పోలీసుల అదుపులో 39 మంది మహారాష్ట్ర వాసులు

ABN , First Publish Date - 2020-03-30T11:17:05+05:30 IST

కలికిరి పోలీసులు మహారాష్ట్రకు చెందిన 39 మందిని అదుపులోకి తీసుకుని స్థానిక ఇందిరమ్మ కాలనీ ఉన్నత పాఠశాలకు తరలించి బస కల్పించారు.

పోలీసుల అదుపులో 39 మంది మహారాష్ట్ర వాసులు

ఉన్నత పాఠశాలలో ఆశ్రయం 


 కలికిరి, మార్చి 29:  కలికిరి పోలీసులు మహారాష్ట్రకు చెందిన 39 మందిని అదుపులోకి తీసుకుని స్థానిక ఇందిరమ్మ కాలనీ ఉన్నత పాఠశాలకు తరలించి బస కల్పించారు. దాదాపు ఆరు గంటల పాటు జిల్లా స్థాయి అధికారులు, పోలీసులు, వైద్య శాఖ అధికార వర్గాల చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో రాత్రి ఏడున్నర గంటలకు ఉన్నత పాఠశాలలో ఆశ్రయం కలిగించాలని నిర్ణయించారు. ఈ 39 మందిని జేఎన్టీయూ క్వారంటైన్‌కు తరలించాలా లేక వదిలిపెట్టేయాలా అన్న విషయం మీద పైస్థాయిలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చర్చలు జరిగేంతసేపూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి ఏడున్నర వరకూ వారిని రోడ్డు పైనే వుంచారు. కలికిరి పోలీసులు వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.


చివరికి ఏ నిర్ణయం వెలువడకపోవడంతో వారిని క్వారంటైన్‌కు తరలించకుండా సమీపంలోని ఇందిరమ్మ ఉన్నత పాఠశాలకు తరలించారు. వారు రవాణాకు ఉపయోగించిన ట్రక్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలోని ఒక ప్రముఖ కొరియర్‌ సంస్థలో పని చేస్తున్న ఈ 39 మంది నాందేడ్‌కు అదే కంపెనీకి చెందిన మూడు ట్రక్కుల్లో బయలుదేరారు. చెన్నై లక్ష్మీపురంలో వున్న తమను తమిళనాడు పోలీసులే సొంతవూరికి వెళ్ళిపొమ్మన్నారని చెబుతున్నారు. పుత్తూరు, తిరుపతి మీదుగా పీలేరు వరకూ వచ్చి అక్కడి నుంచి కడప మార్గం పట్టారు. అయితే మధ్యలో మహల్‌ క్రాస్‌ నుంచి దారి తెలియక కలికిరి వైపు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఎస్‌ఐ రామాంజనేయులు ఇందిరమ్మ కాలనీ వద్ద మూడు ట్రక్కులను అడ్డుకుని ఆ 39 మందిని అదుపులోకి తీసుకున్నారు. క్వారంటైన్‌కు తరలించేందుకుగానీ, వారిని వదిలి పెట్టేందుకు గానీ ఉన్నత స్థాయి నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో తాత్కాలికంగా ఇందిరమ్మ హైస్కూల్‌లో వారికి వసతి కల్పించారు. ఎస్‌ఐ రామాంజనేయులు, మదనపల్లె డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. లోకవర్ధన్‌, వైద్యాధికారి డా.చిన్నరెడ్డెప్ప, తహసీల్దారు చంద్రమ్మ, ఎంపీడీవో వెంకటేశులు, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, రమేష్‌ తదితరులు ఇక్కడి పరిస్థితిని పరిశీలించారు.

Updated Date - 2020-03-30T11:17:05+05:30 IST