కామయ్య.. నీకు సరిలేరయ్య

ABN , First Publish Date - 2022-08-13T06:03:40+05:30 IST

ఆంగ్లేయులపై దశాబ్ద కాలం పాటు పోరాటం చేసిన ఆదివాసీ స్వాతంత్య్ర సమర యోధుడు మర్రి కామయ్య. ఉచితంగా మూలికా వైద్యం చేస్తూ ఆధ్యాత్మిక బోధన చేసే కామయ్య.. బ్రిటీషర్ల దురాగతాలపై తిరగబడ్డారు. శిష్యులతో కలిసి దళం ఏర్పాటు చేసి తెల్లదొరలపై పోరాడారు.

కామయ్య.. నీకు సరిలేరయ్య
గ్రామంలో మర్రి కామయ్య విగ్రహం

ఆదివాసీ స్వాతంత్య్ర సమర యోధుడు 

ముఠాదారీ వ్యవస్థపై తిరుగుబాటు

1930 కాలంలో దశాబ్దం పాటు పోరు

తమ గ్రామానికి కామయ్య పేరు పెట్టుకున్న ఆదివాసీలు

హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీలో గ్రామం

ప్రభుత్వ గుర్తింపునకు నోచుకోని మర్రి కామయ్య, వారసులు 


ఆంగ్లేయులపై దశాబ్ద కాలం పాటు పోరాటం చేసిన ఆదివాసీ స్వాతంత్య్ర సమర యోధుడు మర్రి కామయ్య. ఉచితంగా మూలికా వైద్యం చేస్తూ ఆధ్యాత్మిక బోధన చేసే కామయ్య.. బ్రిటీషర్ల దురాగతాలపై తిరగబడ్డారు. శిష్యులతో కలిసి దళం ఏర్పాటు చేసి తెల్లదొరలపై పోరాడారు. ప్రభుత్వం గుర్తించకపోయినా హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీలో ప్రజలు ఓ గ్రామానికి ఆయన పేరిట కామయ్యపేటగా నామకరణం చేశారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏటా ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు.


(పాడేరు/హుకుంపేట-ఆంధ్రజ్యోతి) 

ఆదివాసీలు తెల్లదొరల బానిసలు కాకుండా పోరాడిన మర్రి కామయ్య పేరుతో ఓ గ్రామం ఉంది. బ్రిటీష్‌ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు పేరుతో దశాబ్దాల తరువాత ప్రభుత్వం జిల్లాను ఏర్పాటుచేస్తే, అదే జిల్లా హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి గిరిజనులు తమ ఆరాధ్యుడు కామయ్య పేరును స్వచ్ఛందంగా పెట్టుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా కామయ్యను ప్రభుత్వాలు గుర్తించకపోయినా, ఆదివాసీలు మాత్రం ఆయనకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఇంతటి ఘన చర్రిత కలిగిన ఈ గ్రామాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి సందర్శించినప్పుడు కామయ్య పోరాట పటిమను ఆదివాసీలు వివరించారు.

ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తున్న కాలంలో ప్రస్తుతం హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ గరుడాపల్లి గ్రామానికి చెందిన మర్రి కామయ్య బౌద్ధ మతాన్ని ఆచరిస్తూ (స్థానికంగా ‘ఓలేక్‌’ అంటారు) చుట్టుపక్కల గిరిజనులకు ఉచితంగా మూలికా వైద్యం అందించేవారు. ఆధ్యాత్మిక బోధన చేసుకుంటూ జీవనం సాగించే కామయ్యకు  అనేక మంది శిష్యులు ఉండేవారు. బ్రిటీషు వాళ్లు ఆదివాసీ ప్రాంతాల్లో తమ పరిపాలనా సౌలభ్యం కోసం ముఠాదారి వ్యవస్థను ఏర్పాటుచేసి, వారితోనే ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేవారు. గిరిజనుల నుంచి ముఠాదారులు శిస్తు, కప్పం వంటివి వసూలు చేసి ఆంగ్లేయులకు ఇచ్చేవారు. ఈ క్రమంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ముఠాదారులు బలవంతంగా లాక్కునేవారు. దీంతో బాధితులైన గిరిజనులు బౌద్ధ గురువుగా వున్న మర్రి కామయ్య వద్దకు వచ్చి తమ సమస్యను చెప్పుకునేవారు. గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్న ముఠాదారీ వ్యవస్థపై తిరుగుబాటుకు కామయ్య శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తన శిష్యులుగా వున్న కొంతమందిని అనుచరులుగా మార్చుకుని, ఒక దళంగా ఏర్పడి ఆంగ్లేయులు, ముఠాదారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. గిరిజనులను చైతన్యం చేస్తూ ముఠాదారులకు ఎటువంటి శిస్తులు కట్టవద్దని, భూములను స్వాధీనం చేసుకోడానికి వస్తే తిరగబడాలని కామయ్య పిలుపునిచ్చేవారు. ఆంగ్లేయులకు తొత్తులుగా వున్న ముఠాదారుల ఆటలు సాగనీయకుండా గిరిజనులు ఐక్యంగా తిరుగుబాటు చేశారు. 1930 ప్రాంతంలో సుమారు దశాబ్ద కాలం మర్రి కామయ్య తన పోరాటాన్ని సాగించారు. ఆ క్రమంలో ఆయన్ను అరెస్టు చేసి జైలులో పెట్టాలని ఆంగ్లేయులు భావించినప్పటికీ, స్థానికుల సహకారంతో ఆజ్ఞాతంలో వుంటూనే పోరాటం కొనసాగించారు. వృద్ధాప్యంతో ఆయన 1959లో మృతిచెందారని, అప్పటికి ఆయన వయస్సు 65 నుంచి 70 వరకు వుంటాయని ఆదివాసీలు అంచనాగా చెప్పారు. 


