Abn logo
Jan 19 2021 @ 18:24PM

‘గ్యాంగ్‌స్టర్‌ -21’కు క్లాప్‌ కొట్టిన కమల్

తమిళ సినీ ఇండస్ట్రీలో జూనియర్‌ ఎంజీఆర్‌గా గుర్తింపు పొందిన వి.రామచంద్రన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌-21’. ఈ చిత్ర షూటింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. విశ్వనటుడు కమల్‌హాసన్‌ తొలి క్లాప్‌ కొట్టారు. ఏడీఆర్‌ ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అట్టు’ ఫేం రతన్‌ లింగ దర్శకత్వం వహిస్తుండగా, ఎంఎన్‌ వీరప్పన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పురట్చితలైవర్‌ డాక్టర్‌ ఎం.జి.రామచంద్రన్‌ 104వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించారు. అంతేకాకుండా, ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టరు కూడా కమల్‌ రిలీజ్‌ చేశారు. ఎంజీఆర్‌ స్మారకవనంగా మారిన రామావరంలోని ఎంజీఆర్‌ నివాసంలో ఈ చిత్ర షూటింగ్‌ మొదలైంది. చెన్నై మహానగరంలో అండర్‌ డాన్‌గా ఉన్న ఓ గ్యాంగ్‌ స్టర్‌ జీవిత కథను ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర సంగీత దర్శకుడిగా విక్రమ్‌ వ్యవహరిస్తుండగా  ఇతర తారాగణాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. 


ఎంఎన్‌ఎం కార్యకర్తల హడావుడి 

ఇదిలా ఉంటే..‘గ్యాంగ్‌స్టర్‌-21’ చిత్ర షూటింగ్‌ ప్రారంభోత్సవంలో కమల్‌ హాసన్‌ సారథ్యంలోని మక్కల్‌ నీది మయ్యం పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతల హడావుడి కనిపించింది. ఇందుకోసం వేదిక వెనుకభాగంలో ఏర్పాటు చేసిన బ్యానర్‌ మధ్యభాగంలో ఎంజీఆర్‌ ఫొటోలను పెట్టి, దానికి ఇరువైపులా కమల్‌ హాసన్‌ తమ పార్టీ ఎన్నికల గుర్తు టార్చి లైటును పట్టుకుని నిలబడి ఉన్న ఫొటోలను పెట్టారు. పైగా షూటింగ్‌ ప్రాంతంలో ఎంఎన్‌ఎం జెండాలే దర్శనమివ్వగా, ఆ పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో ‘గ్యాంగ్‌స్టర్‌-21’ షూటింగ్‌ ప్రారంభోత్సవం కాస్త ఎంఎన్‌ఎం కార్యక్రమంగా జరిగిపోయింది.


Advertisement
Advertisement
Advertisement