బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కుంభకోణంలో నివ్వెరపరుస్తున్న వాస్తవాలు

ABN , First Publish Date - 2021-09-01T16:16:04+05:30 IST

కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కుంభకోణంలో నివ్వెరపరుస్తున్న వాస్తవాలు
బాధితురాలు జి.ప్రభావతి, జయకృష్ణ, బ్యాంకులో ఉద్యోగులను విచారిస్తున్న సీఐ, ఎస్‌ఐ

రూ.కోటి దాటేసిన డ్వాక్రా రుణాల స్వాహా


కలికిరి(చిత్తూరు): కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో జరిగిన కుంభకోణంలో వెల్లడవుతున్న వాస్తవాలు చూసి బ్యాంకు లావాదేవీల్లో తలపండిన వారు సైతం నోరెళ్ళబెడుతున్నారు. డ్వాక్రా గ్రూపుల పేరుతో జరిగిన భారీ అక్రమ లావాదేవీల నిగ్గు తేల్చడానికి మూడు రోజులుగా జరుగుతున్న కసరత్తు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. డీఆర్‌డీఏకు చెందిన పదిమంది ఉద్యోగులు, ఇద్దరు ఆడిట్‌ అధికారులు కలసి ఏరియా కోఆర్డినేటర్‌ రూతూ, ఏపీఎం సుబ్రమణ్యం ఆధ్వర్యంలో చేస్తున్న తనిఖీల్లో నివ్వెరపర్చే లెక్కలు వెల్లడవుతున్నాయి. మూడు రోజులపాటు మొత్తం 53 గ్రూపుల లెక్కలను పరిశీలించగా 25 గ్రూపుల్లో భారీ అక్రమాలు వెల్లడయ్యాయి. బుధవారం నాటికి ఈ 25 గ్రూపుల్లో మొత్తం రూ.1,09,32,188 మెసెంజరు ఆలీఖాన్‌కు చెందిన ఖాతాల మీదుగా పక్కదారి పట్టాయని నిర్ధారణ అయ్యింది. ఇందులో వెలుగు అధికారుల నిమిత్తం లేకుండానే ఆరేడు గ్రూపులకు రూ.పదేసి లక్షల వంతున లింకేజీ రుణాలు మంజూరయ్యాయి. ఇవన్నీ వేర్వేరు ఖాతాలకు బదిలీ అయ్యాయి. 224 గ్రూపుల్లో ఇంకా  171 గ్రూపుల లెక్కలను పరిశీలించాల్సి వుంది. చివరికి ఇది ఎన్ని కోట్లకు చేరుతుందో అంతుబట్టడం లేదంటున్నారు.


ఆలీఖాన్‌, ఇతర ఉద్యోగులపై క్రిమినల్‌ కేసు  

అక్రమాల్లో చేయి తిరిగిన మెసెంజరు ఆలీఖాన్‌, అతనితో కుమ్మక్కయిన బ్యాంకు ఉద్యోగులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ నాగార్జున రెడ్డి, ఎస్‌ఐ లోకేష్‌ రెడ్డి తెలిపారు.మేడికుర్తికి చెందిన సంఘమిత్ర ప్రసన్నలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 420, 406, 409 సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


మరో డిపాజిట్టు, బంగారు రుణాల చెల్లింపు గల్లంతు

కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన జి.ప్రభావతి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో డిపాజిట్టు చేసిన మొత్తం గల్లంతయ్యింది. ఆరేళ్ళ క్రితం 2015 మే 8న ఆమె రెండేళ్ళ టర్మ్‌తో రూ.2 లక్షల 80 వేలు డిపాజిట్‌ చేసింది. 2017కు వడ్డీతో కలుపుకుని తిరిగి రూ.3,49,271 మెచ్యూరిటీ వాల్యూతో మరో ఏడాది రెన్యువల్‌ చేశారు. ఆ తరువాత రెన్యువల్‌ కాలేదు. కానీ ఇప్పటికి అది దాదాపు రూ.5 లక్షలు మెచ్యూరిటీ కావలసి వుంది. ప్రస్తుతం బీవోబీలో వెల్లడయిన కుంభకోణంతో అనుమానమొచ్చిన ఆమె మంగళవారం బ్యాంకుకు వెళ్ళి విచారించగా డిపాజిట్టుకు సంబంధించిన మొత్తమేదీ నిల్వ లేదని తేల్చేశారు.ఇది ఎప్పుడు జరిగింది, ఎవరి ఖాతాలోకి వెళ్ళిందన్న విషయమూ బ్యాంకు అధికారులు చెప్పడం లేదని ఆమె వాపోయింది.2021 మార్చి 17న 108 గ్రాముల బంగారం తాకట్టు పెట్టి రూ.2,70,000, అదే రోజు మరో 73 గ్రాములతో రూ.2 లక్షలు రుణంగా తీసుకుంది. ఈ రుణానికి ఏప్రిల్‌ 16న రూ.2,01,217 జమ చేసింది. మొదటి రుణానికి మే 20న రూ.50 వేలు చెల్లించింది. రెండు రుణాలు పూర్తిగా చెల్లించి బంగారం ఒకేసారి తీసుకెళ్ళమని చెప్పడంతో ప్రభావతి సరేనంది. చెల్లింపులకు సంబంధించి బ్యాంకులో ఇచ్చిన రసీదు నకిలీదిగా వుంది. అసలు రసీదులో బ్యాంకు పేరు తెలుగు, ఇంగ్లీషుతోపాటు హిందీలో కూడా వుంటుంది.


