Charminarపై కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీ.. కేసు నమోదు.. అసలేం జరిగింది..!?

ABN , First Publish Date - 2022-03-13T14:54:05+05:30 IST

Charminarపై కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీ.. కేసు నమోదు.. అసలేం జరిగింది..!?

Charminarపై కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీ.. కేసు నమోదు.. అసలేం జరిగింది..!?

  • ప్రదర్శించిన నాయకుడిపై కేసు

  

హైదరాబాద్ సిటీ/చార్మినార్‌ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు అత్యుత్సాహంతో శనివారం చార్మినార్‌పై ఆమె ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడిపై చార్మినార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్‌ఎస్‌ మొఘల్‌పురా డివిజన్‌ అధ్యక్షుడు పుప్పాల రాధాకృష్ట శనివారం మధ్యాహ్నం సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి చార్మినార్‌పైకి ఎక్కి కవిత ఫొటోతోపాటు జన్మదిన శుభాకాంక్షలు అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. కింద ఉన్న వారు ఫొటోలు తీస్తుండటంతో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఫ్లెక్సీని స్వాధీనం చేసుకున్నారు. పుప్పాల రాధాకృష్టపై 2007లో కూడా ఇలాంటి కేసే నమోదు అయింది. అప్పట్లో కవిత ఆధ్వర్యంలో ముషాయిరా నిర్వహించగా, రాజీవ్‌ సద్భావన స్తూపం వద్ద సభాస్థలికి అడ్డుగా ఉందని జెండా పైప్‌ను తొలిగించాడు. అప్పుడు కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తాజా ఘటనపై చార్మినార్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువానాయుడును ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, పురావస్తు శాఖ అధికారి నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. 


సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం

చారిత్రక చార్మినార్‌ అందాలను తిలకించేందుకు రోజూ దేశ విదేశాల నుంచి, నగర నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. చార్మినార్‌ పైకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేస్తారు. చిన్నపొరపాటు జరిగినా పైకి అనుమతించరు. సవాలక్ష నిబంధనలు చెబుతారు. చార్మినార్‌పైనా సెక్యూరిటీ సిబ్బంది నిఘా ఉంటుంది. అయినా, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఫ్లెక్సీని పైకి తీసుకెళ్లి ప్రదర్శించడం వెనుక వారి నిర్లక్ష్యం ఉందని అంటున్నారు. వారి సహకారంతోనే ఫ్లెక్సీని పైకి తీసుకువెళ్లాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-03-13T14:54:05+05:30 IST