడా వెళ్లిపోతే పరిస్థితి ఏమిటోనని తలలు పట్టుకుంటున్నారు.


పరిమిత సంఖ్యలో ఉన్న వలస కార్మికులతో పనులు పూర్తి చేయించటం కష్టమని భావిస్తున్న ఆర్‌అండ్‌బీ స్థానికంగా 25 మంది కార్మికులను తీసుకోవాలని భావిస్తోంది. అయితే, స్థానిక పనివారు దొరకడం కష్టంగా ఉంది. ఈ ఫ్లై ఓవర్‌ వినూత్న టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఇందుకు స్కిల్డ్‌ లేబర్‌ అవసరం. స్థానికంగా ఇలాంటి తరహా టెక్నాలజీ పనులు చేపట్టేవారు లేరు. మహారాష్ట్ర కార్మికులైతే ఈ పనుల్లో ఆరితేరి ఉంటారు.  ఫ్లై ఓవర్‌ పనుల్లో వయాడక్ట్‌ దాదాపు పూర్తయింది. ఇంకా నాలుగుచోట్ల శ్లాబ్‌ గ్యాప్స్‌ను ఫిల్‌ చేయాల్సి ఉంది. లోపల ఐరన్‌ రాడ్‌ బెండింగ్‌ వర్క్‌ చేపట్టాలి. ఇదంతా స్కిల్డ్‌ వర్కర్లు చేయాల్సి ఉంటుంది. 


పనులు మరింత ఆలస్యం

ఫ్లై ఓవర్‌ పనులు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నాయి. వలస కార్మికులను కూర్చోపెట్టకుండా వారితో పనులు చేయించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం కార్మికుల సంఖ్య తగ్గడంతో పనులు పూర్తికావటానికి మరిన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వెళ్లిపోయిన వారు తిరిగి విజయవాడ రావటానికి ఐదారు నెలల సమయం పైగా పట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నవారు వెళ్లినా చాలాకాలం వరకు వచ్చే పరిస్థితి లేదు. 

Updated Date - 2020-05-26T08:40:39+05:30 IST