పెట్టుబడులు పైపైకి.. ధర పాతాళానికి!

ABN , First Publish Date - 2022-04-28T03:59:45+05:30 IST

పెట్టుబడులు ఎప్పటికప్పుడు అమాంతం పెరుగుతున్నాయి.. ధరలు మాత్రం ఏడాదికేడాది తగ్గుముఖం పడుతున్నాయి.

పెట్టుబడులు పైపైకి..  ధర పాతాళానికి!
కలిగిరి వేలం కేంద్రంలో కొనుగోలుకు ఉంచిన పొగాకు బేళ్లు

పొగాకు రైతుల ఆందోళన

నెల రోజులుగా రూ.185 దాటని వైనం

గరిష్ఠ ధర రూ.200 దాటితేనే ఉపయోగం

కలిగిరి, ఏప్రిల్‌ 27: పెట్టుబడులు ఎప్పటికప్పుడు అమాంతం పెరుగుతున్నాయి.. ధరలు మాత్రం ఏడాదికేడాది తగ్గుముఖం పడుతున్నాయి. కిలో గరిష్ఠంగా రూ.200 దాటితేనే రైతులకు ఉపయోగం ఉంటుందని భావిస్తుండగా గత నెల రోజులుగా ఒకటి రెండు రోజులు మినహా రూ.185 దాటలేదు. దీంతో పెట్టుబడులు పైపైకి.. ధర పాతాళానికా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో మార్చి 28వ తేదీన కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రైతుకు అందుతున్న ధరలో ఏ మాత్రం మార్పు లేదు. ప్రారంభ సమయంలో ధరలు పెంచకపోయినా రానురాను ధరలు పెరుగుతాయనే ఆశతో ఉన్న రైతులకు ధరలు పెరగకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది పెట్టుబడులు 20శాతం మేరకు పెరిగినా కొనుగోలు ధరలో పెరుగుదల లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభ సమయంలో కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.185 నమోదు కాగా నెలరోజుల్లో కేవలం ఒకటి రెండుసార్లు మాత్రమే ఒక రూపాయి పెరిగి రూ.186 పలికింది. నాలుగైదేళ్ల క్రితమే కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.200 వరకు పలికింది. ఏడాది కేడాది పంట సాగులో పెట్ట్టుబడులు, కూలీలు అమాంతం పెరిగినా ధరలు పెంచకపోతే తమకు గిట్టుబాటు ఎలా అని పొగాకు రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో మెట్ట ప్రాంత రైతులు ఎక్కువ శాతం పొగాకుపైనే ఆధారపడి జీవిస్తారు. ఒక బ్యారన్‌కు ఈ పంటను సాగుచేస్తే పెట్టుబడులు పోను రెండు మూడు లక్షల రూపాయలు ఆదాయం పొందవచ్చని భావించే రైతులకు ధర పెరుగుదల లేకపోవడంతో వచ్చిన సొమ్ము పెట్టుబడులకే సరిపోవడం లేదని, అప్పులు తీరేదెలా అని వాపోతున్నారు. పొగాకు వేలం ప్రారంభం నుంచి ఏప్రిల్‌ 26 నాటికి 9,842 బేళ్లను రైతులు విక్రయానికి తీసురాగా, 8,305 బేళ్లు అమ్ముడుపోయాయి. 1,537 బేళ్లు (సుమారు 15 శాతం) తిరస్కరణకు గురయ్యాయి. అదేవిధంగా బోర్డుకు విక్రయానికి వచ్చిన పొగాకును ఐటీసీ 55శాతం కొనుగోలు చేయగా మిగిలిన కంపెనీలు 45 శాతం మాత్రమే కొనుగోలు చేశాయి. కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో ఇప్పటి వరకు 10.9 లక్షల కిలోల పొగాకు అమ్మకాలు జరగగా రైతులకు రూ.19.73 కోట్ల అందాయి. ఈ అమ్మకాల్లో నాణ్యతను బట్టి అత్యధికంగా కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.186,  అత్యల్పంగా రూ.130, సగటు ధర రూ. 181.15గా నమోదైంది. అదేవిధంగా రెండో విడత కొనుగోళ్లు ప్రారంభమవుతున్న దృష్ట్యా రైతుల నుంచి వచ్చే పొగాకులో ఎక్కువ శాతం లోగ్రేడ్‌ పొగాకు ఉంటుందని, లోగ్రేడ్‌ పొగాకు ధరలు తగ్గించకుండా ఉంటేనే రైతు కోలుకుంటాడని, ఆ దిశగా బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

పెట్టుబడులు పెరిగాయి

ఈ ఏడాది పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. నాణ్యత కలిగిన పొగాకును కిలో గరిష్ఠ ధర రూ.200 తగ్గించకుండా కొనుగోలు చేస్తేనే రైతుకు పూర్తిస్థాయిలో మద్దతు ధర అందుతుంది.

- పూసాల వెంగపనాయుడు, పొగాకు రైతు, రావులకొల్లు



Updated Date - 2022-04-28T03:59:45+05:30 IST