కమల్ కసరత్తు.. పొత్తుకు ముందే ప్రచార వ్యూహం

ABN , First Publish Date - 2020-09-11T14:16:30+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఎనిమిది నెలలు గడువు మాత్రమే ఉండడంతో అందరికంటే ముందుగా...

కమల్ కసరత్తు.. పొత్తుకు ముందే ప్రచార వ్యూహం

కమల్‌ కసరత్తు.. కార్యదర్శులతో చర్చలు

చెన్నై (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఎనిమిది నెలలు గడువు మాత్రమే ఉండడంతో అందరికంటే ముందుగా మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. వారం రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా బూత్‌ పరిశీలకుల ఎంపికపై జిల్లా కార్యదర్శులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో నిజాయితీపరులు, సేవాభావం కలిగిన అభ్యర్థులను రంగంలోకి దించాలని నిర్ణయించారు.


ఆ మేరకు బుధవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కార్యదర్శులతో కమల్‌హాసన్‌ సమావేశమయ్యారు. ఓ వైపు అక్టోబర్‌లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ సీజన్‌-4కు సిద్ధమవుతూ మరో వైపు పెండింగ్‌లో ఉన్న సినిమాల షూటింగ్‌ పూర్తి చేయడానికి గల అవకాశాలపై దర్శకులతో చర్చలు జరుపుతూ బిజీగా ఉంటున్న కమల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై జిల్లా కార్యదర్శులతో సమగ్రంగా చర్చలు జరుపుతున్నారు. ఇలా మూడు వైపులా ఒత్తిడి పెరుగుతున్నా తొందర పడకుండా అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు.


పొత్తుకు ముందే ప్రచార వ్యూహం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్న అంశాన్ని పక్కనబెట్టి కమల్‌హాసన్‌ ప్రచార వ్యూహరచనపై కూడా దృష్టి సారిస్తున్నారు. జిల్లా కార్యదర్శుల నుంచి సమాచారాన్ని తీసుకుని ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే ప్రభుత్వ అవినీతిపై ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని తరిమికొట్టేలా ప్రచారం చేయాలని జిల్లా కార్యదర్శులంతా కమల్‌కు సూచిస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకున్న అంగబలం, ఆర్థికబలం కూడా పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయాలని కమల్‌ జిల్లా కార్యదర్శులకు సలహా ఇస్తున్నారు. రెండేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ స్థానిక శాఖ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం తీసుకుని చర్యలకు సంబంధించిన వివరాలను కూడా కమల్‌హాసన్‌ సేకరిస్తున్నారు. 


మక్కల్‌ నీదిమయ్యం ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహరచన కమిటీని కూడా కమల్‌హాసన్‌ సిద్ధం చేశారు. అభ్యర్థుల ఎంపికను ఈ యేడాదిలోగా ఖరారు చేసి ప్రచారం ప్రారంభించాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే యేడాది ప్రారంభంలో కమల్‌హాసన్‌ పలు సినిమాల షూటింగ్‌ల్లోనూ పాల్గొనాల్సి వుంది.


ప్రచారానికి ఆటంకం కలుగకుండా సినిమా షూటింగ్‌లకు కాల్షీట్లు ఇవ్వాలని కమల్‌ అందుకు తగిన విధంగా తేదీలను ఖరారు చేయడంలో తలమునకలయ్యారు. ఏది ఏమైనప్పటికీ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రారంభించే పార్టీతో పొత్తుపెట్టుకోవాలా? లేక జాతీయ పార్టీ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలా? అనే అంశాలను ప్రస్తుతానికి కమల్‌హాసన్‌ పక్కన బెట్టి అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహరచనలపైనే ప్రస్తుతం ఆసక్తికనబరుస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Updated Date - 2020-09-11T14:16:30+05:30 IST