కాళేశ్వరం సాక్షిగా కనికట్టు

ABN , First Publish Date - 2020-11-14T06:13:31+05:30 IST

కాళేశ్వరం కొత్త ప్రాజెక్టే. విభజన చట్టం ప్రకారం బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి. ఈ ప్రాజెక్టుకి నీటివాటాల కేటాయింపు ఏ ట్రైబ్యునల్ ద్వారా జరగలేదు. వివిధ ప్రాజెక్టుల మధ్య గోదావరి జలాల కేటాయింపులు పరస్పర ఒడంబడిక ద్వారా....

కాళేశ్వరం సాక్షిగా కనికట్టు

కాళేశ్వరం కొత్త ప్రాజెక్టే. విభజన చట్టం ప్రకారం బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి. ఈ ప్రాజెక్టుకి నీటివాటాల కేటాయింపు ఏ ట్రైబ్యునల్ ద్వారా జరగలేదు. వివిధ ప్రాజెక్టుల మధ్య గోదావరి జలాల కేటాయింపులు పరస్పర ఒడంబడిక ద్వారా గానీ, ట్రైబ్యునల్ ఉత్తర్వులద్వారా గానీ జరగాలి. ఇవేమీ జరగకుండానే, ఆంధ్రప్రదేశ్‌ని పట్టించుకోకుండానే సాంకేతిక అనుమతులు ఇచ్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మూలాన గోదావరి డెల్టా, పోలవరంపైన ఎటువంటి ప్రభావం ఉండగలదన్న అంచనా చేయకుండానే అనుమతులిచ్చేశారు. తెలంగాణా నిరంతరం జలవనరుల వినియోగానికి సంబంధించి విభజన చట్టానికి తూట్లు పొడుస్తూనే ఉంది.


కొన్నిరోజుల క్రితం జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులు, అటవీభూముల అధీనానికి ఇచ్చిన అనుమతులపై ఒక తీర్పు విలువరించింది. అందులోని అంశాలను పరిశీలిస్తే తెలంగాణా ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత తొందరపడిందో ఎన్ని అవకతవలకు పాల్పడిందో విశదమవుతుంది. మొదటి నుంచే గాక ఇప్పుడు కూడా తెలంగాణా చెప్పే మాట, పాడేపాట ఒకటే. ఈ పథకం కొత్తది కాదు పాతదే అని చెబుతూ పర్యావరణ అనుమతులు వచ్చేవరకు అందులోని తాగునీటి వంతు భాగం పనులు మాత్రమే చేపట్టామని పదేపదే పేర్కొంది. అనుమతులు లభించాకే సాగునీటి సంబంధిత పనులు చేపట్టినట్లు చెప్పుకుంటూ వచ్చింది. ఆ మధ్య జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా కాళేశ్వరం పథకం ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినదేనని, అందువల్ల విభజన చట్టం ప్రకారం బోర్డ్ ద్వారా సాంకేతిక అనుమతులు పొందవలసిన అవసరం లేదని వాదించింది. ఈ వాదన సత్యదూరమని ట్రైబ్యునల్ తన కడపటి తీర్పులో చాలా విస్పష్టంగా పేర్కొంది. 


పాత ప్రాణహిత– చేవెళ్ళ పధకానికి 2014లో పర్యావరణ అనుమతులకోసం దరఖాస్తు చేశారు కానీ, ఆ పథకంలో సమూలంగా మార్పులు చేసిందున దాన్ని వెనక్కి తీసుకున్నారు. జి 9 సబ్‌బేసిన్‌లో తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ఉపనదిపై బ్యారేజ్ నిర్మించి 169 టిఎంసిలతో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా పాత పథకానికి రూపకల్పన చేశారు. తర్వాత దానిని, గోదావరి నదిలో ప్రాణహిత కలిసే చోటకు ఆవలగా (జి 10 సబ్‌బేసిన్) ఉన్న మేడిగడ్డకు మార్చారు. నీటి పరిమాణాన్ని 160 నుంచి 194 టిఎంసిలకు (ట్రైబ్యునల్ తీర్పులో ఇది 180 టిఎంసిలుగా పేర్కొన్నారు), సాగు విస్తీర్ణాన్ని 18 లక్షల పెంచారు. ఇన్ని సమూల మార్పులు చేసి ఈ పథకం పాతదే అనటం సమంజసమేనా? ఈ కొత్తపథకానికి పర్యావరణ అనుమతుల కోసం 2017 జనవరిలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను అర్థించారు. చట్టబద్ధ అనుమతులు లభించేవరకు ఈ పథకానికి సంబంధించి ఏ విధమైన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టవద్దని తెలంగాణా ప్రభుత్వాన్ని ఎన్‌జిటి అదే ఏడాది అక్టోబర్‌ 5వ తేదీన ఆదేశించింది. తాగునీటి పథకం అని చెప్తున్నప్పటికీ ప్రథమంగా అది సాగునీటి ప్రాజెక్టేననీ, కనుక చట్టప్రకారం పర్యావరణ అనుమతులు పొందవలసిందేనని స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేయగా సాంకేతిక అంశాన్ని కారణంగా చూపుతూ కోర్టు ట్రైబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసింది. అయినప్పటికీ, సరైన పర్యావరణ అనుమతులు వచ్చేవరకు, సాగునీటి భాగం పనులను చేపట్టకూడదని, అటవీభూములలోనికి చొరబడకూడదని, ఒక్కచెట్టు కూడా నరకడానికి వీలు లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.


