కొద్దిరోజులుగా మెగా డాటర్ శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతుల మేటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల శ్రీజ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో శ్రీజకళ్యాణ్ అనే తన పేరు నుంచి కళ్యాణ్ ను తొలగించి శ్రీజ కొణిదెల గా మార్చుకొని అభిమానులకు షాకిచ్చింది. సరిగ్గా ధనుష్, ఐశ్వర్యా విడిపోయిన రోజునే శ్రీజ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఇద్దరి మధ్యా మనస్పర్ధలు తలెత్తాయని, అందుకే ఈ జంట కూడా త్వరలోనే విడిపోతారేమో అన్నట్టుగా వార్తలొస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘సూపర్ మచ్చి’ సినిమాకి మెగాఫ్యామిలీ నుంచి సపోర్టే లేకుండా పోయింది. దానికి తగ్గట్టుగానే సినిమాని ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్స్ లో విడుదల చేశారు. ఆ సినిమాని హీరో కళ్యాణ్ దేవే పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి.
కళ్యాణ్ దేవ్ నటించిన ‘కిన్నెరసాని’ చిత్రం కూడా త్వరలో విడుదల కాబోతోంది. ఆ సినిమా పరిస్థితి కూడా ఇలాగే అవుతుందని విమర్శలు వస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ మొదటి చిత్రం ‘విజేత’ కు మెగా ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ లభించింది. సినిమా ఆశించిన రీతిలో అలరించకపోయినప్పటికీ.. మెగాస్టార్ చిన్నల్లుడు హీరో అయ్యాడు అని జనానికి తెలిసింది. సమంత.. చైతూతో విడిపోయే ముందు తన పేరు నుంచి అక్కినేని తొలగించినట్టుగానే.. శ్రీజ తన పేరునుంచి భర్త పేరును తొలగించడంతో ఇక కళ్యాణ్ దేవ్ కెరీర్ ముగిసినట్టేనని చర్చించుకుంటున్నారు. ఈ కారణంతోనే అతడి ‘సూపర్ మచ్చి’ మూవీని ఎవరూ పట్టించుకోలేదని అనుకుంటున్నారు. మరి ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.