కల నిజమాయెనే!

ABN , First Publish Date - 2020-10-17T09:10:30+05:30 IST

సుదీర్ఘ కల సాకారమయింది. ఇంద్రకీలాద్రి వద్ద ట్రాఫిక్‌ కష్టాలను గట్టెక్కిస్తూ.. విశాలమైన ఆరువరసల కనకదుర్గ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల ..

కల నిజమాయెనే!

కనకదుర్గా ఫ్లైఓవర్‌ జాతికి అంకితం

ట్రాఫిక్‌ కష్టాలకు ఇక చెక్‌ తొలిరోజే సందడి

వంతెన అందాన్ని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు


సుదీర్ఘ కల సాకారమయింది. ఇంద్రకీలాద్రి వద్ద ట్రాఫిక్‌ కష్టాలను గట్టెక్కిస్తూ.. విశాలమైన ఆరువరసల కనకదుర్గ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల ఆనందం ‘రెక్కలు’ తొడిగింది. శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, నాగపూర్‌ నుంచి కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ శుక్రవారం కనకదుర్గ, బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్లను వర్చువల్‌గా ప్రారంభించగా, ఫ్లైఓవర్‌పై రాకపోకలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ ప్రారంభించారు. కాగా కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రయాణానికే కాదు.. పర్యాటకానికీ ప్రత్యేకంగా మారింది. నగర అందాలను వీక్షించటానికి అనువుగా ఉన్న ఈ వంతెనపై తొలిరోజే నగర ప్రజలు సందడి చేశారు.  


-(ఆంధ్రజ్యోతి, విజయవాడ)


ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలివీ.. 

కనకదుర్గ, బెంజ్‌సర్కిల్‌ -ఫ్లై ఓవర్‌-1లతో పాటు, నాలుగు వరసల విజయవాడ - మచిలీపట్నం రోడ్డును కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం జగన్‌తో కలిసి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఇదే సమయంలో బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌-2కు, కాజ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-3లో చిన అవుటపల్లి - గొల్లపూడి  ఆరు వరసల బైపాస్‌ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇదే రోడ్డు ప్రాజెక్టులో ప్యాకేజీ-4 చినకాకాని - గొల్లపూడి ఆరువరసల బైపాస్‌, కృష్ణానదిపై ఆరు వరసల బ్రిడ్జి పనులకు కూడా శంకుస్థాపన చేశారు. 


‘రెక్క’లు తొడిగిన ఆనందం 

దుర్గగుడి ఫ్లై ఓవర్‌ తొలిరోజే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫ్లై ఓవర్‌గా కూడా మారిపోయింది. కరోనా భయాన్ని పక్కకు నెట్టి, నగర ప్రజలు దుర్గా ఫ్లై ఓవర్‌ను, ఫ్లై ఓవర్‌ మీద నుంచి నగర అందాలను వీక్షించటానికి కుటుంబాలతో సహా తరలివచ్చారు. నగర ప్రజలతోపాటు ఫ్లై ఓవర్‌ మీద ప్రయాణాలు సాగించే వారతంతా తమ వాహనాలను పక్కన పెట్టి మరీ చుట్టూ ఉన్న అందాలను చూస్తూ కాలక్షేపం చేశారు. నిండుకుండలా ప్రవహిస్తున్న కృష్ణమ్మను ఈ చివర నుంచి ఆ చివర వరకు వీక్షించటం ఓ అద్భుతంగా సందర్శకులకు అనిపించింది. ఫ్లై ఓవర్‌ మీద నుంచుని కృష్ణానది అందాలను చూస్తూ కేరింతలు కొట్టారు. 


రహదారుల అభివృద్ధికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

విద్యాధరపురం : రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి మరో రూ.15 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు కేంద్రం అంగీకరించిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ కనకదుర్గ, బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్లను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం దుర్గా ఫ్లైఓవర్‌పై రాకపోకలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుర్గ ఫ్లైఓవర్‌, బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ల ప్రారంభంతో నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీరాయన్నారు.


ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, కె.రక్షణనిధి, ఆర్‌ అండ్‌ బీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కలెక్టర్‌ ఇంతియాజ్‌, సీపీ బి.శ్రీనివాసులు, నగర కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ (క్వాలిటీ) జాన్‌మోషే, ఎస్‌ఈ శ్రీనివాసరావు, తూర్పు వైసీపీ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్లైఓవర్‌పై ప్రయాణించారు. 


 జగన్‌ నోట ఆంధ్రజ్యోతి మాట

రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై చోడవరం దగ్గర బ్యారేజీ నిర్మించాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, చోడవరం బ్యారేజీకి అనుసంధానంగా కృష్ణా తూర్పు ప్రాంతంలో విజయవాడ వెలుపల నుంచి బైపాస్‌ను నిర్మించటం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, బైపాస్‌కు కేంద్రం నిధులు ఇస్తే అటు బ్రిడ్జి, ఇటు రోడ్డును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టవచ్చునని ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రత్యేక కథనం ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంలో ప్రస్తావనకు వచ్చింది.


ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఆంధ్రజ్యోతి కథనంలో సూచించిన ‘తూర్పు బైపాస్‌’ అంశాన్ని ప్రస్తావించారు.  దాదాపు 78 కిలోమీటర్ల పొడవైన ఈ నిర్మాణాన్ని చేపట్టాలని గడ్కరీని కోరారు. అయితే భూసేకరణ భారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మోపవద్దని అభ్యర్థించారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ కేంద్రం మీద భారం ఎక్కువ పడకుండా ఉంటానికి మైనింగ్‌ సెస్‌ మినహాయింపు, స్టీల్‌, సిమెంట్‌ వంటి మెటీరియల్స్‌పై జీఎస్‌టీలో మినహాయింపు ఇవ్వాలని సూచించారు. విజయవాడ అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారు. 

Updated Date - 2020-10-17T09:10:30+05:30 IST