కమలం గ్రేటర్‌ ఫార్ములా!

ABN , First Publish Date - 2022-07-06T08:46:33+05:30 IST

తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రకటించిన బీజేపీ జాతీయ నాయకత్వం..

కమలం గ్రేటర్‌ ఫార్ములా!

  • తెలంగాణలో పట్టుకోసం వ్యూహరచన
  • ఢిల్లీ డైరెక్షన్‌లో రాష్ట్రంలో కార్యాచరణ
  • టీఆర్‌ఎస్‌ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు..
  • రంగంలోకి జాతీయ స్థాయి నేతలు
  • 4 క్లస్టర్లుగా 14 లోక్‌సభ నియోజకవర్గాలు
  • ఇన్‌చార్జులుగా కేంద్ర మంత్రులు
  • కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం
  • రేపు హైదరాబాద్‌కు సింధియా


హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రకటించిన బీజేపీ జాతీయ నాయకత్వం.. ఇందుకోసం నేరుగా రంగంలోకి దిగుతోంది. ఢిల్లీ డైరెక్షన్‌లో రాష్ట్రంలో కార్యాచరణ అమలు చేసేలా ప్రణాళిక రచిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ ఎన్నికల సందర్భంగా అనుసరించిన ఫార్ములాతోపాటు మరికొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలను రాష్ట్ర పార్టీకి నిర్దేశించింది. ఇందులో భాగంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రక్రియనూ వేగవంతం చేయనుందని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా  ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టాలి? సీనియర్‌ నాయకులకు ఏ బాధ్యతలు కేటాయించాలి? టీఆర్‌ఎస్‌ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు మరింత సమర్థంగా ఎలా తిప్పికొట్టాలి? రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఏం చేయాలి?తదితర అంశాలను జాతీయ నాయకత్వమే నిర్దేశించబోతోందని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. తన వ్యూహాత్మక కార్యాచరణలో భాగంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలు చేసిన ఫార్ములాను కూడా తెరపైకి తెచ్చిందన్నారు. పార్టీ సీనియర్‌ వ్యూహకర్త భూపేంద్రయాదవ్‌కు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో.. ఇకపై అధికార టీఆర్‌ఎస్‌ విమర్శలపై ఎప్పటికప్పుడు స్పందించడం, కీలక సామాజికవర్గాలకు మరింత చేరువ కావడం, అవసరమైన నియోజకవర్గా ల్లో టీఆర్‌ఎ్‌స-ఎంఐఎం మైత్రిని సూక్ష్మస్థాయిలో ఎండగట్టడం తదితర చర్యలను చేపట్టబోతోందని ఆయన తెలిపారు. మరోవైపు, కేద్రం అమలు చేస్తున్న పథకాల పేర్లు మార్చి తమ పథకాలుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించింది. దీనిని తిప్పికొట్టేందుకు కేంద్ర మంత్రులను రంగంలోకి దింపుతోంది. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులు, అమలు చేస్తున్న పథకాలువంటి అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించబోతోంది.  

 

4 క్లస్టర్లుగా 14 లోక్‌సభ నియోజకవర్గాలు..

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను 14 నియోజకవర్గాలను బీజేపీ జాతీయ నాయకత్వం నాలు గు క్లస్టర్లు (ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌)గా  గుర్తించింది. ఆయా నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించింది. వీరు ఆయా నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. కాగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నియోజకవర్గం కరీంనగర్‌,  అరవింద్‌ నియోజకవర్గం నిజామాబాద్‌లో ఇప్పటికే కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం సాగుతోందని పార్టీ గుర్తించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో రెండో దశలో అవసరమైతే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్రమంత్రుల పర్యటనల సమన్వయానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి కన్వీనర్‌గా మరో కమిటీని ఏర్పాటుచేశారు. నాయకులు జి.ఉమారాణి, ఎం.జయశ్రీ, అట్లూరి రామకృష్ణ కో కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. 


క్లస్టర్లు.. ఇన్‌చార్జులు

ఆదిలాబాద్‌, పెద్దపల్లి నియోజకవర్గాల ఇన్‌చార్జి-పురుషోత్తం రూపాలా; జహీరాబాద్‌- నిర్మలా సీతారామన్‌; మెదక్‌- ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ; హైదరాబాద్‌-జ్యోతిరాదిత్య సింధియా; చేవెళ్ల, మల్కాజ్‌గిరి- ప్రహ్లాద్‌ జోషి; భువనగిరి- దేవీసింగ్‌ చౌహాన్‌; మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌-మహేంద్రనాథ్‌ పాండే; నల్లగొండ- కైలాష్‌ చౌదరి; వరంగల్‌-ఇంద్రజిత్‌సింగ్‌; మహబూబాబాద్‌, ఖమ్మం- బీఎల్‌ వర్మ. 

Updated Date - 2022-07-06T08:46:33+05:30 IST