కాళీపట్నం ‘యజ్ఞం’, టోనీ మారిసన్‌ ‘బిలవ్డ్‌’ : ఒక పోలిక

ABN , First Publish Date - 2021-07-19T05:46:57+05:30 IST

కాళీపట్నం రామారావు గారు రాసిన ప్రఖ్యాత కథ ‘యజ్ఞం’ ఒక జుగుప్సాకరమైన, అమానవీయమైన క్రియతో ముగియటం కొందరు పాఠకులకు, ఇతర రచయితలకు అసహజంగా, అర్థరహితంగా తోచింది...

కాళీపట్నం ‘యజ్ఞం’, టోనీ మారిసన్‌ ‘బిలవ్డ్‌’ : ఒక పోలిక

కాళీపట్నం రామారావు గారు రాసిన ప్రఖ్యాత కథ ‘యజ్ఞం’ ఒక జుగుప్సాకరమైన, అమానవీయమైన క్రియతో ముగియటం కొందరు పాఠకులకు, ఇతర రచయితలకు అసహజంగా, అర్థరహితంగా తోచింది. ఒక కన్న తండ్రి, అతను ఎంతటి నిరక్షరాస్యుడయినప్పటికీ, ఎంతటి దీనమైన ఆర్థికస్థితిని కలిగి ఉన్నప్పటికీ, క్షణికావేశంలో అభం శుభం తెలియని, ముక్కుపచ్చలారని కుమారుని కంఠం తెగనరికి, తన ఆవేశాన్ని చల్లార్చు కుంటాడా? సమాజంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉందా? రచయిత కథ ద్వారా వ్యక్తి సమస్యలకు, కుటుంబ సమస్యలకు, సామాజిక సమస్యలకు ఏ పరిష్కారం చూపకుండా, ఏ ఆదర్శాన్నీ చాటకుండా, ఏ ప్రబోధాన్నీ చేయకుండా, ఆ కథ లోని ఒక పాత్ర (సీతారాముడి) చేత ఒక అనుచితమైన, అసహజమైన, హింసాయుతమైన కార్యాన్ని చేయించి కథకు ముగింపు పలకడం రచయిత అపరిపక్వతను, రచన అసంబద్ధతను మాత్రమే తెలియజేస్తుందని కొందరు భావించి ఉండవచ్చు. 


ప్రపంచంలో ప్రతి మనిషి తనవైన వేలిముద్రలను కలిగి ఉన్నట్లే, తనదైన ప్రత్యేక మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. ఒక మనిషి మనస్తత్వాన్ని మరొక మనిషి మనస్తత్వంతో పోల్చిచూసినప్పుడు, ఏ ఇద్దరి మనస్తత్వాల లోనూ నూరు శాతం సారూప్యత కనిపించదు. ‘Every human being is psychologically unique’ అనే సత్యాన్ని గ్రహించినప్పుడు మనిషి ఏ చేష్టనూ అసంగత మైనదిగా, అసహజమైనదిగా చెప్పలేం. ఆ చర్య ఆ ప్రత్యేకమైన మనిషికి సహజమే అవుతుంది! పేదరిక జనితమైన వేదనాభరిత జీవితం ఒక మనిషి మనసుపై ఏ రకమైన భ్రాంతిని కలిగించి, అతనిని లేదా ఆమెను ఏ చర్యలకు పురికొల్పుతుందో ఎవరమూ ఊహించలేం. ‘యజ్ఞం’లో అదే జరిగింది.


తన గ్రామం సుందరపాలెంలో తనకు లభిస్తున్న బతుకుదెరువుకన్నా పట్టణానికి వెళితే పరిస్థితి మెరుగ్గా ఉంటుందని భావించిన సీత రాముడికి, పట్నం వెళ్ళిన తర్వాత జీవితంలో పెద్ద దెబ్బ తగిలింది. సీతారాముడి భార్య పరపురుషుడితో వెళ్ళిపోయింది; తన చిన్న పిల్ల వాడిని తండ్రితోనే వదిలేసి వెళ్ళింది. సీతారాముడు ఆ పిల్లవాడిని తీసుకొని తన గ్రామం సుందరపాలెంకు చేరుకుని బతుకసాగాడు. తల్లి విడిచిన కొడుకుకు తానే తల్లీతండ్రియైు పెంచుకున్నాడు. తన కొడుకుకు తన వంటి దీనమైన స్థితిని కాకుండా మంచి భవిష్యత్తును అందించాలని ఆశించాడు. ‘‘నా కొడుకు మీద నాకాశెక్కువ. నా కొడుకు బానిస బతుకు బతకడు. నా కొడుకు కంబారి కాడు.’’ అని సీతారాముడు ఒక సందర్భంలో అంటాడు. ‘నా కొడుకు మీద నాకాశెక్కువ’ అనే మాట లను సీతారాముడికి అతని కొడుకు మీద అంతులేని ప్రేమ ఉన్నదనే అర్థంలో పాఠకులు గ్రహించాలి. సీతారాముడు తన కొడుకుకు తన కంటే ఉన్నత స్థితిని కోరుకున్నాడని, తన కొడుకు జీవిత మంతా బానిసగా బ్రతకడం ఊహించ డానికి కూడా శక్యం కాకపోవడం వల్లనే, ఆ బిడ్డడికి బానిస బతుకు కన్నా చావే సరైనదని తీర్మానించుకుని తన చేతులతోనే కొడుకుని రెండు ముక్కలుగా నరికి, భవిష్యత్‌ బానిస బతుకు నుండి వాడిని విముక్తుడిని చేసి తన మనసుకు సాంత్వన కలిగించుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి. తమ బిడ్డలపై గాఢమైన ప్రేమను కలవారై శారీరకంగా, మానసికంగా భరింపశక్యంగాని జీవనస్థితిని అనుభవించిన వారికి మాత్రమే కా.రా. ‘యజ్ఞం’ కథలో సీతారాముడి చర్యలోని ఔచిత్యం అర్థమవుతుంది.


‘యజ్ఞం’ కథలో ఒక తండ్రి తన చిన్న వయసు కుమారుడిని నిర్థాక్షిణ్యంగా హత్య చేసిన విధంగానే ‘Beloved'’ అనే ఆంగ్ల నవలలో కథానాయకి Sethe (సెథ) రెండు సంవత్సరాల వయసున్న తన కూతురుని చేతి రంపంతో కంఠం తెగ కోసి చంపేస్తుంది. సెథ నల్లజాతికి చెందిన ఒక ఆఫ్రికన్‌ బానిస. ఆమెకు నలుగురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బా యిలు. మొదటి కూతుర్ని ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. ఆమె కూతుర్ని అలా చంపడానికి ప్రధాన కారణం: కూతురు భవిష్యత్తులో తన వలెనే బానిస బతుకు బతకవలసి వస్తుందని, తాను అనుభవించిన అమానుషమైన దుష్కృత్యాలను తన కూతురు కూడా అనుభవించవలసి ఉంటుందని, దాన్ని నివారించాలంటే ఆ బిడ్డ ప్రాణాలు తీయడం ఒక్కటే పరిష్కారమని భావించి తన చేతులతోనే బిడ్డ ప్రాణాలు తీస్తుంది. తన మిగిలిన సంతానాన్ని కూడా అలాగే చంపి వారికి బానిసత్వాన్ని నివారించాలని భావిస్తుంది. ఆమె ఇద్దరు కుమారులు తప్పించుకొని పారిపోతారు. చిన్న కుమార్తె డెన్వర్‌ (పసికందు)ని చంపడానికి ప్రయత్నిస్తుండగా స్టాంప్‌ పైడ్‌ అనే విముక్తిపొందిన ఒక బానిస అడ్డుపడి ఆ పాపను రక్షిస్తాడు. సెథ క్రూరత్వం వెనుక ఉద్దేశం తన బిడ్డలను బానిసత్వపు బాధల నుంచి రక్షించడమే! ‘యజ్ఞం’ కథలో సీతారాముడు, తన కుమారుడు జీవితమంతా బానిసగా బ్రతికే అగత్య పరిస్థితిని తప్పించడం కోసమే అతన్ని ఆ విధంగా హత్య చేసినట్లుగా పేర్కొంటాడు. ‘యజ్ఞం’ కథలో సీతారాముడు, ‘బిలవ్డ్‌’ నవలలో సెథ వారి కన్నబిడ్డలను నిర్దయగా చంపడం వెనుక ఉద్దేశం వారి పిల్లలు వారి వలె బానిస బతుకులు బతకకూడదన్నదే. 


