అతివేగానికి కళ్లెం

ABN , First Publish Date - 2022-04-27T05:37:31+05:30 IST

జిల్లాలోని జాతీయ రహదారులతో పాటు ప్రాంతీయ రహదారులపై వాహనాల అతివేగానికి కళ్లెం వేసేందుకు జిల్లా పోలీసుశాఖ గట్టి చర్యలు తీసుకుంటుంది.

అతివేగానికి కళ్లెం
స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేస్తున్న పోలీసులు

- హైవేలపై పలు చోట్ల స్పీడ్‌గన్‌ల ఏర్పాటు

- అతివేగంగా వెళ్తున్న వాహనాలకు జరిమానాలు

- జిల్లా పోలీసుశాఖకు 7 స్పీడ్‌గన్‌లను అందించిన దాతలు

- రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

-  80 కిలో మీటర్ల వేగం దాటితే జరిమానాలు

- అయినా మారని వాహనదారులు, పెరుగుతునే ఉన్న కేసులు


కామారెడ్డి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జాతీయ రహదారులతో పాటు ప్రాంతీయ రహదారులపై వాహనాల అతివేగానికి కళ్లెం వేసేందుకు జిల్లా పోలీసుశాఖ గట్టి చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పలుచోట్ల స్పీడ్‌ లేజర్‌గన్‌లతో పర్యవేక్షిస్తోంది. జిల్లాలో 44వ జాతీయ రహదారిపై, మండలాల్లోని రాష్ర్టీయ రహదారులపై ఈ స్పీడ్‌ గన్‌లతో వాహనాల వేగాన్ని పరిశీలిస్తున్నారు. మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి భారీగా జరిమానాలు విధించనున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. జిల్లాలో ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాల వల్ల సగటున ఇద్దరు చొప్పున మృతి చెందుతుండడం ఆందోళన కల్గిస్తోంది. ప్రమాదాలకు ప్రధానకారణం మితిమీరిన వేగం, నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నట్లు పోలీసుశాఖ గుర్తించింది. వాహనదారుల వేగాన్ని అదుపుచేస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసుశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని 44వ జాతీయ రహదారి, 161 జాతీయ రహదారిలతో పాటు మున్సిపాలిటీల్లో, మండల కేంద్రాలలో ఉండే ప్రాంతీయ రహదారుల్లోనూ వాహనాల అతివేగాన్ని నియంత్రించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వాహనాల వేగాన్ని గుర్తించే స్పీడ్‌గన్‌ యంత్రాలను రహదారులపై ఏర్పాటు చేయనున్నారు.

జిల్లాలో 7 స్పీడ్‌ గన్‌ల ఏర్పాటు

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి వాహనాల అతివేగానికి కళ్లెం వేసేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. దాతల సహకారంతో స్పీడ్‌గన్‌లను పోలీసుశాఖ సేకరించి జిల్లాలో ఆయా రహదారులపై ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన రహదారులపై 7 స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు పోలీసుశాఖకు స్పీడ్‌ లేజర్‌ గన్‌ యంత్రాలను డోనెట్‌ చేశారు. ఐఎంఏ, జీవదాన్‌, బాంబేక్లాత్‌ లాంటి సంస్థలతో పాటు మరికొందరు పోలీసుశాఖకు ఈ స్పీడ్‌ గన్‌ల యంత్రాలను అందించారు. వీటిని కామారెడ్డి, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌, సదాశివనగర్‌ తదితర ప్రధాన రహదారులపై ఏర్పాటుచేశారు. జాతీయ రహదారులపై 80 కిలో మీటర్లు, ప్రాంతీయ రహదారులపై 60 కిలో మీటర్లు, మున్సిపల్‌, మూల మలుపుల వద్ద 40 కిలో మీటర్ల వేగం మించొద్దు. మితిమీరిన వేగంతో దూసుకెళితే ఈ చలాన్‌ రూపంలో రూ.1035 జరిమానా వేయనున్నారు.

నిర్ణీత వేగం దాటితే జరిమానాలే..

నిత్యం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్రకు భారీగా వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. జాతీయ రహదారిపై వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్‌తో వెళ్లరాదు. ప్రమాదకర ప్రాంతాల్లో కొన్నిచోట్ల గంటకు 80 కిలో మీటర్లు, ఇంకొన్నిచోట్ల 60 కిలో మీటర్లు, మరికొన్ని చోట్ల 40 కిలో మీటర్ల పరిమితిని విధించి బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే గమ్యానికి త్వరగా చేరుకోవాలని చాలా మంది అతివేగంగా వాహనాలను నడుపుతున్నారు. ఇలా అతివేగంగా వెళ్తున్న వాహనాల వివరాలను స్పీడ్‌ గన్‌లు పట్టేస్తున్నాయి. ఏ వాహనం ఎంత వేగంగా వెళ్తున్నది రికార్డు చేసి సంబంధిత వాహన యజమానికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫొటోతో పాటు జరిమానా విధించిన డబ్బుల వివరాలను పంపుతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలకు రూ.1,035 జరిమానా వేస్తున్నారు.

పెరుగుతున్న కేసులు

జిల్లాలో ఇంతకు ముందు స్పీడ్‌గన్‌ యంత్రాలను 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసి మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలకు జరిమానా విధిస్తుండేవారు. సదాశివనగర్‌, భిక్కనూర్‌ పోలీసుస్టేషన్‌ల పరిధిలో పలుచోట్ల స్పీడ్‌గన్‌లతో వాహనాల వేగాన్ని పరిశీలిస్తున్నారు. గత 4 నెలల కాలం నుంచి అతివేగంతో వెళ్తున్న వాహనాలపై 8,721 కేసులు నమోదైనట్లు పోలీసుశాఖ రికార్డుల ద్వారా తెలుస్తోంది. రెండు నెలల కాలంలోనే సుమారు 3 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. అతివేగంగా వెళ్తున్న వాహనాలకు రూ.1,035 చొప్పున జరిమానా విధిస్తున్నారు. దీంతో గత నాలుగు నెలల నుంచి నమోదైన కేసుల ద్వారా రూ.90.20 లక్షల జరిమానా విధించారు. జరిమానా విధిస్తున్న వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతునే ఉంది. ప్రస్తుతం జిల్లాలో మరో నాలుగు స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేయడంతో మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలపై మరిన్ని జరిమానాల కేసులు అయ్యే అవకాశం ఉంది. ఈ స్పీడ్‌గన్‌ల ఏర్పాటుతోనైన వాహనాల వేగానికి కళ్లెం వేసి ప్రమాదాలను అరికడతారో చూడాలి.


వాహనాల అతివేగాన్ని గుర్తించేందుకు స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేస్తున్నాం

- శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ, కామారెడ్డి

జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు వాహనాల అతివేగమే కారణం. వాహనాల అతివేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాం. జాతీయ రహదారులతో పాటు జిల్లా ప్రధాన రహదారుల్లోనూ స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేసి మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నాం. పోలీసుశాఖ, దాతల సహకారంతో 7 స్పీడ్‌గన్‌లను జిల్లాలో ఆయా ప్రధాన రహదారులలో ఏర్పాటు చేశాం. వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి నిబంధనల మేరకు అతివేగానికి మించి వాహనాలను నడపరాదు.

Updated Date - 2022-04-27T05:37:31+05:30 IST