అమెరికా ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా భార‌త సంత‌తి మ‌హిళ‌ క‌మ‌లా హారీస్‌

ABN , First Publish Date - 2020-08-12T16:14:12+05:30 IST

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అధ్య‌క్ష అభ్యర్థి జో బిడెన్ మంగ‌ళ‌వారం అనూహ్య‌ నిర్ణయం తీసుకున్నారు. కాలిఫోర్నియాకు చెందిన‌ భారత సంతతి సెనెట‌ర్‌ కమలా హారిస్‌ను త‌న ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు.

అమెరికా ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా భార‌త సంత‌తి మ‌హిళ‌ క‌మ‌లా హారీస్‌

వాషింగ్ట‌న్ డీసీ: అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. డెమొక్రటిక్‌ పార్టీ అధ్య‌క్ష అభ్యర్థి జో బిడెన్ మంగ‌ళ‌వారం అనూహ్య‌ నిర్ణయం తీసుకున్నారు. కాలిఫోర్నియాకు చెందిన‌ భారత సంతతి సెనెట‌ర్‌ కమలా హారిస్‌ను త‌న ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. కాగా, బిడెన్ వ్యూహాత్మ‌కంగానే న‌ల్ల‌జాతీయుల ఓట్ల‌తో పాటు మ‌హిళ‌ల ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు కమలా పేరును ప్ర‌తిపాదించార‌ని తెలుస్తోంది. దీంతో ఉపాధ్య‌క్ష రేసులో నిలిచిన‌ తొలి ఏషియా అమెరిక‌న్‌గా క‌మ‌లా హారిస్ నిలిచారు. ఈ సంద‌ర్భంగా ట్వీట్ చేసిన‌ బిడెన్... "దేశంలోని అత్యుత్తమ ప్రజా సేవకులలో క‌మ‌లా ఒకరు. మీతో కలిసి అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించబోతున్నాం. క‌మ‌లా హారిస్‌ను నెంబ‌ర్ టూగా ప్ర‌క‌టించ‌డం నాకు గొప్ప గౌర‌వంగా ఉంది. ఎన్నికలు ముగిసే వరకూ తన ప్రచారంలో ఆమె భాగస్వామిగా ఉంటారు. తమ భాగస్వామ్యంతో విజయం మరింత సులువవుతుందని భావిస్తున్నానని" అన్నారు. 




ఇక‌ తనను ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల క‌మ‌లా కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ రిట్వీట్ చేశారు. పార్టీ ఉపాధ్య‌క్ష నామినీగా ఎంపిక కావ‌డం గౌర‌వంగా ఉంద‌న్నారు. కాలిఫోర్నియా సేనేట‌ర్ అయిన‌ క‌మ‌లా హారిస్‌కు భార‌తీయ‌-జ‌మైకా వార‌స‌త్వ మూలాలు ఉన్నాయి. ఆమె త‌ల్లిది భార‌త్‌లోని త‌మిళనాడు కాగా... తండ్రి జ‌మైక‌న్‌. 


గ‌తంలో అమెరికా ఉపాధ్య‌క్ష బ‌రిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు నిలిచారు. 2008లో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున సారా పాలిన్‌, 1984లో డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున గెరాల్డైన్ ఫెర‌రో పోటీ ప‌డ్డారు. అయితే ఈ ఇద్ద‌రిలో ఎవ‌రూ గెల‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేగాక అమెరికా రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ‌లు ఎవ‌రూ అధ్య‌క్షులు కాలేదు. ఒక‌వేళ కమలా హారిస్ గెలిస్తే 55 ఏళ్ల ఆమె... ఆటోమేటిక్‌గా 2024 లేదా 2028లో డెమొక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిగా బ‌రిలో ఉంటారు. 


కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళగా, అమెరికా సెనేట్‌కి ఎన్నికైన తొలి సౌత్ ఏషియ‌న్ కూడా క‌మలానే కావ‌డం విశేషం. నిజానికి 2019 వరకూ డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్ పేరే అధ్యక్ష రేసులో ఉంది. 2019 డిసెంబర్‌లో ఆమె రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో మార్చిలో జో బిడెన్ అధ్యక్ష అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. న‌వంబ‌ర్ 3న జ‌రిగే అమెరికా ఎన్నిక‌ల్లో బిడెన్‌, క‌మ‌లా హారిస్ భ‌విత్యం తేల‌నుంది. 


ఇక యూఎస్ ఉపాధ్య‌క్ష రేసులో నిలిచిన క‌మలాకు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా హారీస్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. "నాకు క‌మ‌లా హారీస్ చాలా కాలంగా తెలుసు. ఆమె త‌న జీవితాన్ని ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం, అర్హులైన వారికి చేయూత‌ను అందించ‌డానికి ఎంతో కృషి చేశారు. ఆమెను గెలిపించుకుందాం" అని ఒబామా ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-08-12T16:14:12+05:30 IST