ఈ పథకానికి కేంద్ర పర్యావరణశాఖ 2017 అక్టోబర్‌ 22న అనుమతులు మంజూరు చేసింది. అంతకుముందు అటవీశాఖ అటవీభూముల అధీనానికి రెండు దఫాలుగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణశాఖ జారీ చేసిన అనుమతులను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌పైనే ప్రస్తుతం ట్రైబ్యునల్ తీర్పు వెలువడింది. 2008 నుంచి 2017 వరకు, అనగా, అనుమతులు లభించేవరకు కేవలం తాగునీటి సంబంధిత పనులు మాత్రమే జరిగాయనడం నమ్మశక్యంగా లేదని ట్రైబ్యునల్‌ పేర్కొంది. ‘తన వాదనకు ఋజువుగా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పత్రాలు దాఖలు చేయలేదు. పైగా ప్రాజెక్టు పనులు చాలావరకు పూర్తయ్యాయి. పథకానికి సంబంధించి వివరమైన సాంకేతిక నివేదిక పంపలేదు’ అని వ్యాఖ్యానించింది. ప్రాజెక్ట్ చాలామట్టుకు పూర్తి అయినందున అన్ని నిబంధనలూ పాటించబడినవా లేదా అనే అంశాన్ని పరిశీలించడం మాత్రమే చేయగలమని అంటూ ఏడుగురి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టుని క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా ఆదేశించింది. ఒక విధంగా తెలంగాణా వివిధ శాఖలను మభ్య పెడుతూ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి ట్రైబ్యునల్‌కు, గోదావరిజలాల నిర్వహణ బోర్డుకు, అపెక్స్ కౌన్సిల్‌కు ఒక జరిగిన పనిగా (ఫయిట్ అకంప్లై) చూపింది. 


తెలంగాణా అసలు సిసలైన కనికట్టు కేంద్ర జలసంఘం నుంచి జలసంబంధ (హైడ్రలాజికల్) అనుమతి పొందటంలో ప్రదర్శించింది. ఏదైనా ప్రాజెక్టుని కేంద్రజలసంఘం ఆధ్వర్యంలో ఉన్న సాంకేతికసలహా సంఘం సమీక్షించి జలసంబంధ అనుమతులు మంజూరు చేసేందుకు 2017 లో కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. ప్రతిపాదనలు సరిగా ఉన్నాయా లేదా, సాధ్యాసాధ్యాలు ఏమిటన్నవి నిర్మాణం చేపట్టడానికి ముందే పరిశీలించడానికి ఉద్దేశించబడినవి ఇవి. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్ట్ మొదలు పెట్టకముందే, అనుమతులు మంజూరు కాక ముందే, వివరణతో కూడిన నివేదికలన్నీ సహపరీవాహక ప్రాంత రాష్ట్రాలకు పంపాలి. కానీ, తెలంగాణ ఈ ప్రక్రియ జరగకుండా కార్యక్రమాలు నడిపించింది.


