ఇలాంటి మోసం ఇంతకుముందే జరిగింది.. అయినా మళ్లీ అదే సీన్ రిపీట్!

ABN , First Publish Date - 2021-09-02T16:39:09+05:30 IST

ఏ ఖాతాదారుడైనా..

ఇలాంటి మోసం ఇంతకుముందే జరిగింది.. అయినా మళ్లీ అదే సీన్ రిపీట్!

నకిలీ రశీదుల బాగోతం

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మూడు రకాల సీళ్ళతో నగదు రశీదులు

ఇదే రకం మోసం ఏడేళ్ళ క్రితమే గుర్తింపు

అయినా ఉదాసీనంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు


కలికిరి(చిత్తూరు): ఏ ఖాతాదారుడైనా బ్యాంకులో నగదు చెల్లిస్తే జమ చేసుకుని రశీదు ఇవ్వడం ఆనవాయితీ. మహా అయితే అందులో వ్రాసిన నగదు సరిగ్గా వుందో లేదో మాత్రం ఒకసారి సరిచూసుకోవడం పరిపాటి. ఎంత చదువుకున్న వారైనా రశీదు పైన వేసిన బ్యాంకు సీలు సరైనదా లేక నకిలీదా అని శల్య పరీక్ష చేసే వారుండరు. సరిగ్గా ఈ బలహీనతనే ఆధారం చేసుకుని ఖాతాదారులను వరుసబట్టి బురిడీ కొట్టించారు కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో జరిగిన రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ సూత్రధారులు. ఏ బ్యాంకులోనైనా నగదు చెల్లించిన వారికి కౌంటర్‌లోనే రశీదు అందజేస్తారు.


ఈ బ్యాంకుకు సంబంధించి రశీదుపై వేసే రబ్బరు సీలు పై భాగంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పేరు హిందీలో వుంటుంది. తరువాత ఇంగ్లీషులోనూ, కింది భాగంలో తెలుగులోనూ వుంటుంది. ఇక నకిలీ రశీదుల్లో కేవలం ఇంగ్లీషులో మాత్రమే బ్యాంకు పేరు వుండేలా నకిలీ సీళ్ళు తయారు చేయించారు. ఇక చివర క్యాష్‌ రిసీవ్‌డ్‌ అని వుండాలి. ఒక రకం దానికి అదే విధంగా వుండగా మరో రకం రశీదులో ట్రాన్స్‌ఫర్‌ అని వుంది. ఇంకో రకం సీలులో వృత్తాకారంలో బీవోబీ సర్వీసు పాయింట్‌ అని వుంది. మొత్తానికి బంగారు తాకట్టు రుణాలు, పంట రుణాలు, సేవింగ్‌ ఖాతాలకు జమ చేసే వారందరికీ ఈ నకిలీ రశీదులను అంటగట్టి ఖాతాదారులు కట్టిన నగదును సులభంగా పక్కదారి పట్టించారు. ఈ రశీదులు చూపించి తాము నగదు బ్యాంకులోనే చెల్లించామంటూ వందల కొద్దీ ఖాతాదారులు బాంకు వద్దకు ఇప్పుడు క్యూ కడుతున్నారు. నకిలీ సీలు వేసిన రశీదు వుంటే అక్కడ తప్పని సరిగా మోసం జరిగినట్టేనని చెబుతున్నారు. ఈ మోసాలన్నీ మెసెంజర్‌ ఆలీఖాన్‌ నిర్వాకంగానే ఖాతాదారులు ఆరోపిస్తున్నారు.


గతంలోనూ ఇవే రకం అక్రమాలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఇలాంటి నకిలీ రశీదులతో జరిగిన అక్రమాలు ఆరేళ్ళ క్రితం బయటపడ్డాయి. కొందరు డ్వాక్రా సంఘమిత్రలతో అప్పటి క్యాషియర్‌ కుమ్మక్కవడంతో దాదాపు రూ.30 లక్షల దాకా వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో బ్యాంకు అధికారులు ఈ నకిలీ రశీదులకు కారణమైన క్యాషియర్‌ చర్యలను బదిలీతో సరిపుచ్చారు. అప్పట్లో బ్యాంకు ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే మెసెంజర్‌ ఆలీఖాన్‌ కూడా ఈ మార్గాన్నే ఎంచుకొని ఆరేళ్ళపాటు నిరాటంకంగా అక్రమ లావాదేవీలు కొనసాగించడానికి ఆస్కారమేర్పడింది.


డ్వాక్రా గ్రూపుల్లో పెరుగుతున్న స్వాహాయణం!

డ్వాక్రా గ్రూపుల లెక్కలను పరిశీలిస్తున్న నేపథ్యంలో బ్యాంకు పరంగా జరిగిన అక్రమాల మొత్తం పెరుగుతూనే వుంది. బుధవారం జరిగిన తనిఖీల్లో మరో రూ.27 లక్షలు పక్కదారి పట్టినట్లు వెల్లడయ్యింది. బుధవారానికి మొత్తం 69 గ్రూపుల్లో జరిగిన ఖాతాల పరిశీలనలో 42 గ్రూపుల్లో రూ.1,36,43,486 తారుమారు జరిగినట్లు గుర్తించారు. ఇంకా 155 గ్రూపుల ఖాతాలను పరిశీలించాల్సి వుంది. బుధవారం 50 గ్రూపులకు చెందిన మహిళలు పరిశీలనకు హాజరయ్యారు. అయితే బ్యాంకు అధికారులు లావాదేవీలకు సంబంధించిన స్టేట్‌మెంట్లు ఇవ్వకపోవడంతో కేవలం 16 గ్రూపులు మాత్రమే పరిశీలించగలిగారు.ఏరియా కోఆర్డినేటర్‌ రూతూ, ఏపీఎం సుబ్రమణ్యం ఆధ్వర్యంలో పరిశీలన కొనసాగనుంది. 


బ్యాంకులో తనిఖీలు ముమ్మరం

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో బుధవారం తనిఖీలు ముమ్మరం చేశారు. రెండు రోజులుగా ఇద్దరు అధికారులు పదేళ్ళ క్రితం నుంచి లెక్కలను, వాటి లావాదేవీలను వెలికి తీస్తున్నారు. బుధవారం సాయంకాలం వీరికి మరో నలుగురు అధికారులు జమయ్యారు. హైదరాబాదు నుంచి వచ్చిన విజిలెన్స్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు జరిగిన లావాదేవీలను వివిధ కోణాల్లో పరిశీలించేందుకు సన్నద్ధమవుతున్నారు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో బాంకులో పనులకు ఆటంకం కలగకుండా ఇతర ప్రాంతాల నుంచి ఐదుగురు కొత్త ఉద్యోగులను తాత్కాలికంగా నియమించారు. మరో వైపు డిపాజిట్లు, తాకట్టు బంగారు ఉపసంహరించుకొనే వారితో బ్యాంకు రద్దీగా తయారైంది.

Updated Date - 2021-09-02T16:39:09+05:30 IST