Abn logo
Jun 10 2021 @ 23:41PM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఏడీఏ

చింతకాని జూన్‌ 10: విత్తన, పురుగుమందుల దుకాణాల్లో సంబందిత రికార్డుల నిర్వహణ తప్పక నిర్వహించాలని మధిర ఏడీఏ కొంగర వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని చింతకాని, లచ్చగూడెం గ్రామాల్లో విత్తనాల దుకాణాలను, సొసైటీ కార్యాలయాల్లో ఆయన తనిఖీ నిర్వహించారు. విత్తనాలకు సంబందించిన బిల్లులు, షాపులకు సంబందించిన లైసెన్స్‌లు, స్టాక్‌ రిజిష్టర్‌లు, బిల్‌ బుక్‌లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్‌ కేసు నమోదు చేసి లైసెన్స్‌లను రద్దుచేస్తామని డీలర్‌లను హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయాన్ని సందర్శించి ఎరువుల విక్రయాలపై సిబ్బందికి పలు సూచనలు చేసారు. వానాకాలం పంటకు సంబందించి సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, యూరియా కొరత రాకుండా ముందుస్తు నిల్వలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ పల్లెల నాగయ్య, ఏఈఓ శ్రీకాంత్‌,రజిత, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.