Abn logo
Oct 17 2020 @ 02:13AM

కల్వకుర్తి లిఫ్ట్‌ మునక!

Kaakateeya

  • భారీ శబ్దంతో కూలిన మోటార్ల బేస్‌మెంట్‌
  • ఎగిరిపడ్డ మోటారు పరికరాలు
  • సర్జ్‌పూల్‌ నుంచి పోటెత్తిన కృష్ణా నీరు
  • లిఫ్ట్‌ ఐదు మోటార్లకూ నష్టం
  • పది అంతస్తుల్లోకి నిమిషాల్లో చేరిన వరద
  • పాలమూరు లిఫ్టు బ్లాస్టింగులే కారణమా?
  • గతంలోనే హెచ్చరించిన నిపుణుల కమిటీ
  • బ్లాస్టింగులు కారణం కాదంటున్న అధికారులు
  • సాంకేతిక వైఫల్యమే... గత ప్రభుత్వాలే కారణం
  • అన్ని కోణాల్లో దర్యాప్తు: మంత్రి నిరంజన్‌రెడ్డి 


మధ్యాహ్నం 3:40 గంటలకు మూడో మోటారు ప్రారంభించగా క్షణాల్లోనే మోటార్ల బేస్‌మెంట్‌ పెద్దశబ్దంతో బ్లాస్ట్‌ అయ్యింది. చూస్తుండగానే నీరు పైకిరావడంతో ఏడుగురం పరుగులు పెట్టాం. ప్రాణ నష్టం జరగలేదు.

- మల్లేశ్‌, పంపుహౌస్‌ ఉద్యోగి


మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లూరు వద్ద కృష్ణా నది ఒడ్డున ఉన్న పథకం మొదటి దశ లిఫ్టు పంపుహౌస్‌ లోపల శుక్రవారం సాయంత్రం పంపింగ్‌ నడుస్తున్న సమయంలో ఉన్నట్లుండి మోటార్‌ బిగించిన ఫౌండేషన్‌ బోల్టులు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. దీంతో పంప్‌హౌస్‌ గోడని చీల్చుకొని ఫౌండేషన్‌ రాడ్లు, మోటార్ల పరికరాలు దూసుకపోవడంతో సర్జిపూల్‌ నుంచి వరదనీరు ఒక్కసారిగా పంప్‌హౌ్‌సలోకి చేరింది. నీటిని ఆపే అవకాశం లేకపోవడంతో కొన్ని నిమిషాల్లోనే పంప్‌హౌ్‌సలోని 14 అంతస్తులకు గాను పది అంతస్తుల్లోకి నీరు చేరిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్న ఇంజనీర్లు, సిబ్బంది తేరుకొని మోటార్లను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడం, అదే సమయంలో నీరు భారీగా వస్తుండడంతో వారంతా బయటకు పరుగులు తీశారు. ప్రమాదం సాయంత్రం నాలుగుగంటల సమయంలో జరిగినా ఆరు గంటల వరకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చినా, బాహ్య ప్రపంచానికి తెలియలేదు. సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో విషయం బయటకు పొక్కడంతో స్థానికుల్లో ఆందోళన కనిపించింది.

రంగారెడ్డి పనుల్లో బ్లాస్టింగ్‌లే కారణమనే సందేహం

కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 200 మీటర్లకు లోబడిన దూరంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మొదటిదశ పంపుహౌ్‌సను భూగర్భంలో నిర్మిస్తున్నారు. ఈ పంప్‌హౌస్‌ నిర్మాణంపై అప్పట్లోనే ప్రతిపక్షాలు, సాంకేతిక నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కల్వకుర్తి పంపుహౌ్‌సకు సమీపంలో భూగర్భంలో మరో పంపుహౌ్‌సకడితే ఎప్పుడైనా ప్రమాదమేనని హెచ్చరించారు. అప్పట్లో ప్రభుత్వం నియమించిన ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ సైతం ఇక్కడ భూగర్భ పంపుహౌజ్‌ వద్దని సూచించింది. తాజాగా శుక్రవారం ఈ పంపు హౌజ్‌ నిర్మాణానికి గాను వరుస బ్లాస్టింగులు చేశారని, దీంతో అక్కడ భూమి కంపించి పోయిందని, దీంతో సమీపంలోని కల్వకుర్తి పంపుహౌజ్‌లో సైతం ఈ పేలుళ్ల వల్లే భూమి బీటలు బారి, పగుళ్లతో ప్రమాదానికి దారి తీసిందని ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం దీన్ని కొట్టిపడేస్తున్నారు. పంపుహౌజ్‌లోకి నీరు రావడడానికి గల కారణాలను ఇంకా తేల్చాల్సి ఉందని, పాలమూరు పంప్‌హౌజ్‌ బ్లాస్టింగు కారణం కాదని చెబుతున్నారు. 


