తెలుగు చైతన్య దీపిక

ABN , First Publish Date - 2022-05-28T06:04:52+05:30 IST

భారత కళామతల్లి సువర్ణకీర్తి– చంద్రహార! సద్గుణ సాంద్ర! సకలజనమ నోభిరామ!

తెలుగు చైతన్య దీపిక

భారత కళామతల్లి సువర్ణకీర్తి–

చంద్రహార! సద్గుణ సాంద్ర! సకలజనమ

నోభిరామ! త్రింశత సుమనోజ్ఞ చలన

చిత్త తేజ‌! ‘తారకరామ!!’ – జోతలివియె!!

‘విశ్వనటసార్వభౌమ‌’! సద్విమల సుచరి

తాభరణ! ‘నందమూరి’ వంశాబ్ధి కీర్తి

చంద్ర! తెలుగు చలనచిత్ర స్వర్ణ యుగయ

శస్వి! ‘తారకరామ!!’ – శ్రీ చందనమ్ము!!

శ్రీలు రంజిల్లు ‘కృష్ణమ్మ’ సిరులపల్లె

‘నిమ్మకూరు’ గారాల పున్నెముల పంట!

రమ్యమూర్తి ‘పద్మశ్రీ’ విరాజ ‘యన్.టి

ఆర్’కు శత జయంతి – ప్రసూనార్చనమ్ము!!


దివ్య వేంకటేశ్వర– శివదేవ– రామ–

కృష్ణ– భీష్మ– వీరబ్రహ్మ– కర్ణ పాత్ర

ధారి, రావణాసుర– సుయోధన– అశోక

పాత్రధారి ‘రామన్న’కు– ప్రణతులివియె!!


ఆర్ష విజ్ఞాని! సుప్రజాహృదయనేత!

తెలుగు చైతన్య దీపిక! తెలుగునాట–

రామరాజ్య– తారకరామ ‘రమ్య’ శతజ

యంతి– కవితా సువర్ణ పుష్పాంజలులివె!!

– కళ్యాణశ్రీ

Updated Date - 2022-05-28T06:04:52+05:30 IST