కాళేశ్వరం ఎత్తిపోతలు షురూ!

ABN , First Publish Date - 2021-06-18T09:11:36+05:30 IST

ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి పంపు హౌస్‌ నుంచి నాలుగు మోటార్లను గురువారం ప్రారంభించారు.

కాళేశ్వరం ఎత్తిపోతలు షురూ!

  • కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజీకి లిఫ్ట్‌ 
  • నంది, సరస్వతి, పార్వతి బ్యారేజీల్లోకి నీరు
  • గోదావరికి భారీగా ప్రాణహిత వరద 
  • మేడిగడ్డ వద్ద 11.67 టీఎంసీల నిల్వ
  • నీరు రావడంతో బ్యారేజీ 10 గేట్ల ఎత్తివేత 
  • దిగువకు 23,900 క్యూసెక్కుల నీరు

భూపాలపల్లి, పెద్దపల్లి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి పంపు హౌస్‌ నుంచి నాలుగు మోటార్లను గురువారం ప్రారంభించారు. ముందుగా ఒకటో మోటార్‌ను రన్‌ చేసి నీటిని గ్రావిటీ కెనాల్‌లోకి విడుదల చేశారు. ఆ తర్వాత 2, 5, 7 నంబర్ల మోటార్లను ఆన్‌ చేసి ఎనిమిది పంపుల ద్వారా గోదావరి జలాలను ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) బ్యారేజీకి లిఫ్టు చేస్తున్నారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున సుమారు 160 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. పెద్దపల్లి జిల్లాలోని నందిమేడారం వద్ద నిర్మించిన అండర్‌ టన్నెల్‌ ద్వారా బుధవారం రాత్రి ఒక పంప్‌ను ప్రారంభించి నంది రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయగా, గురువారం రెండు మోటార్లను ప్రారంభించారు.


 అలాగే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మి బ్యారేజీ నుంచి రెండు మోటార్ల ద్వారా నీటిని సరస్వతి బ్యారేజీలోకి ఎత్తిపోస్తున్నారు. సరస్వతి పంప్‌హౌస్‌ నుంచి సుందిళ్ల వద్ద గల పార్వతి బ్యారేజీలోకి రెండు మోటార్ల ద్వారా 5, 860 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నీటి మట్టాలు పెరిగిన తర్వాత శుక్రవారం పార్వతి పంప్‌హౌస్‌ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని వదలనున్నట్లు జల వనరుల శాఖాధికారులు పేర్కొన్నారు. గురువారం నాటికి శ్రీపాద ఎల్లపంల్లి ప్రాజెక్టులో 20.175 టీఎంసీలకు గాను 9.42 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి నంది పంప్‌హౌ్‌సలోకి 6, 300 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతుండగా, అక్కడి నుంచి కరీంనగర్‌ జిల్లా రామడుగులోగల గాయత్రి పంప్‌హౌ్‌సలోకి, అక్కడి నుంచి మిడ్‌ మానేరులోకి నీటిని వదులుతున్నారు. 


ప్రాణహిత పరుగులు 

మరోవైపు ప్రాణహిత నది పరుగులు పెడుతోంది. మహారాష్ట్రలో వారం రోజులుగా భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో తెలంగాణలో కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహితలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రోజుకు 39వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో కాళేశ్వరం వద్ద గోదావరికి జలకళ సంతరించుకుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ వద్ద 11.25 టీఎంసీల నీళ్లు చేరాయి. వరద నీరు పెరుగుతుండటంతో బ్యారేజీ నుంచి 10 గేట్లను ఎత్తి, 23,900 క్యూసెక్కుల వదులుతున్నారు.

Updated Date - 2021-06-18T09:11:36+05:30 IST