కాళేశ్వరంలో మునగాల్సిందేనా?

ABN , First Publish Date - 2022-06-03T09:06:13+05:30 IST

భూపాలపల్లి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎక్కడో వందల కి.మీ దూరంలో సాగు నీరందించేందుకు కట్టిన ఈ జలాశయంతో మా పంటలు నీట మునిగిపోతున్నాయి.

కాళేశ్వరంలో మునగాల్సిందేనా?

మూడేళ్లుగా రైతులకు అందని పంట పరిహారం

మేడిగడ్డకు ఇరువైపులా వెయ్యి ఎకరాల్లో ముంపు..

అన్నారం వద్ద 200 ఎకరాలకు నీటి ఊట

ముంపు ప్రాంతాల్లో జరగని భూసేకరణ..

సర్వేలు పూర్తి చేసి చేతులు దులుపుకొన్న సర్కారు

భూపాలపల్లి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎక్కడో వందల కి.మీ దూరంలో సాగు నీరందించేందుకు కట్టిన ఈ జలాశయంతో మా పంటలు నీట మునిగిపోతున్నాయి. మూడేళ్లుగా ఇదే పరిస్థితి. ఈ భూములను తీసుకుంటామని ప్రభుత్వం సర్వేలు నిర్వహించింది. కానీ, మార్కెట్‌ ధరలో సగం కూడా ఇవ్వడానికి సర్కారుకు మనసొప్పడం లేదు. ఒకప్పుడు బంగారం పండిన నేలలు.. ఇప్పుడు బ్యాక్‌వాటర్‌తో నీటిలోనే ఉంటున్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మా పాలిట శాపంగా మారింది’’ ఇది కాళేశ్వరం బ్యారేజీల వల్ల ముంపునకు గురవుతున్న రైతుల ఆవేదన.

కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్‌ 21న సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా గోదావరి నదిపై భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించారు. దీని ఎగువన రైతులు మిర్చి, పత్తి, వరి పంటలను సాగు చేస్తుంటారు. బ్యారేజీకి ఇరువైపులా తెలంగాణ, మహారాష్ట్రలో సుమారు వెయ్యి ఎకరాల మేర బ్యాక్‌వాటర్‌తో మూడు పంటలు నీట మునుగుతున్నాయి. మరోవైపు, అన్నారం బ్యారేజీ కింద కాటారం మండలం పరిధిలోని ఐదారు గ్రామాలకు చెందిన 200 ఎకరాల సాగు భూముల్లోకి గోదావరి జలాలు ఊటగా వస్తున్నాయి. దీంతో పంటలు దెబ్బతింటున్నాయి. గత మూడు పంటల విషయంలో ప్రభుత్వం సర్వే చేసి చేతులు దులుపుకొందే తప్ప.. రైతులకు పరిహారం ఇవ్వలేదు. 2019లో ఎకరాకు రూ.5వేల పరిహారం ఇవ్వటానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రైతులు దీనిని తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వం ఆ మాటే ఎత్తలేదు. అధికారులు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప.. భూసేకరణ చేపట్టడం లేదు. మూడేళ్లుగా పంటల నష్ట పరిహారం కాగితాలకే పరిమితమవుతోంది. ఇప్పుడు మళ్లీ వానాకాలం రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళనకు దిగటంతో ప్రభుత్వం భూసేకరణకు ఆదేశించింది. బ్యారేజీ ఎగువన తెలంగాణ వైపు సుమారు 600 ఎకరాలు, మహారాష్ట్ర వైపు సుమారు 410 ఎకరాలు నీ ట మునిగాయి. దీంతో 2020లో నీటిపారుద ల, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. తెలంగాణవైపు 340 ఎకరాలు, మహారాష్ట్రవైపు 338 ఎకరాలు మునిగిపోతున్నాయని గుర్తించారు. అయితే ఇంకో 200 ఎకరాల భూములు కూడా ముంపునకు గురవుతున్నాయని, మరో వంద ఎకరాల్లో నీటి ఊట చేరుతోందని  రైతులు అధికారులకు వినతులు సమర్పించారు. మళ్లీ సర్వే చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఈ సర్వే చేసి  ఏడాదిన్నర గడుస్తున్నా భూసేకరణకు ప్రభుత్వం ముందుకు రావటం లేదు. ముంపునకు గురైన ప్రతి ఎకరానూ కాన్సెంట్‌ అవార్డు కింద తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో బ్యా రేజీ నిర్మాణానికి ముందు కాన్సెంట్‌ అవార్డు కింద ఎకరాకు రూ.10.50 లక్షలు చెల్లించారు. ప్రస్తుతం కాన్సెంట్‌ అవార్డుతో పాటు ఎకరా కు రూ.18 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చే స్తున్నారు. మేడిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఎక రా రూ.25లక్షల నుంచి రూ.35 లక్షల వరకు పలుకుతోంది. కానీ, ప్రభుత్వం పాత లెక్కల ప్రకారమే జనరల్‌ అవార్డు కింద ముంపు భూములను తీసుకోవాలని చూస్తోందని రై తులు చెబుతున్నారు. వానాకాలం ప్రారం భం కాకముందే భూసేకరణ పూర్తి చేసి, ఎకరాకు రూ.18 లక్షలతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ప్రభుత్వం చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఊటతో పంటలకు చేటు..

భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఐదారు గ్రామాల్లో 200 ఎకరాలకు పై గా గోదావరి ఊట నీళ్లతో పంటలు దెబ్బతింటున్నాయి. వీటిలో గతంలో సుమారు 50 ఎకరాల వరకు భూసేకరణ చేసి, ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహా రం అందించింది. అయితే మరోసారి సర్వే చేసి, మిగతా భూములకు కూడా పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీతో ప్రాణహిత నదికి కూడా బ్యాక్‌ వాటర్‌ పెరిగి కాళేశ్వరంతో పాటు మంచిర్యాల జిల్లా కోటపల్లి, అర్జునగుట్ట, మహారాష్ట్ర సిరోంచ తాలుకాలోని పలు గ్రామాల్లో పంటలు నీట మునుగుతున్నాయి. భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, ప్రాణహిత నది బ్యాక్‌ వాటర్‌తో సు మారు ఐదారు వేల ఎకరాల్లోకి నీళ్లు రావ టం.. లేదా ఊట చేరటం వంటి సమస్యలున్నాయి. ప్రభుత్వం వెంటనే భూసేకరణ చేపట్టి, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2022-06-03T09:06:13+05:30 IST