కల్యాణ మిత్ర

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

బౌద్ధంలో చాలా ఎక్కువగా కనిపించే పదం ఇది. ‘శ్రేయస్సు, మంగళం, భద్రం, శుభం, కుశలం, క్షేమం’... ఇవన్నీ ‘కల్యాణ’ అనే మాటకు పర్యాయ పదాలే...

కల్యాణ మిత్ర

బౌద్ధంలో చాలా ఎక్కువగా కనిపించే పదం ఇది. ‘శ్రేయస్సు, మంగళం, భద్రం, శుభం, కుశలం, క్షేమం’... ఇవన్నీ ‘కల్యాణ’ అనే మాటకు పర్యాయ పదాలే. ‘కల్యం సుఖం అణయతి ప్రాపయతి ఇతి కల్యాణం’ అంటారు. ‘సుఖాన్ని ఇచ్చేది, పెంపొందించేది’ అని అర్థం. ఏ మిత్రుని చెలిమి వల్ల మనకు దుఃఖం తొలగిపోతుందో అతడే కల్యాణ మిత్రుడు. బౌద్ధంలో గురువును కూడా ‘కల్యాణ మిత్రుడు’ అని అంటారు. శీలవంతుడైన స్నేహితుడు, విజ్ఞుడు, బోధి మార్గంలో జ్ఞానాన్ని సాధించడానికి సహకరించేవాడు కల్యాణ మిత్రుడు. అలాంటి మిత్రుణ్ణి ఎంపిక చేసుకోవడంలో తగిన జాగరూకత కలిగి ఉండాలి. అలాంటి మిత్రునికి సంయమనం ఉండాలి. అతను గొప్ప మానసిక వ్యవసాయదారుడై ఉండాలి. విశ్వాసి కావాలి. దాచకుండా ఇచ్చే దానగుణం కలిగి ఉండాలి. బుద్ధుడు ధర్మమార్గం గురించి చెబుతూ ‘‘ఆది కల్యాణం, మధ్య కల్యాణం, అంత్య కల్యాణం కలిగించేది నా ధర్మం’’ అని చెప్పాడు. తన మార్గాన్ని కల్యాణదాయకమార్గంగా ప్రకటించాడు. దుఃఖరహితమైన మార్గంలో చివరివరకూ మనకు మార్గదర్శిగా, చేదోడు వాదోడుగా ఉండి, మనను ప్రజ్ఞావంతులుగా మార్చి ఎవరు నడిపిస్తారో వారే కల్యాణ మిత్రులు.

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST