ప్రజాసేవ కోసమే రాజకీయాలు

ABN , First Publish Date - 2022-02-22T14:49:01+05:30 IST

ప్రజలకు సేవ చేయాలన్న సత్సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టానని, డబ్బు సంపాదన కోసమో, వ్యాపారాల కోసమే రాలేదని ‘మక్కల్‌ నీది మయ్యం’ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌ స్పష్టం

ప్రజాసేవ కోసమే రాజకీయాలు

- డబ్బు, వ్యాపారాల కోసం కాదు

- ఎంఎన్‌ఎం ఆవిర్భావ సభలో కమల్‌హాసన్‌


ప్యారీస్‌(చెన్నై): ప్రజలకు సేవ చేయాలన్న సత్సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టానని, డబ్బు సంపాదన కోసమో, వ్యాపారాల కోసమే రాలేదని ‘మక్కల్‌ నీది మయ్యం’ (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయదలచిన వారంతా తమ పార్టీలో చేరవచ్చని పిలుపునిచ్చారు. ఆళ్వార్‌పేటలోని ఎంఎన్‌ఎం ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం పార్టీ ఐదో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించిన కమల్‌ ఆ తర్వాత పార్టీ శ్రేణులనుద్ధేశించి ప్రసంగించారు. తన శేషజీవితం ప్రజల కోసమే అర్పించానని, రామనాథపురం జిల్లా రామేశ్వరంలో పార్టీ ప్రారంభించిన సమయంలో తనతో ఉన్న వారు ప్రస్తుతం లేరని తెలిపారు. వ్యాపారదృష్టితో పార్టీలో చేరిన వారు ఆదాయం లేదని తెలుసుకొని బయటకు వెళ్లిపోయారని, సంపాదన ఆశించే వారు అలాగే వ్యవహరిస్తారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను రాష్ట్రప్రభుత్వం సక్రమంగా నెరవేర్చలేదని, దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, విలువైన ఓటు ద్వారా తమ ప్రతినిధులను గెలిపిస్తున్న ప్రజలకు కనీసవసతులు కల్పించాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు.


సీఎస్‌తో కమల్‌ భేటీ...

పార్టీ ఆవిర్భావ సభ అనంతరం కమల్‌హాసన్‌ సెయింట్‌ జార్జి కోటకు వెళ్లి రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బును కలిసి ఓ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం, ఖర్చు వివరాలను కౌన్సిలర్లు తప్పనిసరిగా దాఖలుచేయాలన్న చట్టం 2010వ సంవత్సరం నుంచి రాష్ట్రంలో అమలులో ఉందన్నారు. అయితే ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయక పోవడంతో గ్రామాల్లో అవినీతి రోజురోజుకు పెరుగుతోందని, దీనిని అరికట్టేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా తమ పార్టీ తరఫున సీఎస్‌ను కోరినట్లు కమల్‌హాసన్‌ తెలిపారు.

Updated Date - 2022-02-22T14:49:01+05:30 IST