స్పీడ్ పెంచిన కమల్ హాసన్.. గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన..

ABN , First Publish Date - 2020-10-11T16:29:14+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీది మయ్యం పార్టీలో అభ్యర్థుల ఎంపిక పనులు చురుకుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది

స్పీడ్ పెంచిన కమల్ హాసన్.. గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన..

చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీది మయ్యం పార్టీలో అభ్యర్థుల ఎంపిక పనులు చురుకుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా 150 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ నిర్ణయించారు. ఆ మేరకు రెండు నెలలకు ముందే ఆ నియోజకవర్గాల్లో ఎన్నికల పనులను ప్రారంభించారు. పార్టీ స్థానిక శాఖల నాయకులతో పలు విడతలు చర్చలు  జరిపారు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సర్వేలో 50 నియోజకవర్గాల్లో పార్టీ గెలిచేందుకు అవకాశాలున్నాయని లెక్కగట్టారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల ప్రకారం ఆ 50 నియోజకవర్గాల్లో ఏడు నుంచి ఎనిమది శాతం దాకా పార్టీ ఓటు బ్యాంకు ఉన్నట్లు గుర్తించారు. వాటితో పాటు మరో వంద నియోజకవర్గాలను కలుపుకుని మక్కల్‌ నీది మయ్యం పోటీ చేయాలని భావిస్తోంది. ఇటీవల 150 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ఇన్‌చార్జిలుగా స్థానిక శాఖ నాయకులను కమల్‌హాసన్‌ నియమించారు. వారు తమ నియోజకవర్గాలలో పోటీ చేయడానికి అంగ, అర్థబలం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి ప్రత్యేక నివేదికను రూపొందించి పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు పంపనున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల ఎన్నికల ఇన్‌చార్జిలతో కమల్‌హాసన్‌ వారానికి రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చలు కూడా జరుపుతున్నారు.


గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి...

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక  దృష్టి సారించాలని స్థానిక శాఖల నాయకులకు కమల్‌హాసన్‌ ఆదేశించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే పార్టీకి తగిన ఓటు బ్యాంక్‌ లభించలేదని సర్వే ద్వారా వెల్లడైన విషయాన్ని కమల్‌హాసన్‌ పార్టీ స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ప్రచారాలలో ఏయే అంశాలను ప్రస్తావించాలన్న విషయాలను  తనకు నివేదిక పంపమని కూడా కమల్‌ కోరారు.    ఆ దిశగా పార్టీ స్థానిక శాఖ నాయకులంతా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కలుసుకుని వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టాలో తెలుపమంటూ పార్టీ స్థానిక శాఖ నాయకులు గ్రామీణ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక వీలైతే ఆయా నియోజకవర్గాల్లో అర్హులైన అభ్యర్థుల వద్ద స్థానిక శాఖ నాయకులు ఇంటర్వ్యూలు కూడా జరిపి, ఆ విషయాలను నివేదికగా పంపవచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. అభ్యర్థులు నియోజకవర్గం ప్రజలందరికీ బాగా పరిచయమైన వ్యక్తిగా ఉండాలని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకుని ప్రచారం చేయగల సత్తా ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని కూడా కమల్‌ తెలిపారు.


తృతీయ కూటమి...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన రెండు ద్రావిడ పార్టీలను మినహాయించి ఇతర పార్టీలతో తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలని కమల్‌హాసన్‌ నిర్ణయించారు. భావసారూప్యత కలిగిన పార్టీలతోనే పొత్తు కుదుర్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. తన సినీరంగ చిరకాల మిత్రుడు, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆధ్యాత్మిక రాజకీయ పార్టీని ప్రారంభించినా ఆ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. గత మూడేళ్లుగా అధికార అన్నాడీఎంకేపైనే తీవ్ర విమర్శలు చేసిన కమల్‌హాసన్‌ డీఎంకేపై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఒక వేళ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకుంటారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి కమల్‌హాసన్‌ అసెంబ్లీ ఎన్నికల్లోగా తృతీయ కూటమిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తృతీయ కూటమిలో బలమైన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన వ్యూహరచన చేస్తున్నారు. ఒక వేళ నటుడు విజయకాంత్‌ నాయకత్వంలోని డీఎండీకే తమ కూటమిలో చేరేందుకు వస్తే స్వాగతించేందుకు కమల్‌ సిద్ధంగా ఉన్నారని సన్నిహితులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు అవకాశాలు మెండుగా కలిగిన 150 నియోజకవర్గాలలో మక్కల్‌ నీదిమయ్యం అభ్యర్థులను పోటీకి దింపేందుకు కమల్‌ హాసన్‌ సిద్ధమవుతున్నారు. తక్కిన స్థానాలను మిత్రపక్షాలు కేటాయించాలని ఆయన నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో పలుమార్లు తృతీయ కూటమి ఏర్పాటై ఘోరపరాజయాన్ని చవిచూస్తోందని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించవద్దని పార్టీ ప్రముఖులు కమల్‌కు హితవు చెబుతున్నట్లు తెలుస్తోంది. తొలుత పార్టీని గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధి పరచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ ప్రముఖులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-10-11T16:29:14+05:30 IST