2.50 లక్షల ఎకరాల ఆయకట్టు  

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పథకం కింద ఈ సీజన్‌లో 3.20 లక్షల ఎకరాలకు నీరివ్వాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. గతేడాది 2.50 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. ఈ పథకం కింద నాగర్‌కర్నూల్‌, వనపర్తి, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పంటలు సాగవుతున్నాయి. పంపుహౌజ్‌లోని అయిదు మోటర్లు నీట మునిగిపోవడంతో తర్వాతి దశలకు నీరందించే పరిస్థితిని ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో అధికారులు చెప్పాల్సి ఉంది. ఈ పథకాన్ని పునరుద్ధరించాలంటే, నదిలో నీరు తగ్గడంతో పాటు, తిరిగి పంపులు, మోటర్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్‌కు వర్షాలు అనుకూలంగా ఉండడంతో ఆయకట్టులో చెరువులు నిండడం, బోరు బావులకు భూగర్భ జలాలు అందుబాటులో ఉండడంతో ఈ సీజన్‌ వరకు సాగుకు ఇబ్బంది లేకపోయినా, వచ్చేరబీకి నీరందండం చాలా అవసరం. ఈలోగా ఈ పంపుహౌజ్‌ని పునరుద్ధరిస్తే ఇబ్బందులు రావు. కాగా, 2015 సెప్టెంబరులో కూడా ఎంజీఎల్‌ఐ మొదటి లిఫ్టు పూర్తిగా మునిగిపోయింది. అప్పట్లో ఎంజీఎల్‌ఐ నిర్వహణ విషయంలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అప్రోచ్‌ కెనాల్‌ నుంచి సర్జిఫుల్‌ షట్టర్లు బిగించకుండా నిర్లక్ష్యం వహించినందుకే మోటార్లు నీట మునిగాయని పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మోటార్లు నీటిలో మునగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ ప్రమాదం ప్రభుత్వ కమీషన్ల కక్కుర్తికి నిదర్శనంగా ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఏం జరిగిందంటే

ఉదయం 10 గంటలకు పటేల్‌ కంపెనీ సిబ్బంది, ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు అధికారులు మొదటి మోటారును ఆన్‌ చేశారు. పంపింగ్‌ను మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగించారు. 3:45 గంటలకు పంపుహౌ్‌సలో ఉన్న మూడో మోటారు ద్వారా నీటి పంపింగ్‌ను ఆన్‌ చేశారు. పది నిమిషాల్లోనే పెద్ద శబ్దంతో పంపుహౌ్‌సలో ఉన్న బేస్‌మెంట్‌ కూలిపోయింది. 3:50 గంటలకు పంపుహౌ్‌సలోకి నీరు రావడం ప్రారంభమైంది. 4:05 గంటలకు పంపుహౌ్‌సలో ఉన్న సిబ్బంది ప్రాణభయంతో పైకి పరుగులు పెట్టారు. 4:10 గంటలకు సిబ్బంది పంపుహౌ్‌సకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. 4:30 గంటలలోపు పంపుహౌ్‌సలో 45 మీటర్ల మేర నీరు పెరిగి ఆగిపోయింది. శ్రీశైలం రిజర్వాయర్‌ నీటి లెవల్‌ మేర పంపుహౌ్‌సలో నీరు చేరింది. అధికారులు, సిబ్బంది విషయాన్ని గోప్యంగా ఉంచడంతో రాత్రి 8 గంటలకు విషయం బయటకు పొక్కింది. 8 గంటల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు వద్దకు పరుగులు పెట్టారు. 


అన్ని కోణాల్లో విచారణ: నిరంజన్‌రెడ్డి

ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పంపింగ్‌ ప్రారంభించే క్రమంలో నీళ్లు పంపింగ్‌ స్టేషన్‌లోకి వచ్చినట్లు ప్రాథమికంగా నివేదిక అందిందని, గత ప్రభుత్వాల వైఫ్యలం కారణంగానే సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని నిరంజన్‌రెడ్డి చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement