వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ తన టీం మొత్తాన్ని కూడా మహిళలతోనే నింపేశారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్, డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ స్థానాల్లో ఆమె మహిళలకు అవకాశమిచ్చారు. పబ్లిక్ పాలసీలపై అధిక నైపుణ్యం కలిగి ఉన్న టినా ఫ్లౌర్‌నాయ్‌ను చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించినట్టు ఆమె వెల్లడించారు. ప్రజాసేవలో టినా ఫ్లౌర్‌నాయ్ ఎంతో మంచి పేరు సాధించారని కమలా హ్యారిస్ కొనియాడారు. ఆ ఘనత వల్లే చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా తన కార్యాలయానికి నాయకత్వం వహించే అర్హతను టినా సాధించగలిగారని కమలా హ్యారిస్ అన్నారు. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను తమ ప్రభుత్వం అధిగమించడంలో టినా నాయకత్వం ఎంతో కీలకమని ఆమె చెప్పారు.
మరోపక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా కమలా హ్యారిస్ నాన్సీ మెకెల్‌డోనీని నియమించారు. తమ ప్రభుత్వం అమెరికన్లను సురక్షితంగా ఉంచడం, ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో నాన్సీ నాయకత్వం ఎంతో అవసరమని అన్నారు. ఇక డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్‌గా రోహిణి కోసోగ్లుకు కమలా హ్యారిస్ అవకాశమిచ్చారు. అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కువ అవగాహన కలిగి ఉండటమే కాకుండా రోహిణి తనకు అత్యంత విశ్వసనీయ సహాయకులలో ఒకరని కమలా హ్యారిస్ తెలిపారు. ఈ ముగ్గురు తన బృందంలోని మిగతా వారితో కలిసి కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వాన్ని పునరుద్దరించడానికి తగిన కృషి చేస్తారని కమలా హ్యారిస్ అన్నారు.