కానీ నకిలీ రసీదులో పూర్తిగా ఇంగ్లీషులోనే వుంది. నగదు డిపాజిట్టు చేసిన బాండు, నగలు తాకట్టు పెట్టినట్టు బ్యాంకు జారీ చేసిన బంగారానికి చెందిన ఇన్‌వాయిస్‌లు కూడా ప్రభావతి వద్దే వున్నాయి. మంగళవారం ఈ రుణాల చెల్లింపుల గురించి కూడా వాకబు చేయగా ప్రభావతి చెల్లించిన రూ.2,51,217లలో ఒక్క రూపాయి కూడా జమ కానట్లు వెల్లడయ్యింది. నకిలీ రసీదులిచ్చి మోసానికి పాల్పడ్డట్లు స్పష్టమవుతోంది. మొత్తం మీద డిపాజట్టు, బంగారు తాకట్టు రుణాల చెల్లింపులతో మొత్తం ప్రభావతికి చెందిన రూ. ఏడున్నర లక్షలు గల్లంతయ్యాయి.పాతికేళ్ళుగా తాను ఈ బ్యాంకులోనే కూడబెట్టుకున్నానని, నమ్మించి మోసగించారని ప్రభావతి బోరున విలపిస్తోంది. కాగా మంగళవారం బ్యాంకుకు చేరుకున్న బాధితుల సంఖ్య కూడా పెరిగిపోయింది. కేవలం వారి వద్ద నుంచి ఫిర్యాదులు రాయించుకుంటూ తిప్పి పంపేశారు. 


నలుగురు బ్యాంకు అధికారుల సస్పెన్షన్‌

కలికిరి బాంక్‌ ఆఫ్‌ బరోడాలో జరిగిన కుంభకోణంలో పాత్రధారులుగా గుర్తించిన నలుగురు ఆఫీసర్‌ కేడర్‌ ఉద్యోగులను సస్పెండ్‌ చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం రీజనల్‌ కార్యాలయానికి చెందిన ఐదుగురు బ్యాంకు అధికారులు పొద్దుపోయేంత వరకూ తనిఖీలు జరిపారు. వివిధ రకాల ఖాతాల్లో లావాదేవీలను పరిశీలించి వెళ్ళారు. తిరిగి మంగళవారం జోనల్‌ కార్యాలయానికి చెందిన నలుగురు ఉన్నతాధికారులు వీటిలో కొన్నింటిని పరిశీలించి ప్రాథమికంగా నలుగురిని సస్పెండ్‌ చేసేందుకు సిఫారసు చేసిన దరిమిలా బ్యాంక్‌ ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బ్యాంకులో జాయింట్‌ మేనేజరుగా కొనసాగుతున్న రామచంద్రుడు, జనరల్‌ అసిస్టెంట్‌ మేనేజరు జయకృష్ణ, బంగారు రుణాల ఇన్‌చార్జి ఉద్యోగిని ఈలూ, ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఈశ్వ రన్‌లను ప్రస్తుతానికి సస్పెన్షన్‌లో వుంచాలని నిర్ణయించారు. మెసెంజరు ఆలీఖాన్‌ జరిపిన అక్రమ లావాదేవీల్లో వీరి లాగిన్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లు యథేచ్ఛగా ఉపయోగించినట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


కుంభకోణం బయట పడిన వెంటనే వీరిలో జయకృష్ణను శ్రీకాళహస్తికి, ఈశ్వరన్‌ను గుంతకల్లుకు బదిలీ చేశారు. వీరితోపాటు మేనేజరు వెంకట్‌ను కర్ణాటకకు బదిలీ చేశారు. ఇక రామచంద్రుడు, ఈలు ప్రస్తుతానికి ఇక్కడే పనిచేస్తున్నారు. దాదాపు ఆరేళ్ళ నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో కుంభకోణం జరుగుతున్నట్లు వెల్లడవుతోంది.మెసెంజరు ఆలీఖాన్‌ తో కుమ్మక్కైన బ్యాంకు ఉద్యోగులు రూ.కోట్లు కొల్లగొట్టినట్లు బ్యాంకు ఉన్నతాధికారులే అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. వీరు గాక ముగ్గురు మేనేజర్లతో పాటు ఆరుగురు ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమా నిస్తున్నారు. డిపాజిట్లు, రుణాల చెల్లింపులు, రుణాల మంజూరు, డ్వాక్రా గ్రూపుల నిధుల తారుమారు, బంగారు తాకట్టు రుణాలు ఇలా దొరికినన్ని మార్గాల్లో అక్రమాలకు పాల్పడడంతో అసలు ఎన్ని కోట్ల రూపాయలు స్వాహా జరిగిందో కూడా అంచనాకు రాలేకపోతున్నట్లు చెబుతున్నారు.  


Updated Date - 2021-09-01T16:16:04+05:30 IST