కల్యాణలక్ష్మి.. కటాక్షమేదీ?

ABN , First Publish Date - 2020-07-09T11:49:31+05:30 IST

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. పేదింటి ఆడపిల్ల వివాహానికి ఆసరాగా ..

కల్యాణలక్ష్మి.. కటాక్షమేదీ?

కరోనా ఎఫెక్ట్‌తో నిధుల విడుదలలో జాప్యం

సాయం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు

ఎస్సీ, ఎస్టీ అర్హులకు మాత్రమే అందజేత

షాదీముబారక్‌ లబ్ధిదారులకూ దూరం

జిల్లాలో  పెండింగ్‌లో 2,969 దరఖాస్తులు

రూ.29.72 కోట్లు విడుదలైతేనే అందరికీ సాయం


సంగారెడ్డి టౌన్‌, జూలై 8 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. పేదింటి ఆడపిల్ల వివాహానికి ఆసరాగా నిలవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా లక్షా 116 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు ఈ పథకం కింద నిధులు విడుదలవుతున్నప్పటికీ బీసీ లబ్ధిదారులకు మాత్రం అందడం లేదు. అలాగే షాదీముబారక్‌ పథకం ద్వారా మైనార్టీలకు నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది.


2016లో రాష్ట్ర ప్రభుత్వం కలాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశ పెట్టింది. మొదట్లో రూ.51 వేల ఆర్థికసహాయం అందించగా తర్వాత రూ.71,116కు పెంచారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ మొత్తాన్ని లక్షా 116 వేల రూపాయలకు పెంచి 2019 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నది. అయితే ప్రభుత్వం ఆర్థిక సాయం పెంచడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ డబ్బు సకాలంలో అందడం లేదని వాపోతున్నారు. పెళ్లి సమయంలోనే ఈ ఆర్థిక సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామని గతంలో ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


18 నెలలుగా జాప్యం

2019 జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన పెళ్లిళ్లకు సంబంధించిన ఆర్థిక సహాయం కోసం జిల్లాలో 2,969 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారుల ద్వారా తెలిసింది. వాటిలో కల్యాణలక్ష్మి పథకం కింద బీసీలకు సంబంధించిన 2,334  దరఖాస్తులు, షాదీముబారక్‌ పథకానికి సంబంధించి మైనార్టీలకు చెందిన 635 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సాయం అందుతున్నప్పటికీ బీసీ, ఓసీలతో పాటు మైనార్టీలకు మాత్రం 18 నెలలుగా నిధులు విడుదల కావడం లేదు. దీంతో తమ బిడ్డ పెళ్లికి ప్రభుత్వం అందించే సాయం తోడవుతుందనుకున్న తల్లిదండ్రుల ఆశ అడియాస అవుతున్నది. 


రెవెన్యూ డివిజన్ల వారీగా పెండింగ్‌ దరఖాస్తులు

జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ల పరిధుల్లో పెండింగ్‌లో ఉన్న 2,969 కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం రూ.29.72 కోట్లను విడుదల చేయాల్సి ఉన్నది. ఇక పెండింగ్‌ దరఖాస్తుల విషయానికి వస్తే.. జహీరాబాద్‌ డివిజన్‌ పరిధిలో 728 కల్యాణలక్ష్మి, 227 షాదీముబారక్‌ దరఖాస్తులు, నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 754 కల్యాణలక్ష్మి, 133 షాదీముబారక్‌ దరఖాస్తులు, సంగారెడ్డి డివిజన్‌ పరిధిలో 852 కల్యాణలక్ష్మి, 275 షాదీముబారక్‌ దరఖాస్తులు ఉన్నాయి. వీటికి త్వరలోనే నిధులు విడుదల చేయాలని పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Updated Date - 2020-07-09T11:49:31+05:30 IST