ఎంఎన్‌ఎం కూటమి సీఎం అభ్యర్థి నేనే! :కమల్‌హాసన్

ABN , First Publish Date - 2021-02-28T16:33:03+05:30 IST

మక్కల్‌ నీదిమయ్యంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో తృతీయ కూటమి ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్....

ఎంఎన్‌ఎం కూటమి సీఎం అభ్యర్థి నేనే! :కమల్‌హాసన్

ఎస్‌ఎంకే, ఐజేకే నేతల భేటీ

చెన్నై (ఆంధ్రజ్యోతి): మక్కల్‌ నీదిమయ్యంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో తృతీయ కూటమి ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. శనివారం ఉదయం సమత్తువ మక్కల్‌ కట్చి నాయకుడు, సినీనటుడు శరత్‌కుమార్‌, ఇందియ జననాయగ కట్చి (ఐజేకే) డిప్యూటీ కార్యదర్శి రవిబాబు ఆళ్వార్‌పేటలోని నివాసగృహంలో కమల్‌హాసన్‌ను కలుసుకున్నారు. మక్కల్‌నీదిమయ్యంతో ఎన్నికల పొత్తుకుదుర్చుకునే దిశగా ఈ నేతలు కమల్‌హాసన్‌ను కలుసుకున్నారు. రెండు పార్టీల నాయకులతో సమావేశమైన తర్వాత కమల్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నాడీఎంకే మాజీ శాసనసభ్యుడు పళయ కరుప్పయ్య, చట్ట పంచాయత్తు ఇయక్కమ్‌ నాయకుడు తమ పార్టీలో చేరారని  ప్రకటించారు. నిజాయితీపరులను తమ పార్టీలో చేర్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో పళయ కరుప్పయ్య ఓ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారని తెలిపారు.


1 నుంచి ఇంటర్వ్యూలు

మక్కల్‌ నీదిమయ్యం తరఫున పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 1 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని కమల్‌ తెలిపారు. తొలి విడత అభ్యర్థుల జాబితా మార్చి ఏడున విడుదల చేస్తామని, మార్చి మూడు నుంచి తాను ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని ఆయన తెలియజేశారు. అభ్యర్థుల ఎంపికకు తన నాయకత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశామని, ఆ కమిటీలో పళయకరుప్పయ్య, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సహాయకుడు పొన్‌రాజ్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి ఆర్‌. రంగరాజన్‌, చట్ట పంచాయత్తు ఇయక్కమ్‌ నాయకుడు సెంథిల్‌ ఆరుముగం, సురేష్‌ అయ్యర్‌ సభ్యులుగా ఉంటారని ఆయన తెలిపారు.

ఓపిక నశించి వైదొలిగాం: శరత్‌కుమార్‌

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ సీట్ల కేటాయింపులపై అన్నాడీఎంకే అధిష్ఠానం చర్చలు సకాలంలో ప్రారంభించకపోవడం వల్లే ఓపిక నశించి ఆ కూటమి నుంచి వైదొలగినట్టు సమత్తువ మక్కల్‌ కట్చి నాయకుడు, సినీ నటుడు శరత్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఉదయం ఆళ్వార్‌పేటలో మక్కల్‌నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌తో భేటీ అయ్యాక ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పదేళ్లుగా అన్నాడీఎంకే కూటమిలో కొనసాగానని, సీట్ల కేటాయింపులపై తమతో ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతారని ఎదురు చూశానని, ఆ నేతల నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో కూటమికి గుడ్‌బై చెప్పానని తెలిపారు. ఓ మంచి ప్రయత్నంగా శుక్రవారం ఐజేకే పార్టీతో పొత్తు కుదుర్చుకున్నానని ఆయన చెప్పారు. తన పార్టీని, ఐజేకేని కూటమిలోకి మక్కల్‌ నీదిమయ్యం చేర్చుకుంటుందనే అభిప్రాయపడుతున్నానని, ఆ దిశగా త్వరలో ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. 

Updated Date - 2021-02-28T16:33:03+05:30 IST