ప్రత్యేకించి సెథ తన పిల్లల పట్ల తనకు ‘thick love’ ఉన్నదని తెలియజేస్తుంది. అంటే గాఢమైన ప్రేమ. ఏ తల్లికైనా లేదా తండ్రికైనా తన బిడ్డల పైన సహజంగా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ గాఢత విషయం లోనే ఒక తండ్రికి మరొక తండ్రికి మధ్య, ఒక తల్లికి మరొక తల్లికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. సీతారాముడూ, సెథ- ఇరువురూ తమ కన్న బిడ్డలపట్ల అత్యంత గాఢమైన ప్రేమను కలిగి ఉన్నారని వారి బిడ్డల విషయంలో వారు తీసుకున్న నిర్ణయాలు మనకు తెలియజేస్తాయి. 


‘యజ్ఞం’ కథను రాసిన కాళీపట్నం రామారావు, ‘బిలవ్డ్‌’ నవలను రాసిన టోనీ మారిసన్‌ సమకాలీనులే అని చెప్పడానికి అవకాశం ఉన్నప్పటికీ, ఇద్దరూ వేర్వేరు దేశాలకు, భిన్నమైన భాషలకు, విభిన్న సంస్కృతులకు చెందినవారు. ‘యజ్ఞం’ కథ, ‘బిలవ్డ్‌’ నవల ప్రచురణల మధ్య రెండు దశాబ్దాలకు పైగా అంతరమున్నది. ‘బిలడ్డ్‌’ ఆంగ్ల నవల 1987లో ప్రచురించబడింది. రచయిత్రి టోనీ మారిసన్‌ ఈ నవలకు గాను పులిట్జర్‌ బహుమతి (1988)ని అందుకున్నారు. ఆమె సాహి త్యంలో నోబెల్‌ బహుమతి (1993) గ్రహీత కూడా. ఆమె ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ నవలను వ్రాశారు. 


1856లో మార్గరెట్‌ గార్నర్‌ అనే ఒక నల్లజాతి బానిస యువతి తన పిల్లలకు బానిస బతుకు ఉండకూ డదని మేరీ అనే తన రెండు సంవత్సరాల కూతుర్ని జంతువులను వధించే కత్తితో కంఠం తెగనరికి చంపుతుంది. మిగతా ముగ్గురు పిల్లలను కూడా చంపాలనే ప్రయత్నంలో వారిని గాయపరు స్తుంది. తన పిల్లలను చంపిన తర్వాత తాను తన ప్రాణం తీసు కోవాలని నిర్ణయించుకుంటుంది. మార్గరెట్‌ తాను తన కన్నబిడ్డను చంపడానికి, మిగిలిన ముగ్గురు బిడ్డలను చంపే ప్రయత్నం చేయడానికి ఏకైక కారణం తనలాగా వారు బానిస జీవితాన్ని గడపకూడదనే అని 1858వ సంవత్సరంలో న్యాయస్థానంలో స్పష్టంగా సాక్ష్యమిచ్చింది.  


‘యజ్ఞం’ కథలో సీతారాముడు కూడా తను బతుకు తున్న బతుకు బానిసత్వమేనని భావించాడు. తన, అలాగే తన అన్నల బానిసత్వపు బతుకు తన తండ్రి అప్పల్రాముడికి నచ్చుతుందేమో కానీ తన కుమారుడు తనలాగా బతకడం తనకు ఎంత మాత్రమూ ఇష్టం కాదని విస్పష్టంగా ప్రకటించాడు. తీవ్ర వేదనలో ఉన్న మనుషులు మానసికంగా కృంగిపోయి ఉంటారు. వారిలో కొందరు persecutory delusions (హింసావృతమైన మానసిక భ్రాంతులు) పొందుతుంటారు. ఆ చిత్త భ్రాంతిలో వారేంచేస్తారో వారికే తెలియని విషమ భావోద్రేక స్థితి ఉత్పన్నమవుతుంది. అది కొన్నిసార్లు వారిని జుగుప్సా కరమైన పనులకు పురిగొల్పుతుంది. మనస్తత్వ శాస్త్ర ప్రకారం ఇది ఒక వాస్తవం. సీతారాముడు, సెథ, నిజ జీవితంలో మార్గరెట్‌ గార్నర్‌ అలాంటి మానసిక బ్రాంతులకు లోనై అలాంటి జుగుప్సాకరమైన చర్యలకు పూనుకున్నారని, ఆ ప్రత్యేక మానసిక స్థితిని పొందిన వారు అలాంటి పనులు చేయడంఅసహజమేమీ కాదని మనం భావించవలసి వస్తుంది.

డి. రాములు

94943 52164

Updated Date - 2021-07-19T05:46:57+05:30 IST