శ్రీలంకలో తమిళపులులను, తమిళులనూ లంకప్రభుత్వం ఊచకోతకోస్తున్న కాలంలో తమిళనాడుకు వలసలు సాగిన దృశ్యాన్ని గతంలో చూశాం. ఆ స్థాయిలో కాకున్నా ఇప్పుడు మరోమారు లంకనుంచి భారతదేశతీరానికి జనం తరలివస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. అక్రమంగా వస్తున్నవారిని అరెస్టు చేసినట్టు తీరరక్షకదళం ప్రకటనలు చేస్తున్నది. చరిత్రలో కనివినీ ఎరుగనిస్థాయిలో శ్రీలంక ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. చమురు కొనుగోలు చేసే శక్తిలేక దిగుమతులు నిలిచిపోయాయి. ఆహారపదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధం పతాకస్థాయిలో ఉన్నప్పుడు కూడా నిరాటంకంగా నడిచిన దినపత్రికలు ఇప్పుడు న్యూస్ ప్రింట్ కొరతతో ప్రచురణమానుకుంటున్నాయి. కాగితం కొరత తీవ్రస్థాయిలో ఉన్నందున యాభైలక్షలమంది పిల్లలకు నిర్వహించలసిన హైస్కూల్ పరీక్షలను ప్రభుత్వం నిరవధికంగా వాయిదావేసింది. లంక కష్టాలమీద మీడియాలో వస్తున్న కథనాలు చలింపచేసేవిగా ఉన్నాయి.
గోరుచుట్టుపై రోకటిపోటుమాదిరిగా లంక ఆర్థిక కష్టాలున్నాయి. పర్యాటకం ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న లంకను కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బకొట్టింది. దీనికితోడుగా, సరైన దీర్ఘకాలిక ప్రణాళికలు లేకుండా ప్రభుత్వ హడావుడిగా ఆర్గానిక్ వ్యవసాయంవైపు రైతులను మళ్ళించడంతో ఉన్న కాస్త ఉత్పత్తీ పడిపోయింది. మూలుగుతున్న లంకను ఉక్రెయిన్ యుద్ధం మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. ముడిచమురు రేటు ఇంకా పెరిగి, దిగుమతులు మరింత తగ్గిపోవడంతో ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటేశాయి. కాగితం, మందులు మాత్రమే కాదు, అనేక కనీసావసరాలను కూడా లంక దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. విదేశీమారకద్రవ్య నిల్వలు తీవ్రంగా పడిపోయినస్థితిలో అత్యవసరాలను కూడా వదులుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ద్రవ్యోల్బణం లెక్కలు పక్కనబెడితే, బియ్యం రేటు అనతికాలంలోనే యాభైశాతం పెరిగిందనీ, కూరగాయలరేట్లు ఐదురెట్లు పెరిగాయనీ అంటున్నారు. కడుపుపూర్తిగా నింపుకోగలిగే స్తోమత లేకపోవడంతో అధికజనం ఆకలితోనే పడుకుంటున్నారట. ప్రభుత్వం స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనంలో కొన్ని పదార్థాలకు కోతబెట్టి, మరికొన్నింటి పరిమాణాన్ని కుదించింది. ప్రజలకు రోజులో గరిష్ఠసమయం క్యూలైన్లలోనే గడిచిపోతోంది. గంటలతరబడి నిలబడడంతో వయోవృద్ధులు కుప్పకూలిపోతున్న వార్తలు కూడా వస్తున్నాయి. క్యూలైన్లలో ఘర్షణలు జరుగుతున్నాయి. గ్యాస్, విద్యుత్, కిరోసిన్ కొరతలతో ప్రజలు వంటకు కూడా తంటాలుపడవలసిన దుస్థితి. ఈ నెల మొదటివారంలో లంక ప్రభుత్వం తన రూపాయి విలువను 15శాతం తగ్గించింది. ప్రస్తుతం దాని విలువ యాభైశాతం మేరకు పడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. రెండేళ్ళక్రితం చేజేతులా రాజపక్స సోదరులను అధికారంలో కూచోబెట్టినందుకు జనం ఎంతో బాధపడుతున్నారట. విచిత్రమేమంటే, తమదేశం ఈ దుర్భరస్థితినుంచి బయటపడుతుందన్న నమ్మకం అత్యధికుల్లో లేకపోవడం. తమ జీవితాల్లో ఇక మార్పురాదనీ, దేశాన్ని విడిచిపోవడం వినా మరోమార్గం లేదనీ ప్రజలు నమ్ముతున్నారట. నిరాశ, నిస్పృహ, ఆగ్రహంతో జనం ఊగిపోతున్నారు.
భారీ ప్రాజెక్టుల పేరుతో లంకను పూర్తిగా అప్పుల ఊబిలోకి ముంచివేసింది చైనా. విదేశీ రుణాన్ని తీర్చలేనిస్థాయికి దిగజారి శ్రీలంక అంతర్జాతీయంగా అప్రదిష్టపాలవుతున్నది. మొన్నటిదాకా చైనాతో చేయీచేయీ కలిపిన రాజపక్స సోదరులకు ఈ కష్టకాలంలో భారత్ సాయమూ అవసరపడింది. భారతదేశం కూడా ఎంతో ఉదారంగా రెండు విడతల్లో భారీ ఆర్థికసాయంతో లంకను ఆదుకున్నది కూడా. విదేశాంగమంత్రి జయశంకర్ ఇటీవలే లంకలో పర్యటించి శక్తిమేరకు మరింత సాయం చేస్తామని హామీ ఇచ్చిమరీ వచ్చారు. ఈ విషయంలో చైనాకంటే దూకుడుగా భారత్ వ్యవహరిస్తున్నందుకు విదేశీవ్యవహారాల నిపుణులు సైతం మెచ్చుకుంటున్నారు. మహీంద రాజపక్సే దీర్ఘకాలంగా అమలుచేసిన భారత వ్యతిరేక, చైనా అనుకూల వైఖరి అందరికీ తెలిసిందే. లంక ప్రజలు ఇప్పుడు తిరగబడుతున్నారు కనుక పాలకులు అవసరార్థం సాగిలబడవలసి వస్తున్నది. వారిని అటుంచితే, కష్టకాలంలో లంక ప్రజలను ఆదుకోవడం భారత్ విధి. ఇరుదేశాల బంధం వేల సంవత్సరాలనాటిది. లంకవాసుల మనసు దోచుకోవడానికీ, భారత్ విశ్వసనీయమైన మిత్రదేశమని చెప్పడానికీ ఇది ఓ అవకాశం.