మూడు వారాల్లో సాకారంకాబోతున్న బెజవాడ వాసుల చిరకాల కల

ABN , First Publish Date - 2020-08-13T23:29:19+05:30 IST

మరో మూడు వారాల్లో బెజవాడ వాసుల చిరకాల కల సాకారంకాబోతోంది. దశాబ్దకాలం విజయవాడ వాసుల...

మూడు వారాల్లో సాకారంకాబోతున్న  బెజవాడ వాసుల చిరకాల కల

విజయవాడ: మరో మూడు వారాల్లో బెజవాడ వాసుల చిరకాల కల సాకారంకాబోతోంది. దశాబ్దకాలం విజయవాడ వాసుల ఎదురుచూపులు, ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. టీడీపీ పోరుబాట, ఎంపీ కేశనేని నాని కృషి, కేంద్ర సహకారం వెరసి ఎట్టకేలకు దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. బెజవాడ దుర్గమ్మకు వడ్డానం తరహాలో ఒంపుసొంపులతో ఫ్లై ఓవర్ కనువిందు చేయనుంది. 


ఏపీ నడిబొడ్డున ఉన్న విజయవాడకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దుర్గగుడికి భక్తుల రద్దీతో ట్రాఫిక్ కష్టాలు  మామూలుగా ఉండవు. దశాబ్దకాలం క్రితం ట్రాఫిక్ కష్టాలు వేధించడంతో ఫైఓవర్ నిర్మాణానికి నాటి ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేంద్రంలో ఉన్న యూపీఏ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రికి ఆనుకుని కృష్ణానది ప్రవహిస్తూ ఉండటంతో ఫ్లై ఓవర్ నిర్మాణం అంతసాధ్యంకాదని, నాటి కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పింది. రూ.33 కోట్లు కేటాయించి సర్వే చేయించింది. తర్వాత సిటీలో ఇన్నర్ రింగ్ రోడ్డువైపు మొగ్గు చూపించింది. అయితే ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు చేపట్టాల్సిందేనని నాడు విజయవాడ నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బుద్దా వెంకన్న రిలే దీక్షలు చేపట్టారు. సుధీర్ఘకాలం జరిపిన ఫ్లై ఓవర్ ఉద్యమంలో బుద్దా వెంకన్న పలుమార్లు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు సైతం దీక్షలో పాల్గొని ఫ్లై ఓవర్ నిర్మాణంపై నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచారు. సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికలకు అధికారంలోకి వస్తే దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. 


అన్నట్లుగానే అధికారంలోకి వచ్చాక ఎంపీ కేశినేని నాని.. ఫ్లై ఓవర్ నిర్మాణానికి కృషి చేశారు. మోదీ సర్కార్‌కు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి రిపోర్టు ఇచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో నిధులు విడుదలయ్యాయి. 

Updated Date - 2020-08-13T23:29:19+05:30 IST