కలియుగమే కష్టకాలం

ABN , First Publish Date - 2020-09-14T07:25:47+05:30 IST

వేద వ్యాస భగవానుడు శ్రీమద్భాగవతంలో కలియుగ లక్షణాలను ఇలా విస్తృతంగా విపులీకరించాడు. కలియుగంలో ధనం వల్ల

కలియుగమే కష్టకాలం

విత్తమేవ కలౌనౄణాం జన్మాచార గుణోదయః

ధర్మన్యాయ వ్యవస్థాయాం కారణం బలమేవ హి


వేద వ్యాస భగవానుడు శ్రీమద్భాగవతంలో కలియుగ లక్షణాలను ఇలా విస్తృతంగా విపులీకరించాడు. కలియుగంలో ధనం వల్ల మాత్రమే గౌరవాదరాలు లభించడం, ధర్మన్యాయ వ్యవస్థలలో బలమే ప్రాధాన్యం వహించడం వంటి దుర్లక్షణాలన్నీ మానవులలో కనిపిస్తుంటాయని వివరించారు. కలియుగం ముందుకు సాగే కొద్దీ మానవుల సమస్త సద్గుణాలూ నశించిపోయి దుర్గుణాలే అధికం కావడం చూస్తాం. అంతేకాదు.. వేలాది సంవత్సరాలుగా ఆచరిస్తున్న సనాతన ధర్మాలను వదిలి పాషండ ధర్మం దిశగా సాగిపోయే వారి సంఖ్య పెరుగుతుంది.


రోజురోజుకూ మానవులలో ధర్మం, సత్యం, శౌచం, క్షమ, దయ, ఆయువు వంటి సలక్షణాలన్నీ క్షీణిస్తూ యావత్ప్రపంచం భయంకర ప్రమాదంలో చిక్కుకొని పోయే పరిస్థితులు వస్తాయి. స్వార్థగుణం పెరిగి, కపట వ్యవహారాలతో కాలం గడుపుతూ.. ఇతరులకు హాని కలిగించే మార్గాలను అన్వేషించే ప్రయత్నంలో పలువురు నిమగ్నమవుతుంటారు. డబ్బుకు ప్రాధాన్యత పెరిగి.. ధనహీనుడైన వాడు అసమర్థుడిగా పరిగణింపబడుతుంటాడు. పేదవారు అన్యాయాలకు బలైపోతుంటారు.


సంస్కార హీనులై... ధన మదంతోనే సర్వం సాధించుకోవచ్చన్న భావంతో అధికారాలను పొంది.. తోటి వారి పట్ల అన్యాయాలు చేయడానికి కూడా వెనకాడని వారు పెరిగిపోతారు.


‘‘శీతవాతాతపప్రావృత్‌ హిమై’’.. అంటే ప్రకృతి ప్రకోపం కారణంగా చలి, ఎండ, వర్షం, మంచు వంటివి ఎక్కువై లోకంలో ఉత్పాతాలకు కారణమవుతాయి. ధర్మం నశించి, పాలకులే దొంగ పనులకు పాల్పడటం చూసిన ప్రజలు కూడా అబద్ధాలను ఆశ్రయించి, హింసను ప్రోత్సహిస్తూ నీచంగా బతుకులు వెళ్లదీయడమే గాక అదే గొప్ప జీవన విధానంగా భావిస్తుంటారు.

ఇటువంటి కలియుగ లక్షణాలను, మానవులకు రాబోయే కష్ట కాలాలను పన్నెండవ స్కంధంలో వేదవ్యాసమహర్షి చెప్పినా.. తొలి స్కంధంలోనే, సూత మహర్షిని శౌనకాది మునులు కలియుగంలో మానవులను గురించి అడిగిన సందర్భం కనిపిస్తుంది. బమ్మెర పోతానామాత్యుడు తెలుగులో రచించిన భాగవతం ప్రథమ స్కంధంలో.. ‘‘అలసులు, మందబుద్ధి యుతులల్పతరాయువులు..’’ అంటూ కలియుగంలో అధిక శాతం మానవుల లక్షణాలు వివరించారు.




కలియుగంలో సోమరులై, మందబుద్ధి కలవారై, అల్పాయుష్కులై, భయంకర రోగాలలతో పీడింపబడే నిస్సహాయులు.. నిత్య భగవధ్యానం, మానసిక శుద్ధితో జీవిస్తూ స్వామిని సేవించాలనే సందేశాన్ని భాగవతం చెప్పింది. నిర్మలమైన మనసు, చిత్తశుద్ధి వంటి లక్షణాలే భగవంతుని దర్శనం కలిగించి, కలియుగ కష్టాలను అధిగమించగలిగే శక్తిని ప్రసాదిస్తాయి.

- గన్నమరాజు గిరిజామనోహరబాబు


Updated Date - 2020-09-14T07:25:47+05:30 IST