అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నా

ABN , First Publish Date - 2022-02-03T12:59:50+05:30 IST

అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏర్పాటు చేసిన ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ నిర్వహణకు తన సంపాదన సరిపోవడం లేదని, అందువల్ల అందరూ విరివిగా విరాళాలివ్వాలని ఆ పార్టీ అధినేత

అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నా

                         - విరివిగా విరాళాలివ్వండి ప్లీజ్‌: Kamal


చెన్నై: అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏర్పాటు చేసిన ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ నిర్వహణకు తన సంపాదన సరిపోవడం లేదని, అందువల్ల అందరూ విరివిగా విరాళాలివ్వాలని ఆ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందని, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించటంలో రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితి మార్చాలని మక్కల్‌ నీదిమయ్యం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, అన్ని దిక్కుల్లోనూ మద్యం దుకాణాలే ఉన్నాయని, ప్రభుత్వం నిర్మిస్తున్న కట్టడాలు ఏ క్షణంలోనైనా కూలిపోయేలా నాసిరకంగా ఉంటున్నాయని ఆరోపించారు. తనను అందరూ దీర్ఘదర్శి అంటూ పొగడుతున్నారని, తాను దీర్ఘదర్శిని కాదని, సినీరంగంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసినట్లు తన జీవిత కాలంలోపే రాష్ట్రాన్ని మార్చగలననే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు కంటైనర్లలో కరెన్సీ తరలించగల సామర్థ్యం కలిగిన పార్టీలతో తమ పార్టీ తలపడుతోందన్నారు. అంగబలం, ఆర్థిక బలం కలిగిన అవినీతిపరులతో తమ పార్టీ చేయనున్న ఎన్నికల యుద్ధానికి నిధుల కొరత ఏర్పడిందని, తన ఒక్కడి సంపాదన చాలటం లేదన్నారు. అందువల్ల ప్రజలే అవినీతి నిరోధక ఉద్యమం జరిపే తమ పార్టీకి మెండుగా విరాళాలిచ్చి ఆదుకోవాలని కమల్‌హాసన్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-02-03T12:59:50+05:30 IST