అంతా కుమ్మక్కు.. లెక్కల్లో గిమ్మిక్కు!

ABN , First Publish Date - 2021-09-06T17:10:05+05:30 IST

కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాతాల్లో..

అంతా కుమ్మక్కు.. లెక్కల్లో గిమ్మిక్కు!

దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు

విచారణకు హాజరు కావాలంటూ ఆరుగురు అధికారులకు నోటీసులు


కలికిరి: కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాతాల్లో నగదు గల్లంతు వ్యవహారం సోమవారం నుంచి కొత్త మలుపు తిరగనుందని భావిస్తున్నారు. పోలీసులు సైతం శనివారం రాత్రి నుంచి దర్యాప్తు వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది. కలికిరి ఎస్‌ఐ లోకే్‌షరెడ్డి సహకారిగా వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆదివారం మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి కలికిరి పోలీసు స్టేషన్లో కేసు పురోగతిపై సమీక్షించారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలంటూ ఆరుగురు బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేశారు. సస్పెండైన వారికే కాకుండా డ్యూటీలో కొనసాగుతున్న మరో ఇద్దరు ఉద్యోగులకూ ఈ నోటీసులు జారీ అయినట్లు తెలిసింది. సస్పెన్షన్‌లో ఉన్నవారిలో బంగారు నగల తాకట్టు వ్యవహారాలు చూసే వీలును మినహాయించారని సమాచారం. ఈ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న తాత్కాలిక మెసెంజరు ఆలీఖాన్‌, ఆయన భార్య చాందినిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తిరుపతి రీజినల్‌ మేనేజరు శేషగిరినీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపారు.


సస్పెన్షన్‌లో ఉన్న అసిస్టెంటు మేనేజరు జయకృష్ణ, సీనియర్‌ అధికారి రామచంద్రుడుతోపాటు ప్రస్తుతం డ్యూటీలో వున్న క్యాషియర్‌ మౌలాలి, క్లర్క్‌ తేజసాయిలకు నోటీసులు పంపినట్లు తెలిసింది. శనివారం ఆరు గంటలపాటు పోలీసు స్టేషన్‌లోనూ, బ్యాంక్‌లోనూ వెలుగు అధికారుల సమక్షంలో ఆలీఖాన్‌ను విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణ అనంతరం ఆలీఖాన్‌ గల్లంతు చేసిన నగదు, డ్వాక్రా గ్రూపులు సృష్టించడం తదితర తారుమారు వ్యవహారాల్లో ఆలీఖాన్‌ చెప్పిన వివరాలు, బ్యాంకు రికార్డులతో సరిపోలడంతో అసిస్టెంట్‌ మేనేజరు జయకృష్ణ ఈ కేసులో కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడైంది. ప్రస్తుత క్యాషియర్‌ మౌలాలి, క్లర్క్‌ తేజసాయి పేర్లను కూడా ఆలీఖాన్‌ ప్రస్తావించడంతో వీరిపైనా దర్యాప్తు అధికారులకు అనుమానాలున్నట్లు తెలుస్తోంది. వీరందరిని విచారించాక మరికొందరు అధికారుల ప్రమేయం గురించి నిర్ధారణకు రానున్నట్లు చెబుతున్నారు. దాదాపు ఆరేళ్లుగా అంతా కలసికట్టుగా కుమ్మక్కయ్యారన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇక లెక్కల్లో వీరు చేసిన గిమ్మిక్కులన్నీ దర్యాప్తు అధికారులు తేల్చాల్సి ఉంది. 


ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారుల్లోనూ ఆందోళన 

ఎన్నారై (విదేశాల్లో ఉంటున్న స్థానికులు) ఖాతాలు అధికంగా ఈ బ్యాంకులోనే ఉన్నాయి. చాలా మంది గల్ఫ్‌ దేశాల్లో పనులు చేస్తూ కూడబెట్టిన డబ్బును ఈ బ్యాంక్‌కు పంపడం ఆనవాయితీ. ఈ ఖాతాదారుల్లో ఎక్కువ మంది మెసెంజరు ఆలీఖాన్‌కు బంధువులో లేదా సన్నిహితులో కావడంతో వారి లావాదేవీలన్నీ అతడికి కొట్టినపిండేనని చెబుతున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు తెలియని వీరంతా తరచూ తమ కుటుంబ సభ్యులను బ్యాంకుకు పంపించి ఖాతా నిల్వలను పరిశీలించుకుని ఆలీఖాన్‌ చెప్పిందే నమ్మే వారని అంటున్నారు. ప్రస్తుతం బ్యాంక్‌లో జరిగిన పరిణామాలతో విదేశాల్లో వున్న వారు ఖాతాల పరిశీలనకు వెళితే బ్యాంకు అధికారులు అనుమతించడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా ఖాతాదారులు వచ్చి నిల్వ వివరాలు అడిగితేనే చెబుతామని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తుండటం వీరిలో మరిన్ని అనుమానాలు, ఆందోళనలు తలెత్తడానికి కారణమవుతున్నాయి. తాజాగా ఒక ఎన్‌ఆర్‌ఐ ఖాతా నుంచి రూ.50 వేలు గల్లంతయ్యాయని, అయితే ఆలీఖాన్‌ తమకు సన్నిహితుడైనందున ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. 


పెద్ద నోట్ల రద్దు నుంచే వ్యవహారం మొదలైందా? 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అక్రమాలకు నోట్ల రద్దు సమయంలోనే బీజం పడిందనే కొత్త కోణం ఒకటి తాజాగా తెర మీదకు వస్తోంది. ఉన్నపళంగా పెద్ద నోట్లు రద్దు కావడంతో పలువురు ప్రధాన ఖాతాదారులు నోట్ల మార్పిడికి ఆలీఖాన్‌ సహకారం తీసుకున్నారనేది చర్చనీయాంశంగా ఉంది. 2016కు ముందే దాదాపు తొమ్మిదేళ్ళుగా బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఆలీఖాన్‌ అప్పటికే తనకున్న విస్తృత పరిచయాలను నోట్ల మార్పిడికి బ్యాంకును కీలకంగా మార్చాడనే అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఈ మార్పిడి కారణంగానే భారీగా లబ్ధి పొందిన ఉద్యోగులకు ఆలీఖాన్‌ పూర్తి విశ్వాసపాత్రుడయ్యాడని వివరిస్తున్నారు. ఈ వ్యవహారం గురించి ఆలీఖాన్‌ ఇప్పటి వరకూ గుంభనంగానే నెట్టుకొస్తున్నాడని కూడా చెబుతున్నారు. 


తాకట్టు బంగారం విడిపించుకోవడానికి తిప్పలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో నగలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారు బంగారు విడిపించుకోవడానికి తిప్పలు పడుతున్నారు. 80 ఏళ్ల ఆశాబీ, ముప్పై ఏళ్ళుగా ఇదే బ్యాంకులో లావాదేవీలు జరుపుతున్న ప్రభావతి బంగారు రుణాల కోసం లక్షల కొద్దీ చెల్లించిన డబ్బు జమ కాలేదని వెల్లడవడం మిగతా వారిలో గగ్గోలు పుట్టించింది. దీంతో దొరికినకాడికి అప్పులు చేసి బంగారు విడిపించుకోవాలన్న ఆందోళనతో పరుగులు తీస్తున్నారు. విడిపించుకున్న నగలను మరో బ్యాంకు లో తాకట్టుపెట్టి చేసిన అప్పును చెల్లించే దిశగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.


మేనేజరు సహా ఇద్దరి సస్పెన్షన్‌.. పోలీసుల అదుపులో అసిస్టెంట్‌ మేనేజరు జయకృష్ణ

మొన్నటి వరకూ కలికిరి బ్యాంకులో మేనేజరుగా పని చేస్తూ ఈ కేసు బయట పడిన నేపథ్యంలో కర్ణాటకకు బదిలీపై వెళ్లిన వెంకట్‌ను సస్పెండు చేసినట్లు తెలిసింది. బాధ్యతల నిర్వహణలో.. జరుగుతున్న వ్యవహారాలను పసిగట్టడంలో విఫలమయ్యారని చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక, ఆలీఖాన్‌తో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై గతంలో ఆఫీసర్‌గా పనిచేసిన అబీదాను సస్పెండు చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో పాత్రధారుడు ఆలీఖాన్‌ కాగా సూత్రధారిగా అసిస్టెంట్‌ మేనేజరు జయకృష్ణను పేర్కొంటున్నారు. విచారణకు హాజరు కావాలని జయకృష్ణకు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆదివారం ఆలస్యంగా ఆయన్ను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2021-09-06T17:10:05+05:30 IST