నాలుగో ‘ఆర్‌’పై కమలం గురి!

ABN , First Publish Date - 2022-08-04T10:24:05+05:30 IST

అసెంబ్లీలో మరోస్థానం పెంచుకోవడం ద్వారా నాలుగో ‘ఆర్‌’పై కమలం గురిపెట్టింది.

నాలుగో ‘ఆర్‌’పై కమలం గురి!

  • మునుగోడుపై బీజేపీ నేతల ఫోకస్‌
  • త్వరలో ఇన్‌చార్జుల నియామకం
  • ఉప ఎన్నికపై అధిష్ఠానానికి నివేదిక

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో మరోస్థానం పెంచుకోవడం ద్వారా నాలుగో ‘ఆర్‌’పై కమలం గురిపెట్టింది. కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరడానికి మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉప ఎన్నికలో గెలిచితీరాలని కమలనాథులు కంకణబద్ధులై ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజాసింగ్‌ ఒక్కరే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్‌రావు, హుజురాబాద్‌ నుంచి ఈటల రాజేందర్‌లు విజయం సాధించి, అసెంబ్లీలో పార్టీని ట్రిపుల్‌-ఆర్‌/ఆర్‌ఆర్‌ఆర్‌(రాజాసింగ్‌, రఘునందన్‌, రాజేందర్‌)గా కొనసాగిస్తున్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా నాలుగో ‘ఆర్‌’ను బీజేపీ తరఫున అసెంబ్లీకి పంపాలని కసరత్తు చేస్తున్నారు. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.


 ప్రజాసంగ్రామ యాత్ర లంచ్‌ విరామ సమయంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు తదితరులు ఈ వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌, నారాయణపూర్‌, గట్టుప్పల్‌, చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడల్లో పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికకు సన్నద్ధం చేసేందుకు రాష్ట్రస్థాయి నాయకులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. ఈ నియోజకవర్గం ఉప ఎన్నికకు సీనియర్‌ నేతను ఇన్‌చార్జిగా(సమన్వయకర్తగా) నియమించాలన్న ప్రతిపాదించనున్నారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు ఇన్‌చార్జిగా సీనియర్‌ నేత ఏపీ జితేందర్‌రెడ్డి వ్యవహరించారు. ఆయనది లక్కీ హ్యాండ్‌ అని పేరుంది. మునుగోడు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌, కోర్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ నేతలతో ఒకట్రెండ్రోజుల్లో చర్చించనున్నారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మునిసిపాలిటీల్లో పార్టీ ఎన్నికల ప్రచార సమన్వయానికి 10 మంది ఇన్‌చార్జుల్ని నియమించనున్నారని సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులపై వివిధ సంస్థలతో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా ఇన్‌చార్జుల నియామకం ఉంటుందని ఓ ముఖ్యనేత ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


జాతీయ నాయకత్వానికి నివేదిక

ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ నేతలు, జాతీయ నాయకత్వానికి ఒక నివేదిక పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో.. నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు, సంస్థాగతంగా పార్టీ బలం, బలహీనతలు, సామాజికవర్గాల ప్రాబల్యం తదితర అంశాలను ప్రస్తావించారు. మునుగోడులో యాదవ, గౌడ, పద్మశాలి, రెడ్డి, లంబాడా, మాదిగ సామాజికవర్గాల ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

Updated Date - 2022-08-04T10:24:05+05:30 IST