YS Viveka Case: ఆ ముగ్గురి పేర్లు చెప్పమన్నారు

ABN , First Publish Date - 2021-11-30T08:56:24+05:30 IST

‘వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలే హత్య చేయించారని ఒప్పుకోవాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌, అప్పట్లో సిట్‌లో పనిచేసిన మడకశిర సీఐ శ్రీరామ్‌ బెదిరిస్తున్నారు’’

YS Viveka Case: ఆ ముగ్గురి పేర్లు చెప్పమన్నారు

  • వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శంకర్‌రెడ్డిలే వివేకాను హత్య చేయించినట్టు  ఒప్పుకోమన్నారు
  • నాడు సిట్‌, ఇప్పుడు సీబీఐ నుంచి తీవ్ర ఒత్తిడి
  • వారి నుంచి నాకు రక్షణ కల్పించండి
  • అనంత ఎస్పీకి శంకర్‌రెడ్డి అనుచరుడి వినతి
  • శంకర్‌రెడ్డికి 4 రోజుల్లోనే ముగిసిన సీబీఐ కస్టడీ


అనంతపురం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ‘‘వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలే హత్య చేయించారని ఒప్పుకోవాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌, అప్పట్లో సిట్‌లో పనిచేసిన మడకశిర సీఐ శ్రీరామ్‌ బెదిరిస్తున్నారు’’ అని కల్లూరు గంగాధర్‌ రెడ్డి అలియాజ్‌ కువైట్‌ గంగాధర్‌ రెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు. సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను కలిసి వారిద్దరిపై ఫిర్యాదు చేశారు. తనకూ, తన కుటుంబానికీ రక్షణ కల్పించాలని కోరారు. అయితే, అతడు అలా ఫిర్యాదు ఇచ్చాడో లేదో... పోలీసులు ఆ వెంటనే రక్షణ కల్పించడం, ఓ సీఐ స్థాయి అధికారి అతన్ని తన వాహనంలో ఎక్కించుకొని వెళ్లడం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా తననుతాను పరిచయం చేసుకున్న అతని ఫిర్యాదును అనుసరించి..‘‘నేను దేవిరెడ్డి శంకర్‌రెడ్డి అనుచరుడిని. సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా వైఎస్‌ వివేకానందరెడ్డి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కృషిచేశాను. ఇదే క్రమంలో వివేకా హత్య జరిగింది. దీంతో నన్ను అప్పటి సిట్‌ అధికారి సీఐ శ్రీరామ్‌ పిలిపించారు. వివేకాను హత్య చేస్తే.. రూ.10 కోట్లు ఇచ్చేలా శంకర్‌రెడ్డి నాతో ఒప్పందం చేసుకున్నట్లు ఒప్పుకోవాలని సిట్‌ సీఐ శ్రీరామ్‌ చిత్రహింసలకు గురిచేశారు.


ఆ తరువాత కేసును చేపట్టిన సీబీఐకి చెందిన అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌ కూడా బెదిరించారు. సీబీఐ కోరినట్లుగానే చెప్పాలని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత ఒత్తిడి తెచ్చారు. అలాచేస్తే.. రూ. 10 లక్షలతో పాటు మధుమేహ వ్యాధితో పుండ్లు పడిన కాళ్లు ఆస్పత్రిలో బాగు చేయిస్తామని ఆమె తరఫువారు ఆఫర్‌ ఇచ్చారు. ఈ కేసులో మంగళవారం కోర్టులో జడ్జి ఎదుట నేను వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. దీంతో కొద్దిరోజులుగా నా ఇంటి చుట్టుపక్కల ఎవరో గుర్తు తెలియని కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు. అందుకే పోలీసు రక్షణను కోరేందుకు ఎస్పీని కలిశాను’’ అని గంగాధర్‌ రెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 


నాలుగు రోజులకే..

పులివెందుల / కడప (రూరల్‌), నవంబరు 29: వివేకా హత్య కేసులో అరెస్టు అయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కస్టడీ నాలుగురోజులకే ముగిసింది. సోమవారం మధ్యాహ్నం 3:30గంటల ప్రాంతంలో సీబీఐ అధికారులు శివశంకర్‌రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి కోర్టు ఆదేశాలతో సెంట్రల్‌ జైలుకు తరలించారు. వివేకా హత్య కేసులో ఈయనను 8 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. కోర్టు 7 రోజులిచ్చిన సంగతి తెలిసిందే. కానీ 3 రోజులు ముందే తిరిగి కోర్టు ముందు హాజరుపరచడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి తెచ్చుకున్న బెయిల్‌ను రద్దుచేయాలని 20 రోజుల క్రితం సీబీఐ తరుపున నాలుగో అదనపు జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు సదరు పిటిషన్‌ను సోమవారం విచారణ జరిపి 30వ తేదీ మంగళవారానికి వాయిదా వేశారు. ఇదే కోర్టులోనే శివశంకర్‌రెడ్డి తరపున వేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు డిస్‌మిస్‌ చేసినట్లు సమాచారం.

Updated Date - 2021-11-30T08:56:24+05:30 IST