150 సీట్లలో కమల్ ఎంఎన్ఎం పోటీ, భాగస్వాములకు 80 సీట్లు

ABN , First Publish Date - 2021-03-09T15:58:25+05:30 IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ ఫార్ములాను మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్..

150 సీట్లలో కమల్ ఎంఎన్ఎం పోటీ, భాగస్వాములకు 80 సీట్లు

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ ఫార్ములాను మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ సోమవారం రాత్రి ప్రకటించారు. ఇండియన్ జననాయక కట్చి (ఐజేకే), నటుడు ఆర్.శరత్‌కుమార్‌కు చెందిన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) పార్టీలతో ఎంఎన్ఎం పొత్తు కుదుర్చుకుంది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను 154 సీట్లలో ఎంఎన్ఎం పోటీ చేయనుండగా, ఐజేకే, ఏఐఎస్ఎంకేలు చెరో 40 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. పొత్తు ఒప్పందంపై మూడు పార్టీలకు చెందిన ప్రతినిధులైన ఎంఎన్ఎం ప్రధాన కార్యదర్శి సీకే కుమారవేల్, ఏఐఎస్ఎంకే వ్యవస్థాపకుడు శరత్‌మార్, ఐజేకే నేత రవి పచముత్తు సంతకాలు చేశారు.


ప్రజల చిరకాల ఆకాంక్షలకు నేరవేర్చడమనే లక్ష్యానికి తమ పార్టీలు కట్టుబడి ఉన్నామని, తమిళనాడు గౌరవ ప్రతిష్టలను పునరుద్ధరించాలనే ఉమ్మడి లక్ష్యంతో పని చేస్తామని, కలిసికట్టుగా సుదీర్ఘ ప్రయాణానికి కంకణబద్ధులవుతామని మూడు పార్టీలు ఆ అవగాహన పత్రంలో పేర్కొన్నాయి. తమిళనాడులో మార్పు ప్రాతిపదికగా పని చేసి విజయం సొంతం చేసుకుంటామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఎంఎన్ఎం సారథ్యంలోని కూటమిలో మరికొన్ని పార్టీలను కూడా తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సీకే కుమారవేల్ తెలిపారు.

Updated Date - 2021-03-09T15:58:25+05:30 IST