ఈ సాంకేతిక సలహా సంఘం ద్వారా 06.06.2018న కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రలాజికల్‌ అనుమతులు లభించాయని దినపత్రికలలో వచ్చిన వార్తలాధారంగా ఆంధ్రప్రదేశ్‌కు అర్ధమయ్యింది. ఈ వ్యవహారంలో కేంద్ర జలసంఘ హైడ్రాలజీ డైరెక్టరేట్ హస్తంకూడా ఉంది. 1980 గోదావరి ట్రైబ్యునల్ నివేదికలోని అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం తెలంగాణా ఆంధ్రప్రదేశ్‌కీ కలిపి 75 శాతం విశ్వసనీయతతో 1480 టి.ఎం.సిల లభ్యత ఉందని ఈ డైరెక్టరేట్ ఉటంకించింది. అసలు ఇటువంటి ఒడంబడికే లేదు. పోనీ విభజన తర్వాత కుదిరిన పరస్పర ఒడంబడికా లేదు. కేంద్ర జలసంఘం మేడిగడ్డ దగ్గర నీటి లభ్యతని వర్షపాత ఆధారంగా 282.3 టి.ఎం.సిలని లెక్క కట్టింది. ఈ వేసిన లెక్కలలో పై రాష్ట్రాల ఉపయోగాలనీ, ఉపయోగసరళినీ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అంచనా దోష పూరితమైనదని ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఇక, సాధ్యాసాధ్యాల పరిశీలన జరగకుండా ఏదైనా ప్రాజెక్ట్ కనుక మొదలుపెడితే అటువంటి వాటిని అనుమతులు లేనివిగా పరిగణించాలని మార్గదర్శకాలలో (పేరా 4.28) స్పష్టంగా ఉంది. తెలంగాణా ఈ ప్రాజెక్టుకి పరిపాలనా అనుమతులు మార్చ్ –ఏప్రిల్ 2016లో మంజూరు చేసింది. పనులు వెంటనే ప్రారంభమయినాయి. కానీ సాంకేతిక అనుమతులు జూన్ 2018 లో రెండేళ్ళ తర్వాత వచ్చాయి.


ముందు చెప్పినట్లుగా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టే. విభజన చట్టం ప్రకారం బోర్డు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి. అసలు ఈ ప్రాజెక్టుకి నీటివాటాల కేటాయింపు ఏ ట్రైబ్యునల్ ద్వారా జరగలేదు. జనవరి 2016 గోదావరి బోర్డు మీటింగులో తెలంగాణాయే ఒప్పుకుంది. వివిధ ప్రాజెక్టుల మధ్య గోదావరి జలాల కేటాయింపులు పరస్పర ఒడంబడిక ద్వారా లేక ట్రైబ్యునల్ ఉత్తర్వులద్వారా గానీ జరగాలి. ఇవేమీ జరగకుండానే, ఆంధ్రప్రదేశ్‌ని పట్టించుకోకుండానే తెలంగాణా, కేంద్రజలసంఘం జతకలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి దిగువన 150 ఏళ్ల చరిత్ర గల గోదావరి డెల్టా, పోలవరం ప్రాజెక్టులున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మూలాన వీటిపైన ఎటువంటి ప్రభావం ఉండగలదన్న అంచనా చేయకుండానే అనుమతులిచ్చేశారు.


ఆ ప్రాజెక్టు సింహభాగం పూర్తయ్యింది. పాలారు నదిలో 1.4 టి.ఎం.సిల వినియోగానికి కిందనున్న తమిళనాడుని సంప్రదించారు. అటువంటిది 194 టి.ఎం.సిల వినియోగమున్న పై ప్రాజెక్టు అనుమతులకు ఆంధ్రప్రదేశ్‌కి ఉప్పు అందకుండా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ చేసిన అభ్యర్ధన మేరకు 21.09.2016 న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగులో కొత్తగా చేపట్టిన తెలంగాణా ప్రాజెక్టుల ప్రస్తావన వచ్చింది గానీ ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏమీ విడిగా చర్చ జరగలేదు. జలసంబంధ అనుమతులు పారదర్శకత లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రతికూలమైనవిగా హానికరమైనవిగా జరిగాయి. తెలంగాణా నిరంతరం జలవనరుల వినియోగానికి సంబంధించి విభజన చట్టానికి తూట్లు పొడుస్తూనే ఉంది. తెలంగాణాని నదీజలాల విషయంలో బోర్డు గానీ కేంద్రప్రభుత్వం గానీ ముందు ముందు కట్టడి చేసేట్టుగా ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎత్తిపోతల పధకానికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని నిషేధాజ్ఞలు తెచ్చారు. అదే తెలంగాణా అందరినీ మభ్యపెట్టి పనులు కొనసాగించింది. మీరు నడిచిన మార్గంలో మేమెందుకు నడవకూడదు అంటే ఆగ్రహిస్తారు. నదిని మాయం చేయగలం తస్మాత్ జాగ్రత్త అంటారు. నెలకొల్పే ట్రైబ్యునల్ ముందు తన ప్రయోజనాలకి భంగం కలగకుండా తెలంగాణాని కట్టడి చేసేటట్టుగా ఆంధ్రప్రదేశ్‌ వ్యూహాన్ని రూపొందించి వాదనలు వినిపించాలి. లేకపోతే వెన్నెముకలైన కృష్ణా గోదావరి డెల్టాలు రెండు కూడా వట్టిపోతాయి. పోలవరం ప్రాజెక్ట్ ఫలితాలు అనుకున్నట్లుగా ఉండవు.


కురుమద్దాలి వెంకట సుబ్బారావు

Updated Date - 2020-11-14T06:13:31+05:30 IST