నిండుకుండలా కల్యాణి డ్యామ్‌

ABN , First Publish Date - 2020-12-06T05:34:34+05:30 IST

కళ్యాణి డ్యామ్‌ నిండు కుండను తలపిస్తోందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు.

నిండుకుండలా కల్యాణి డ్యామ్‌
డ్యామ్‌లోని నీటిని చూస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు

రెండో గేటు ద్వారా 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి


చంద్రగిరి, డిసెంబరు 5: కళ్యాణి డ్యామ్‌ నిండు కుండను తలపిస్తోందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. శనివారం డ్యామ్‌ వద్ద జలహారతి ఇవ్వడంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే డ్యామ్‌ రెండో గేటు ఎత్తి 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో నీటి సమస్యకు పరిష్కారం లభించినట్లయ్యిందన్నారు. డ్యామ్‌ నీటి మట్టం 900 అడుగులైతే.. ప్రస్తుతం 895 అడుగుల వరకు చేరిందన్నారు. 780 ఎంసీఎఫ్టీ నీరు నిల్వ ఉందన్నారు. నాడు రాజశేఖర్‌రెడ్డి పాలనలో, నేడు సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలో డ్యామ్‌ నీటితో నిండిందన్నారు. ఈనీటితో నియోజకవర్గ పరిధిలోని చెరువులను నింపడానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. డ్యామ్‌ నీరు ప్రవహించే పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇరిగేషన్‌ ఈఈ వెంకటశివారెడ్డి, ప్రభుత్వ విప్‌ అదనపు ఓఎస్డీ కిరణ్‌కుమార్‌, ఎంపీడీవో రాధమ్మ, ఇరిగేషన్‌ ఏఈ సుధీప్‌రెడ్డి, వైసీపీ ఎంపీపీ అభ్యర్థి హేమేంద్రకుమార్‌రెడ్డి, ఎ.రంగంపేట వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి బోస్‌ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


2014 తర్వాత మళ్లీ ఇప్పుడే..

2014లో టీడీపీ అధికారంలో రాగానే భారీ వర్షాలు కురిశాయి. దీంతో అప్పటి మాజీమంత్రి గల్లా అరుణకుమారి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేతుల మీదుగా మూడు గేట్లు ఎత్తారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు కూడా సంక్రాంతి పండుగకు స్వగ్రామం నారావారిపల్లెకు విచ్చేసి.. డ్యామ్‌ వద్ద జలహారతి ఇచ్చారు. పీలేరు-తిరుపతి దారి మార్గమైన నరసింగాపురం రైల్వేగేటు, చంద్రగిరి -శ్రీనివాసమంగాపురం మార్గంలోని మిట్టపాలెం, చంద్రగిరి -తిరుపతి రహదారిలో తొండవాడ స్వర్ణముఖి దారిలో వాహనాలు రాకపోకలు అప్పట్లో నిలిపేశారు. 

Updated Date - 2020-12-06T05:34:34+05:30 IST