నగరానికి కొత్త నగ

ABN , First Publish Date - 2020-09-17T09:57:19+05:30 IST

కనకదుర్గ ఫ్లై ఓవర్‌... ఇదో ఇంజనీరింగ్‌ అద్భుతం. స్పైన్‌ అండ్‌ వింగ్స్‌ టెక్నాలజీతో దేశంలో నిర్మితమైన అతి పొడవైన వంతెన. మనకంటే

నగరానికి కొత్త నగ

కనకదుర్గ వంతెన.. ఓ ఇంజనీరింగ్‌ అద్భుతం

స్పైన్‌-వింగ్స్‌ టెక్నాలజీలో దేశంలోనే పొడవైన ఫ్లైఓవర్‌

ఒంటి స్తంభాలపై ఆరు వరుసలు.. 2.60 కిలోమీటర్లు

స్పాన్‌ మీద అటూఇటూ రెక్కలతో నిర్మాణం 

ఢిల్లీ, ముంబై తర్వాత ఇక్కడే.. ఇదే అతి పెద్దది

రేపు జాతికి అంకితం చేయనున్న కేంద్రమంత్రి గడ్కరీ


కనకదుర్గ ఫ్లై ఓవర్‌... ఇదో ఇంజనీరింగ్‌ అద్భుతం. స్పైన్‌ అండ్‌ వింగ్స్‌ టెక్నాలజీతో దేశంలో నిర్మితమైన అతి పొడవైన వంతెన. మనకంటే ముందు ఢిల్లీ, ముంబైలలో ఈ టెక్నాలజీతో ఫ్లై ఓవర్లు నిర్మించినప్పటికీ, దేశంలో ఈ టెక్నాలజీతో నిర్మించిన అతి పొడవైనది మాత్రం విజయవాడలోని కనకదుర్గ ఫ్లై ఓవరే. అనేక మలుపులతో నిర్మితమైన ‘ది లెజెండ్‌ ఫ్లై ఓవర్‌’ శుక్రవారం జాతికి అంకితం కానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..


పొడవు 2.60 కిలోమీటర్లు

వ్యయం రూ.447 కోట్లు

నిర్మాణ సమయం 5 ఏళ్లు

స్తంభాలు 47

రెక్కలు 1,406 

వాటిని కలిపే స్పాన్‌ బాక్సులు 46


(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

స్పైన్‌ అండ్‌ వింగ్స్‌ టెక్నాలజీలో నిర్మితమైన దేశంలోనే అతి పొడవైన కనకదుర్గ ఫ్లైఓవర్‌ ఈనెల 18వ తేదీనప్రారంభం కానుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వర్చువల్‌గా దీన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీ, ముంబై తర్వాత ఈ టెక్నాలజీతో దేశంలో నిర్మించిన మూడవ వంతెన ఇది. దేశంలోనే ఈ టెక్నాలజీతో నిర్మించిన అతి పొడవైన ఫ్లైఓవర్‌ ఇదే. అందుకే దీన్ని జాతికి అంకితం చేసే క్రమంలో యావత్‌ దేశ ప్రజలకు ఈ ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని చూపించడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్‌ వీడియో చిత్రీకరణ జరిపించి మరీ, ఆ రోజున దేశవ్యాప్తంగా డాక్యుమెంటరీని ప్రదర్శించబోతోంది. ఢిల్లీ, ముంబైలోని ఫ్లైఓవర్లు దీనికంటే తక్కువ పొడవున్నా, వాటిని పూర్తి చేయడానికి మూడున్నర, నాలుగేళ్లు పట్టింది. రెండున్నర కిలోమీటర్ల పొడవున్న కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయడానికి ఐదేళ్ల సమయం పట్టింది.


ఫ్లై ఓవర్‌ సమగ్ర స్వరూపం ఇదీ.. 

కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రాజెక్టులో నాలుగు వరుసల రోడ్డు, ఆరు లేన్ల ఫ్లై ఓవర్‌  అంతర్భాగంగా ఉన్నాయి. మొత్తం వ్యయం రూ.447.80 కోట్లు. ఇందులో భూ సేకరణకు సంబంధించి  రాష్ట్ర ప్రభుత్వ వ్యయం రూ.114.59 కోట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వ వాటా రూ.333.21 కోట్లు. ఇందులో ఆరు వరుసల ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ నిడివి 2.60 కి లోమీటర్లు. దీని వ్యయం రూ.211.31 కోట్లు. ఈ ప్రాజెక్టును సోమా ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. టెండర్లలో ఎల్‌అండ్‌టీ సంస్థతో పోటీపడి మరీ తక్కువకు కోట్‌ చేసి దక్కించుకుంది. ఇంత తక్కువ రేటుకు చేయటం ద్వారా కాంట్రాక్టు సంస్థ లాభపడేదేమీ ఉండదని అప్పట్లో పలు కాంట్రాక్టు సంస్థలు వ్యాఖ్యానించాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 2015 డిసెంబరు 28ని అపాయింట్‌ డేట్‌గా ఇచ్చింది. పన్నెండు నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. అయితే, విభిన్నమైన టెక్నాలజీ, సాంకేతిక పరమైన అంశాల కారణంగా ఈ ఫ్లై ఓవర్‌ పూర్తి కావటానికి ముంబై, ఢిల్లీల మాదిరిగానే దాదాపుగా ఐదేళ్ల సమయం తీసుకుంది. మొత్తం 47 పిల్లర్లపై ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. అందులో ఆరు భారీ వై పిల్లర్స్‌. పిల్లర్స్‌ కోసం భూమిలో 417 పైల్స్‌ను నిర్మించారు. అలాగే, 667 స్పైన్స్‌ నిర్మించారు. ఈ స్పైన్స్‌తో 46 స్పాన్‌ బ్లాక్స్‌లను నిర్మించారు. ఈ స్సైన్స్‌కు 1,406 రెక్కలను అమర్చారు. 47 సింగిల్‌ పిల్లర్స్‌ మీదనే ఆరు వరసలతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. సింగిల్‌ పిల్లర్ల మధ్యలో స్పైన్స్‌ సమూహమైన స్పాన్‌ ఉంటుంది. దీనికి రెండు వైపులా రెక్కలను జతచేసి ఐరన్‌తో స్ర్టెచ్చింగ్‌ చేశారు. 


శెభాష్‌ మోషే .. సోమా..

ఈ ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయటంలో ప్రభుత్వం తరఫున  ఎస్‌ఈ జాన్‌ మోషే కృషితో పాటు, కాంట్రాక్టు సంస్థ సోమాను కూడా అభినందించకుండా ఉండలేం. విజయవాడ భౌగోళిక పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉన్న మోషే ఫ్లై ఓవర్‌ పనులను ఒక ప్రణాళిక ప్రకారం చేయించారు. కాంట్రాక్టు సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నపుడు ఆయన వ్యవహరించిన తీరు వల్లే సోమా సంస్థ నిలబడి పనిచేయగలిగింది. ఈ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేసి వెళ్లిపోయే స్థితి నుంచి సోమా సంస్థను ఆయన గట్టెక్కించారు. దీంతో సోమా సంస్థ తన ఆర్థిక కష్టాలను దిగమింగుకుని మరీ ఈ ఫ్లై ఓవర్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగింది. మొండిగోడలుగా చూడాలంటే తన మనసు తీవ్రంగా బాధపడేదని, ఫ్లై ఓవర్‌ పూర్తి కావటం వల్ల తన మనసుకు ఎంతో హాయిగా ఉందని మోషే ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమా సంస్థ కూడా దీని ద్వారా దేశంలో అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనతను సాధించింది. 

Updated Date - 2020-09-17T09:57:19+05:30 IST