కాళేశ్వరం పనులు వేగంగా..

ABN , First Publish Date - 2022-04-25T07:25:50+05:30 IST

జిల్లాలోని కాళేశ్వరం ప్యాకేజీ పనులు వేగంగా కొనసాగుతున్నా.. మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మాణం ఆలస్యమవుతోంది. పాత డిజైన్‌ మార్చి, రిజర్వాయర్‌ ఎత్తును పెంచేందుకు నిర్ణయించి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ముంపునకు గురయ్యే గ్రామాల వారు అడ్డుచెబుతున్నారు. పాత డిజైన్‌ ప్రకారమే నిర్మాణం చేయాలని ఇటు అధికారులకు, అటు ప్రజాప్రతినిధులకు బాధితులు విన్నవిస్తున్నారు.

కాళేశ్వరం పనులు వేగంగా..
మంచిప్ప పంప్‌హౌజ్‌ వద్ద కొనసాగుతున్న నిర్మాణ పనులు

జిల్లాలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్యాకేజీ పనులు

పంప్‌హౌజ్‌ల ద్వారా ట్రయల్‌రన్‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు

ప్యాకేజీ పనులలో కీలకమైన మంచిప్ప రిజర్వాయర్‌ 

భూసేకరణతో కొలిక్కిరాని చర్చలు

ఎత్తు పెంచవద్దంటున్న బాధిత రైతాంగం

వ్యవసాయమే ఆధారమంటూ మొర

రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని కాళేశ్వరం ప్యాకేజీ పనులు వేగంగా కొనసాగుతున్నా.. మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మాణం  ఆలస్యమవుతోంది. పాత డిజైన్‌ మార్చి, రిజర్వాయర్‌ ఎత్తును పెంచేందుకు నిర్ణయించి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ముంపునకు గురయ్యే గ్రామాల వారు అడ్డుచెబుతున్నారు. పాత డిజైన్‌ ప్రకారమే నిర్మాణం చేయాలని ఇటు అధికారులకు, అటు ప్రజాప్రతినిధులకు బాధితులు విన్నవిస్తున్నారు. తాము భూములను, ఇళ్లను కోల్పోతే.. వేరే ప్రాంతానికి వెళ్లి బతికే పరిస్థితి లేదని, ఎత్తు తగ్గించి నిర్మాణం చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాకు ఏళ్ల తరబడి ఉపయోగపడే ఈ రిజర్వాయర్‌ను ఎత్తు పెంచి నిర్మించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం 20, 21వ ప్యాకేజీ పనులు దగ్గర పడుతుండడంతో భూనిర్వాసితులతో సమావేశాలు జరుపుతున్నారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నారు.

వైఎస్‌ హయాంలోనే పనులు

జిల్లాలో వైఎస్‌ హయాంలోనే ప్రాణహిత-చేవెళ్ల పథకం కింద 20, 21, 22వ ప్యాకేజీ పనులను చేపట్టారు. ఎస్సారెస్పీ నుంచి బ్యాక్‌ వాటర్‌ తీసుకుని ఉమ్మడి జిల్లా పరిధిలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్ణయించారు. నవీపేట మండలం బినోల నుంచి నీటిని సొరంగమార్గం ద్వారా తరలించి సారంగపూర్‌ వద్ద పంప్‌హౌజ్‌ నిర్మాణం చేపట్టారు. ఈ పంప్‌హౌజ్‌ నుంచి మంచిప్పతో పాటు మెంట్రాజ్‌పల్లి వరకు నిజాంసాగ ర్‌ కాల్వ ద్వారా తరలించి సాగునీటిని అందించేవిధంగా డిజైన్‌ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్యాకేజీల డిజైన్‌ను మా ర్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కాల్వలకు బదులు, పైప్‌లైన్‌ల ద్వారా సాగునీటిని అందించేందుకు నిర్ణయించారు. ప్రాజెక్టు డిజైన్‌ కాస్ట్‌ కూడా 20, 21వ  ప్యాకేజీ  పరిధిలో రూ.2600 కోట్లుగా నిర్ణయించారు. ఈ ఎస్టిమేట్‌లోనే సారంగపూర్‌, మెంట్రాజ్‌పల్లి, మంచిప్ప, గడ్కోల్‌ వద్ద పంప్‌హౌజ్‌ల నిర్మాణంతో పాటు పైప్‌లైన్‌ల నిర్మాణం, రిజర్వాయర్‌ నిర్మాణానికి కేటాయింపులను చేశారు. గడిచిన రెండేళ్లుగా జిల్లాలోని 2లక్షల 25వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు పైప్‌లైన్‌ల నిర్మాణం చేస్తున్నారు. సారంగపూ ర్‌, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌజ్‌ల నిర్మాణం ఇప్పటికే పూర్తిచేసి న అధికారులు, ట్రయల్‌ రన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నా రు. ఈ వచ్చే వానాకాలం సీజన్‌కు సాగునీటిని జిల్లాలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని ఆయకట్టుకు పైప్‌లైన్‌ ద్వారా కొంతమేరకు సాగునీటిని అందిం చేందుకు పనులను పూర్తి చేస్తున్నారు. మంచిప్ప వద్ద గడ్కోల్‌కు నీటిని తరలించేందుకు పంప్‌హౌజ్‌ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. జిల్లాతో పాటు కామారెడ్డికీ నీటిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

