Jul 8 2021 @ 18:09PM

ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినా చేస్తా: కామ్నా జెఠ్మలాని

‘రణం’, ‘బెండు అప్పారావ్‌ ఆర్‌ఎంపి’, ‘కత్తి కాంతారావు’ వంటి హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు కామ్నా జెఠ్మాలాని. వ్యాపార వేత్త సూరజ్‌తో వివాహం తర్వాత ఆమె సినిమాలకు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం సంసారం, పిల్లలు, బాధ్యతలు అంటూ బిజీగా గడుతుపుతున్నారు. అయితే తెలుగులో అవకాశం వస్తే మళ్లీ తెరపై మెరవడానికి సిద్ధం అంటున్నారామె! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు కామ్నా. 


2005లో నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చాలా సినిమాలు చేశా. కొన్ని పెద్ద సినిమాలు సంతకం చేశా. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. అయినా నేను బాధ పడలేదు. కరెక్ట్‌ టైమలో పెళ్లి చేసుకున్నా. ఇద్దరు పిల్లలు, భర్తతో చాలా ఆనందంగా ఉన్నా. ‘చందమామ’ సినిమాలో అవకాశం మిస్‌ చేసుకున్నప్పుడు బాధ పడ్డా. ఆ సమయంలో నేను తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. ఆ సమయంలోనే కృష్ణవంశీగారు ఫోన్‌ చేసి సింధుమీనన్‌ చేసిన పాత్రను నన్ను చేయమన్నారు. డేట్స్‌ కుదరకపోవడంతో అంగీకరించలేదు. అప్పటికే కాజల్‌ ఓకే అయింది. ఇలాంటి పాత్రలు మిస్‌ అయితే చెప్పుకోలేని బాధ ఉంటుంది. నాలుగైదు సూపర్‌హిట్‌ చిత్రాలు ఇలాగే వదులుకున్నా. అయితే కొంతమంది హీరోలు, దర్శకులతో పనిచేయాలని డ్రీమ్‌ ఉంది. పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని ఉంది. అలాగే రాజమౌళిగారి సినిమాలో చిన్న సన్నివేశం అయినా చేయాలని కోరిక ఉంది. 

చిన్న శ్రీదేవిలా ఉన్నావ్‌ అన్నారు...

తమిళంలో జయం రవితో సినిమా చేస్తున్న సమయంలో పాట చిత్రీకరణ సమయంలో కె.బాలచందర్‌గారు నా దగ్గరకి వచ్చి, పక్కన కూర్చొని.. ‘నువ్వు చిన్న శ్రీదేవిలా ఉన్నావు’ అన్నారు. ‘నటనను కాస్త మెరుగుపరుచుకుంటే చాలు’  అని సలహా ఇచ్చారు. నా లైఫ్‌లో మరిచిపోలేని క్షణాలవి. గతంలో ‘ఓరుగల్లుకే పిల్లా’ సాంగ్‌ చేశా. ఇప్పుడు పక్కా లోకల్‌లాంటి పాట చేయాలనుంది.