కమలా హారిస్ భారతదేశానికి వచ్చినప్పుడు భావోద్వేగానికి గురైంది: మేనమామ

ABN , First Publish Date - 2020-08-13T01:58:24+05:30 IST

అమెరికా ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి సెనెటర్ కమలా హారిస్‌ను ఎంపిక చేసినట్టు

కమలా హారిస్ భారతదేశానికి వచ్చినప్పుడు భావోద్వేగానికి గురైంది: మేనమామ

న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి సెనెటర్ కమలా హారిస్‌ను ఎంపిక చేసినట్టు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కమలా హారిస్‌కు భారత్‌తో ఉన్న సంబంధంపై ఇప్పుడు ప్రధానంగా చర్చ సాగుతోంది. ఇదే నేపథ్యంలో కమలా హారిస్ మేనమామ, భారతీయుడు అయిన జీ.బాలచంద్రన్ కమలా హారిస్ భారతదేశానికి వచ్చినప్పటి సందర్భం గురించి గుర్తుచేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘కమలా తల్లి శ్యామలా గోపాలన్ హారిస్‌ది భారతదేశమే. తమిళనాడుకు చెందిన ఆమె 2009లో క్యాన్సర్ బారిన పడి మరణించింది. ఆమె మరణించిన తరువాత ఆచారం ప్రకారం అస్తికలు బే ఆఫ్ బెంగాల్‌లో కలిపేందుకు కమలా హారిస్ భారత్‌కు వచ్చింది. ఆ సమయంలో కమలా హారిస్ ఎంతో భావోద్వేగానికి గురవడం నేను చూశాను’ అని బాలచంద్రన్ తెలిపారు. ఇక హారిస్ భారతదేశానికి వచ్చినప్పుడల్లా అన్ని నగరాలను సందర్శించడానికి ఎక్కువ ఇష్టం చూపుతారని ఆయన చెప్పారు. 


ఆమె భారత్‌కు వస్తే దక్షిణ భారత వంటకాలైన దోస, రసం, రైస్‌ను ఎక్కువగా ఇష్టపడతారని అన్నారు. కమలా హారిస్‌కు రెండేళ్ల వయసున్నప్పుడు తాను ఇంగ్లాండ్‌‌లో ఉండేవాడినని.. మొదటి సారి కమలా హారిస్‌ను అక్కడే చూసినట్టు బాలచంద్రన్ గుర్తుచేసుకున్నారు. కమలా హారిస్ కాలిఫోర్నియా సెనెటర్ అయిన తరువాత ఇండియాకు రావడం ఆమెకు కుదరలేదని ఆయన అన్నారు. కమలా హారిస్ తండ్రి జమైకన్(ఆఫ్రికన్ అమెరికన్) అని బాలచంద్రన్ తెలిపారు. తాను గతేడాది అక్టోబర్‌లో అమెరికాకు వెళ్లినప్పుడు కమలా హారిస్‌ను చివరిగా చూశానని బాలచంద్రన్ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు దేశ ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ పంపానన్నారు. తమ కుటుంబంతో పాటు భారతదేశ సమాజానికే ఇది చరిత్రాత్మక రోజని ఆయన అన్నారు.  

Updated Date - 2020-08-13T01:58:24+05:30 IST