3.5 టీఎంసీల నీటి నిల్వ కోసం..

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ నుంచి కాళేశ్వరం ప్యాకేజీగా మార్చిన అధికారులు మంచిప్ప రిజర్వాయర్‌ డిజైన్‌ కూడా మార్చారు. గతంలో కొండెం చెరువును, మంచిప్పను కలిపి 1.35 టీఎంసీల నిర్మాణం చేసేందుకు నిర్ణయించిన ఆ డిజైన్‌ ను మార్చి.. 3.5 టీఎంసీల నీటిని నిల్వ కోసం రిజర్వాయర్‌ను ఎత్తు పెంచేందు కు నిర్ణయించారు. ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వడంతో నిర్మాణం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ ద్వారా జిల్లాలో తాగునీటి కోసం ఒక టీఎంసీని వినియోగించనుండగా, కామారెడ్డి జిల్లాకు 22వ ప్యాకేజీ ద్వారా ఐదు టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఈ ప్రాజెక్టులో కీలకమైన భూ సేకరణ మాత్రం ఇంత వరకు పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచితే మొత్తం 2,400 ఎకరాల వరకు ముంపునకు గురవుతుంది. దీనిలో మంచిప్ప, భైరాపూర్‌, అమ్రాబాద్‌తో పాటు మొత్తం తొమ్మిది తండాలకు సంబంధించిన భూమి మునిగిపోతుంది. మంచిప్ప గ్రామానికి ఇబ్బంది లేకుండా భూములు మాత్రం కొంత ప్రాజెక్టు కింద పోతున్నాయి. మొత్తం భూమిలో అటవీశాఖకు చెందిన భూమి 750 ఎకరాలు ఉండగా, మిగతా భూమి రైతులది ఉంది. అటవీశాఖ భూములకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో పాటు పర్యావరణ అను మతులను కేంద్రం మంజూరు చేసింది. ముంపునకు గురయ్యే నిర్వాసితులు మాత్రం భూములు ఇచ్చేందుకు ఒప్పుకోవడంలేదు. మూడేళ్ల నుంచి అధికారులు చర్చలు జరుపుతూ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నారు.

వ్యవసాయమే జీవనాధారం

మంచిప్ప పరిధిలోని ముంపునకు గురయ్యే గ్రామాల్లో వ్యవసాయమే ఎక్కు వగా ఉంది. ఈ గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం భూ సేకరణ చేసిన ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ప్యాకేజీ ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పినా.. వ్యవసాయం చేసే వీరికి, ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళితే బతుకుదెరువుకు ఇబ్బందులు తలెత్తడంతో దూరంగా ఉం టున్నారు. ప్రభుత్వం ఎలాంటి ప్యాకేజీలు ఇచ్చినా తమ భూములను ఇవ్వమని, ఈ మధ్యనే రెండు దఫాలుగా వారితో చర్చలు జరిపిన అధికారులకు విన్నవించారు. గడిచిన వారం రోజుల్లో పలు దఫాలు మంచిప్ప వద్ద ధర్నాలు సైతం నిర్వహించారు. ప్రాజెక్టు పాత డిజైన్‌కు అనుగుణంగానే  రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. పాత డిజైన్‌ ప్రకారం 1.35 టీఎంసీ నీటి నిల్వలు చేస్తే గ్రామాలకు ఇబ్బందికాదని వారు విన్నవిస్తున్నారు. కొంతమంది రెండేళ్ల క్రితం కోర్టులో కూడా ప్రాజెక్టు ఎత్తు పెంచవద్దని పిటిషన్‌ వేశారు. ప్యాకేజీల నిర్మాణం పూర్తవుతున్నందున అధికారులు మాత్రం గ్రామాల వారిగా రైతులతో చర్చలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు కీలకమైన ఈ రిజార్వాయర్‌ను రైతులు, ముంపు గ్రామాల సమ్మతితోనే నిర్మించేందుకు ఏర్పాట్లను చేస్తున్నా రు. వారితో మరో దఫా చర్చలు జరిపి వారికి మంచి ప్యాకేజీ ఇచ్చేవిధం గా నచ్చజెప్పే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఈ లోపు పైప్‌లైన్‌ల ని ర్మాణంతో పాటు పంప్‌హౌజ్‌ల నిర్మాణం పూర్తి చేసేవిధంగా అధికారులు ప్రయ త్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్యాకేజీల నిర్మాణం చేపట్టి దశాబ్దానికి  పైగా నడిచినందున.. త్వరగా పూర్తిచేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

 పాత డిజైన్‌ ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలి

: రత్నమ్మ, బాధిత రైతు, మంచిప్ప

మంచిప్ప రిజర్వాయర్‌ ఎత్తు పెంచితే మా భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వం. పాత డిజైన్‌ ప్రకారమే రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చేపట్టాలి. భూములు ఇచ్చి మేము ఎక్కడికి వెళ్లి బతకాలి. వ్యవసాయమే మాకు జీవనాధారం. ఇప్పటికైనా ఈ విషయమై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించి బాధిత రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకోవాలి.

మాకు వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేదు

: శ్రీనివాస్‌యాదవ్‌, బాధిత రైతు, మంచిప్ప

మాకు వ్యవసాయం తప్ప వేరే వ్యాపారం లేదు. పంటలు పండే భూములు ఇస్తే తాము ఎట్లా బతకాలి. రైతుల అవసరాల కోసం మంచిప్ప రిజర్వాయర్‌ నిర్మిస్తున్నా.. భూములు కోల్పోయే రైతుల గురించి కూడా ప్రభుత్వ పాలకులు, అధికారులు పట్టించుకోవాలి. బాధితులకు నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మంచిప్ప రిజర్వాయర్‌ ఎత్తు పెంచవద్దు

: శంకర్‌నాయక్‌, బాధిత రైతు, మంచిప్ప

మంచిప్ప రిజర్వాయర్‌ ఎత్తు పెంచవద్దు. పాత డిజైన్‌ ప్రకారమే నిర్మాణం చేయాలి. ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలి. వ్యవసాయంపై ఆధారపడిన రైతుల భూములు కోల్పోకుండా చూడాలి. ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా భూము లు లేకుండా ఎట్లా బతుకుతాం. అధికారులు ఎత్తు పెంచకుండా నిర్మాణం చేయాలి.

రైతులతో చర్చలు జరుపుతున్నాం

: రవి, ఆర్‌డీవో, నిజామాబాద్‌

భూ సేకరణకు ఇంకా నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. రిజర్వాయర్‌కు ఎన్ని భూములు పోతాయో రైతులకు వివరిస్తున్నాం. వారితో చర్చలు జరుపుతున్నాం. రైతుల సమ్మతితోనే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు చేస్తాం. ఉన్నతాదికారుల దృష్టిలో ఉన్నందున.. రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్ణయం తీసుకుంటారు. 

Updated Date - 2022-04-25T07:25:50+05:30 IST