కామయ్య పేరిట కామయ్యపేట ఏర్పాటు

ప్రస్తుతం కామయ్యపేటగా పిలుస్తున్న గ్రామం పేరు పూర్వం బీటుబయలుగా పిలిచేవారని, కామయ్య మృతి అనంతరం ఆయన పేరిట ఈ గ్రామానికి కామయ్యపేటగా నామకరణం చేశారని ఆదివాసీలు తెలిపారు. గరుడాపల్లి చెందిన కామయ్య ఆఖరి సమయంలో కామయ్యపేటలోనే తలదాచుకుని తుది శ్వాస విడిచారన్నారు. దీంతో ఆయనను సమాధి చేసిన ప్రదేశంలో 1981లో పెంకులతో స్మారక షెడ్డును నిర్మించారు. ఐదేళ్ల క్రితం తీగలవలస పంచాయతీకి సర్పంచ్‌గా చేసిన పి.కామేశ్వరరావు స్మారక ప్రదేశంలో మర్రి కామయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏటా మే ఐదో తేదీన మర్రి కామయ్య వర్ధంతిని గిరిజన సంఘాల నేతలు, స్థానికులు ఘనంగా నిర్వహిస్తున్నారు.


ప్రభుత్వ గుర్తింపునకు నోచుకోని మర్రి కామయ్య

ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడిగా స్థానికుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మర్రి కామయ్య ప్రభుత్వం గుర్తింపునకు నోచుకోలేదు. ముఖ్యంగా ఏ కేసుల్లోనూ అరెస్టు కాకపోవడంతో పాటు ఆయన కుటుంబీకులు నిరక్షరాస్యులు, అమాయకులు కావడంతో ప్రభుత్వపరంగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు. అందువల్లే ప్రభుత్వ రికార్డుల్లో స్వాతంత్య్ర సమర యోఽధుల జాబితాలో కామయ్యకు చోటు దక్కలేదు. దీంతో ఆయన వారసులు సైతం వెలుగులోకి రాని దుస్థితి కొనసాగుతున్నది. 

మర్రి కామయ్య కుమారుడు లచ్చన్నకు నాగరాజు, సుధాకర్‌ అనే ఇద్దరు కుమారులు. వారిలో నాగరాజు మృతిచెందగా, ప్రస్తుతం సుధాకర్‌, భార్య గున్నమ్మ, ముగ్గురు పిల్లలతో కామయ్యపేటలో వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతానికి మర్రి కామయ్య వారసుడిగా మనుమడు సుధాకర్‌ మాత్రమే ఉన్నారు. వారికి సైతం ప్రభుత్వపరంగా ఎటువంటి సాయం అందిన దాఖలాలు లేవు. గుడిసెను తలపించేలా వుండే చిన్న పెంకుటిల్లులో సుధాకర్‌ కుటుంబం జీవనం సాగిస్తున్నది. ఆదివాసీ స్వాతంత్య్ర సమర యోధుడిగా మర్రి కామయ్యకు, ఆయన వారసులకు గుర్తింపు, ఆదరణ లేకపోవడంపై ఆదివాసీ ప్రజానీకం తీవ్ర ఆవేదన చెందుతున్నది. 


Updated Date - 2022-08-13T06:03:40+05:30 IST